Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

‘గల్లంతయిన’ ఎంఎల్‌ఎలు చివరికి సభకు

Congress-MLA,s

బెంగళూరు : కాంగ్రెస్ క్యాంప్‌నకు రాకుండా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం కర్నాటక అసెంబ్లీకి హాజరు అయ్యారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కన్పించడం లేదని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. అయితే ఈ ఇద్దరిని బెంగళూరులోని ఒక ప్రముఖ హోటల్‌లో పార్టీ నేతలు కనుగొన్నారు. ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ అనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను తాము పోలీసు రక్షణతో అసెంబ్లీకి తీసుకువచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల గల్లంతు పార్టీ వర్గాలను కలవరపరిచింది. పార్టీ సంక్షోభాల నివారణలో పేరొందిన సీనియర్ నేత డికె శివకుమార్ వారి కోసం గాలింపు చేపట్టారు. తమకు దక్కిన సమాచారంతో వారు ఒక హోటల్‌లో బస చేసినట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి వారిని కనుగొన్నారు. చాలా ఆలస్యంగా అయినా వారిని సభకు చేర్చారు. అయితే ప్రమాణస్వీకారానికి వారి పేర్లను ప్రొటెం స్పీకర్ పిలిచినప్పుడు వారు సభలో లేరు. దీనితో కాంగ్రెస్ వర్గాలు కలవరం చెందాయి.

ఈ లోగానే ఇద్దరు ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించారు. అంతకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు సభ్యులు కన్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సభలో బలపరీక్ష సమయానికి వారు వస్తారని, పార్టీకి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభాపక్ష నేత సిద్ధరామయ్య ఎమ్మెల్యేలంతా సభకు హాజరు కావాలని విప్ జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలను కలవకపోవడం, పార్టీ క్యాంప్‌ల్లో ఉండకపోవడం చర్చకు దారితీసింది. వారి ఆచూకీ కోసం చివరికి కాంగ్రెస్ నేతలు పోలీసుల సాయం కోరారు. వారికి తాము విప్ జారీ చేయాల్సి ఉందని, వారి ఉనికి తెలియచేయాలని అభ్యర్థించారు. ఈ దశలో వారు ఒక హోటల్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర డిజిపి నీలమణి ఎన్ రాజు ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు ఆ హోటల్‌కు వెళ్లడం, అక్కడున్న ఎమ్మెల్యేలను గుర్తించడం వారిని భద్రతతో అసెంబ్లీకి చేర్చడం జరిగిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Comments

comments