Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

సౌదీ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి

చివరి క్షణంలో కూల్చివేసిన భద్రతా సిబ్బంది
యెమెన్ స్థావరాలపై సౌదీ సంకీర్ణం వైమానిక దాడులు
ఇరాన్ పాత్రపై తీవ్ర స్థాయిలో విమర్శలు

Saudi-Attackరియాద్ : సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయం లక్షంగా యెమన్ హౌతీ రెబెల్స్ సంచలనాత్మక రీతిలో క్షిపణి దాడికి దిగారు. యెమెన్‌లోని తిరుగుబాటుదార్లు ఏకంగా క్షిపణి దాడికి దిగడం ప్రపంచవ్యాప్తంగా కల కలం సృష్టించింది. క్షిపణి ప్రయోగాన్ని సకాలంలో గుర్తించి పేట్రియాట్ రక్షణ వ్యవస్థ స్పందించి, దూసుకువస్తున్న క్షిపణిని మార్గమధ్యంలోనే కూల్చివేసింది. దీనితో పెనుముప్పు తప్పింది. ఈ క్షిపణి దాడికి దిగింది తామేనని యెమన్‌లోని హౌతీ ఆధ్వర్యపు ప్రభుత్వ మంత్రి ఒకరు వెల్లడించారు. క్షిపణి ప్రయోగంపై సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వెనువెంటనే యెమన్‌లోని హౌతీ రెబెల్ స్థావరాలను లక్షంగా చేసుకుని వైమానిక దాడులకు దిగాయి. దీనితో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆదివారం ఉదయం 8.౦7 గంటలకు హౌతీ రెబెల్స్ క్షిపణిని ప్రయోగించారు. క్షిపణి రియాద్ వైపు దూసుకువస్తుండగా మధ్యలోనే క్షిపణి విచ్ఛిన్న వ్యవస్థతో సౌదీ అరేబియా బలగాలు కూల్చివేశాయి. ఈ క్షిపణి విమానాశ్రయానికి తూర్పు దిక్కున నిర్మానుష్య ప్రాంతంలో ముక్కలు అయి కుప్పకూలింది. అయితే కొన్ని శకలాలు విమానాశ్రయంలో పడ్డాయి. ఎయిర్‌పోర్టులో భారీ స్థాయిలో చప్పుళ్లు విన్పించినట్లు అక్కడి వారు తెలిపారు. అయితే విమానాశ్రయానికి ఎటువంటి నష్టం జరగలేదని , క్షిపణి ప్రభావం రియాద్‌పై ఏ విధంగా కూడా లేదని అధికారులు తెలిపారు. సౌదీ రాజధానిని దెబ్బతీయడం ద్వారా తమ సత్తా చాటుకోవాలనుకున్నట్లు వెల్లడించారు. ఈ రెబెల్స్‌కు ఇరాన్ మద్దతు ఉంది. దాడితో సౌదీలో అన్ని చోట్లా భద్రతా యంత్రాంగం అప్రమత్తం అయింది.
12౦౦ కిలోమీటర్ల దూరం నుంచి
శక్తివంతమైన క్షిపణిని దాదాపు 12౦౦ కిలోమీటర్ల దూరం నుంచి తిరుగుబాటుదార్లు ప్రయోగించినట్లు నిర్థారణ అయింది. దూర ప్రాంతం నుంచి తిరుగు బాటుదార్లు దాడికి దిగడంతో అన్ని దేశాలలోనూ ఆందోళన వ్యక్తం అయింది. ఈ దాడికి బుర్ఖన్ 2 హెచ్ స్వదేశీ మిస్సైల్‌ను వాడినట్లు తెలిసింది. ఇది దీర్ఘశ్రేణి క్షిపణి అని, యెమన్ రాజధాని సనాపై సౌదీ సంకీర్ణ దళాల దాడికి ప్రతీకారంగానే రియాద్‌పై దాడికి దిగినట్లు తిరుగుబాటుదార్లు వెల్లడించారు. నిత్యం వేలాది మంది ప్రయాణికుల తాకిడి ఉండే రియాద్ విమానాశ్రయానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని , అంతా సురక్షితంగా ఉందని సౌదీ ప్రభుత్వం తెలిపింది. దాడితో విమానాల రాకపోకలలో ఎలాంటి మార్పులు జరగలేదని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు సౌదీ అరేబియా సేనలు యెమన్‌లో దాడులకు దిగుతూ ఉండటం ఇప్పటి క్షిపణి ప్రయోగానికి దారితీసింది. ఉగ్రవాదులకు మద్దతు పలికే దేశాల అండతోనే హౌతీ రెబెల్స్ ఇప్పుడు ఈ దుస్సాహసానికి పాల్పడినట్లు సౌదీ అరేబియా పరోక్షంగా ఇరాన్‌పై విరుచుకుపడింది. ఈ ఏడాది జులైలో కూడా యెమెన్ నుంచి సౌదీలోని మక్కా ప్రాంతంపైకి దూసుకువచ్చిన క్షిపణిని సౌదీ రక్షక దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
మరిన్ని దాడులు : హౌతీ ప్రతినిధి సలామ్
సౌదీనే తొలుత యుద్ధం మొదలు పెట్టిందని, దీనికి ప్రతి గా తాము స్పందిస్తామని సౌదీ అరేబియా భూభాగం లక్షంగా దాడులు ఉంటాయని ఇటీవలే అల్‌జజీరాకు ఇచ్చిన ఇంటర్వూలో హౌతీ ప్రతినిధి అబ్దుల్ సలాం తెలిపారు. ప్రత్యేకించి అక్కడి సైనిక స్థావరాలను, సౌదీ విమానాలను లక్షంగా చేసుకుని దాడులు చేస్తాం అని హెచ్చరించారు.యెమెన్ భూభాగంలోని సైనిక స్థావరాల పై ఎగిరే సౌదీ విమానాలను కుప్పకూలుస్తామని తెలిపా రు. అబూదాబి ఇతర దేశాలూ యెమెన్‌ను టార్గెట్ చేసుకుంటున్నాయని, తమ వైపు కన్నేస్తే తప్పనిసరిగా తమ మిస్సైల్స్ దెబ్బకు బలి కావాల్సిందేనని హెచ్చరించిన వారం రోజులకే ఇప్పటి క్షిపణి దాడి జరిగింది.

Comments

comments