Search
Friday 16 November 2018
  • :
  • :

నేతకు ఊతంలో మనమే నం.1

 Minister KTR participated in the Delhi meeting

చేనేతరంగం అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన స్మృతి ఇరానీ
ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న మంత్రి కెటిఆర్ వెల్లడి

మన తెలంగాణ/ న్యూఢిల్లీ: చేనేత అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారని తెలంగాణ రాష్ట్ర జౌళిశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. గురువారం ఢిల్లీలోని ఎన్‌డిఎంసి కన్వెషన్ సెంటర్‌లో మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత, హస్తకళల రంగానికి ఊతమిచ్చే దిశలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన విలువైన సూచనలు ఇచ్చారు. ఇదే సందర్భంలో చేనేత అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో వివరించా రు. అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి చేనేత కార్మికుల సంక్షేమం కోసం 1270 కోట్ల భారీ బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేకం గా రెండు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నూలుకు, అద్దకాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు వేతనాలు పెరిగే విధంగా యాభై శాతం సబ్సిడీతో 35 శాతం కార్మికుడికి వేతన రూపంలో చేరేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.

రాష్ట్రంలో చేనేత మగ్గాలు ఎక్కడ ఉన్న వాటికి యూనిక్ కోడ్ ఏర్పాటు చేసి, చేనేత కార్మికుడి సమస్యలను తీర్చేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. యూనిక్ కోడ్ ద్వారా చేనేత రంగాన్ని పని కల్పించడంతోపాటు, అభివృద్దికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. సామాజిక భద్రత కోసం, నేతన్నకు చేయూత అనే కార్యక్రమం ద్వారా కార్మికుడి రూపాయి కడితే రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు ఇస్తుందని, ఈ పథకంపై చేనేత, పవర్ లూం కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుడి నేసిన గుడ్డని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తారక రామారావు వివరించారు. ప్రధానంగా గురువారం జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయ్యాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం జిఎస్‌టి పేరుతో అనేక శ్లాబ్‌ల కింద 5,10, 18 శాతం వరకు పన్నులు వసూలు చేస్తున్నారని తెలిపారు. వాటిఅన్నింటినీ ఒకే శ్లాబ్ కింద ఐదు శాతానికి తేవాలని కోరామని, తప్పకుండా చేస్తాం అని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. తెలంగాణలో 14 చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేయ్యాలని కేంద్ర మంత్రిని కోరామని, తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి అనుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని అందిస్తామని మంత్రి తెలిపారు. దేశంలో చేనేత కార్మికుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని, మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఆదర్శంగా తీసుకోవాలని సమావేశంలో కేంద్ర మంత్రి సూచించారని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కెటిఆర్‌తో పాటు, జౌళి శాఖ డైరెక్టర్ శైలజ రామాయర్, అడిషనల్ శ్రీనివాస రెడ్డిలు హాజరయ్యారు.

Comments

comments