Home కరీంనగర్ ఆర్‌టిసి ప్రజల ఆస్తిగా భావించాలి : ఈటెల రాజేందర్

ఆర్‌టిసి ప్రజల ఆస్తిగా భావించాలి : ఈటెల రాజేందర్

Eetelaమన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : ఆర్‌టిసి ప్రజల ఆస్తిగా భావించి, సంస్థ అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ బస్ స్టేషన్‌ను ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణతో కలిసి సందర్శించారు. రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, బస్టాండును పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు, బడి పిల్లలకు, రైతులకు రవాణా సదుపాయాలు కల్పించడానికి ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థ ఒక ప్రక్క ప్రయాణీకులకు మెరుగైన సేవలందిస్తూ, లాభాల బాటలో ఉండడానికి, సంస్థ ఆస్తుల ద్వారా షాపింగ్ కాంప్లెక్స్‌లు, అద్దెల రూపేణా, ఇతరత్రా మార్గాలను అన్వేషిస్తున్న దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 75 కోట్లు ఆర్టీసికి అందించడం, జంట నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగుల పాసుల రాయితీలకు జిహెచ్‌ఎంసి 18 కోట్లు సంస్థకు చెల్లించడం జరుగుతుందని, సంస్థకు స్థానిక ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సీలు వారి నియోజకవర్గ అభివృద్ధి నుండి కార్పొరేషన్ కు 10 కోట్లు సహకారం అందించాలన్నారు.  అన్ని రూట్లలో బస్సులను నడపాలని, సమయపాలన పాటించడం, సామాజిక దృక్పథంతో సౌకర్యాలు, పారిశుద్ధం నిర్వహణ వంటి అంశాలను సంస్థ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ఆర్టీసీ ఇడి సత్యనారాయణ, ఆర్‌ఎం చంద్రశేఖర్, డిపో మేనేజర్లు, సిబ్బంది, సంస్థ కార్మికులు పాల్గొన్నారు.