హైదరాబాద్: పొరపాటున మహాకూటమి గెలిస్తే నెలన్నరకో సిఎం మారతాడని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. సోమవారం సోమాజిగూడలో టిఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా కెటిఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో నాలుగు పార్టీలు ఒక వ్యక్తిని ఓడించేందుకు కలిసాయంటే.. ఎవరు బలవంతులో, ఎవరు బలహీనులో ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్ కోరారు.
గత ప్రభుత్వాలు డబ్బా ఇళ్లు కట్టిస్తే.. టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించిందని, గత పాలకులు కట్టించిన ఏడిళ్లకు మేం కట్టించిన ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సమానమన్నారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగించాలంటే.. అది ఒక్క కెసిఆర్ కు మాత్రమే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. అవి కొనసాగాలంటే టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. మహాకూటమిలో 40 మంది సిఎంలు ఉన్నారని, తెలంగాణకు సీల్డ్ కవర్ సిఎం కావాలా?.. లేదా సింహంలాంటి కెసిఆర్ సిఎం కావాలా? ప్రజలే తేల్చుకోవాలని మంత్రి కెటిఆర్ అన్నారు.