Home తాజా వార్తలు ఫుల్ జోష్‌లో టీమిండియా

ఫుల్ జోష్‌లో టీమిండియా

Minister KTR Visits Uppal Stadium To Watch Cricket Match

మన తెలంగాణ/ హైదరాబాద్: తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను పురస్కరించుకుని భారత జట్టు బుధవారం ఉప్పల్ స్టేడియంలో ముమ్మర సాధన చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, పృథ్వీషా, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అశ్విన్, సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె తదితరులు ముమ్మర సాధన చేశారు. నెట్స్‌లో క్రికెటర్లు చాలా సేపు శ్రమించారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు అతని సహాయక బృందం ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో నిమగ్నమైంది. కాగా, ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ జయకేతనం ఎగుర వేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో పృథ్వీషా అద్భుత సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అతను ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. రిషబ్ పంత్, పుజారా, అజింక్య రహానెలు భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశారు. కెప్టెన్ కోహ్లి, జడేజాలు ఇప్పటికే శతకాలు కొట్టి అద్భుత ఫాంలో ఉన్నారు. కుల్దీప్ యాదవ్, అశ్విన్, జడేజా, ఉమేశ్, షమిలతో బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. దీంతో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.