Home మహబూబ్‌నగర్ తీరు మారాలి

తీరు మారాలి

jupalli-krishna-rao22ఆర్డీఓ, తహసీల్దార్‌కు జూపల్లి మందలింపు, ఆర్‌ఆర్ సెంటర్‌లో పనుల జాప్యంపై ఆగ్రహం

గట్టు: అభివృద్ధి పనులకు ప్రజలు సహకారం అందించాలి. అదేవిధంగా బాధితులకు అవసరమైన సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలి. లేకపోతే మీపై శాఖాపరమైన చర్యలు తప్పవని భారీ పరిశ్రమల శాఖ మం త్రి జూపల్లికృష్ణారావు హెచ్చరించారు. గురువారం నెట్టెం పాడు ప్రాజెక్టు పరిధిలోని ముంపునకు గురైన చిన్నోనుపల్లి, ముచ్చోనుపల్లి, ఆలూరు ముంపునకు గురైన గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, అక్కడ నెలకొన్న సమస్యలపైన ప్రజలతో మమేకమై ఆరాతీశారు. చిన్నోనుపల్లి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తీసుకు న్నప్పటికి నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేయకపోవడాన్ని మంత్రి తప్పుపట్టారు. ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సరిపోదని కాబట్టి మళ్లీ తమకు సరైన న్యాయం చేసేటట్లు చర్యలు తీసు కోవాలని మంత్రిని కోరారు. అయితే గతంలో ఒకసారి పరిహారం పొంది మళ్లీ ఇలా అడగడం సరైంది కాదని అయినప్పటికీ మీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు తగిన న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పునరావాస కేంద్రంలో 360 ఇళ్ల నిర్మాణాలను నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. అయితే నిర్వాసితులు మాత్రం ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయాలని కోరగా దీనిపై మంత్రి స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా జలాశయం పనులను మూడు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా సంబంధిత గుత్తెదారులకు మంత్రి ఆదేశించారు. అదేవిధంగా దీంతో పాటు ముచ్చోనుపల్లి జలాశయం ఆనకట్ట నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలూరు పునరావాస కేంద్రంలో చోటు చేసుకున్న ఇళ్ల పట్టాల అవకతవకలపై ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, తహశీల్దార్ సత్తయ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదికను తక్షణమే అందించాలని అదేవిధంగా మీ పనితీరు కూడా మార్చుకోవాలంటూ చురకలంటించారు. పునరావాస కేంద్రంలో మౌలిక సదుపాయాలైనా తాగునీరు, రహదారులు, స్మశాన వాటికలను తక్షణమే ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మెన్ భాస్కర్, నియోజకవర్గ ఇంఛార్జి కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రాజెక్టుల సీఈ ఖగేందర్, ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, అన్ని మండలాల జెడ్పిటిసిలు, ఎంపిపిలు, వైస్ ఎంపిపిలు, సర్పంచులు పాల్గొన్నారు.