Home జనగామ సమస్యల పరిష్కారం కోరితే బెదిరింపులా

సమస్యల పరిష్కారం కోరితే బెదిరింపులా

Minister Ponnala Laxmaiah Speech About CM KCR

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి : ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి మయం చేసి అప్పుల రాష్ట్రంగా మార్చిన అవినీతి చక్రవర్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఏలాంటి ధర్నాలు, రాస్తారోకోలు ఉండవని చెప్పిన కెసిఆర్ ప్రజల ఆకాంక్షను, మనోభావాలను తెలిపే ధర్నాచౌక్ ను ఎత్తివేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందని అన్నారు. ఆర్‌టిఎస్ కార్మికు లు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తామంటే విధుల నుండి తొలగిస్తామని బెదిరించడం ఆప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమలు కాని హామీలను ప్రవేశపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో 6 లక్షల ఎకరాల భూసేకరణ న్యాయబద్దంగా జరిపి భూనిర్వాసితులకు డబ్బులు చెల్లించిందని కాని టీఆర్‌ఎస్ పాలనలో బలవంతంగా ప్రజలనుండి భూసేకరణ చేసేందుకు ప్రయత్నించడం వల్ల న్యాయస్థానం పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా మార్పులేదన్నారు. ముస్లీం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నేటికి అమలుకు నోచుకోలేదని రంజాన్ వేడుకల్లో అజ్మీర్‌లో ముస్టీం మైనార్టీలకు 5 కోట్లతో భవన నిర్మాణాన్ని చేపడతాననడం కొత్త జిమ్మక్కులతో మభ్యపెట్టడం హాస్యాస్పదం అన్నారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వ సంస్థలచే కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల ఖాతల్లో డబ్బులు జమచేస్తామని చెప్పిన నేటి వరకు 1500 కోట్ల రూపాయలు రైతులకు బాకీ చెల్లించాల్సి ఉందన్నారు.

జనగామలో 150 కోట్లు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం నాబార్డు నుండి 1000 కోట్లు అప్పులు తెచ్చారని కొత్త పథకంతో 95 లక్షల సాగుభూమి ఉందని ప్రభుత్వమే ప్రకటించి 140 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించడం జరిగిందని 43 లక్షల ఎకరాల భూమికి సాగులేకున్నా 1720 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. కౌలు రైతులకు ఆసైండు, పోడు, గిరిజన, దేవాలయ భూములను సాగుచేస్తున్న రైతులకు కూడా పంట సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు నామ మాత్రపు అరకొర వేతనాలను చెల్లించడం సరైందికాదన్నారు. టీఆర్‌ఎస్ పరిపాలన తమ గెలుపు కోసం అనేక జిమ్మిక్కులను చేస్తూ ప్రజలను, ఉద్యోగస్థులను మభ్యపెడుతూ తమ పబ్బం గడుపుకోవాలని  ఆలోచన ఉన్న కేసీఆర్‌కు రాబోవు ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తుతారని అన్నారు. అనంతరం చేర్యాల, బచ్చన్నపేట, రఘునాధపెల్లి, మండలాలకు చెందిన  వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎండి. అన్వర్, ఆకుల వేణుగోపాల్‌రావు, దర్మపురి శ్రీనివాస్, పన్నీరు రాధిక, వేమల్ల పద్మ, చెంచారపు బుచ్చిరెడ్డి, రంగరాజు ప్రనీణ్‌కుమార్, జక్కుల వేణుమాధవ్, రంగురవి, ఎండి మాజీద్, వకులాభరణం నర్సయ్య, ఎస్సీ సెల్ నియోజకవర్గ ఇంచార్జీ కడారి నగేశ్, తదితరులు ఉన్నారు.