Home తాజా వార్తలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: హరీశ్‌రావు

అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: హరీశ్‌రావు

Harish Rao Press meet on Kaleshwaram irrigation project

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. తప్పుడు కేసులతో భూ సేకరణను అడ్డుకున్నారని, అలాగే అనుమతుల్లేవని రెండో ప్రయత్నంలో అడ్డుపడ్డారని ఆయన మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, అధికార దాహంతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు అధికారమే పరమావధి అని దుయ్యబట్టారు. చంద్రబాబు మాదిరిగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాణహిత చేవేళ్లను మేం ఏ రోజైనా అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో గోదావరిపై ఒక్క ప్రాజెక్టైనా పూర్తైందా, పోచంపాడు ప్రాజెక్టును 37 ఏల్లు నిర్మించారని మంత్రి విమర్శించారు.

అలాగే లోయర్ పెన్‌గంగా పనులు గడప కూడా దాటలేదని, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద లక్షా 50వేల ఎకరాలకు నీళ్లిస్తామని.. ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రాజెక్టులకు అనుమతులు రాకుండానే ప్రారంభోత్సవాలు చేశారన్నారు. గోదావరిలో తెలంగాణకు హక్కున్న పూర్తినీటిని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మల్లన్నసాగర్‌కు కోదండరాం, దామోదర రాజనర్సింహా కారులో వెళ్లారని తెలిపారు. చనిపోయిన రైతుల పేరుతో కాంగ్రెస్ నేతలు కేసులు వేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శవ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలెవరూ కలిసి రాలేదన్నారు. తెలంగాణ పొలాల్లోకి కాళేశ్వరం నీళ్లొస్తే తమకు పుట్టగతులుండవనే ఇలా చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.