Search
Wednesday 18 July 2018
  • :
  • :

యథేచ్ఛగా తవ్వుతున్నారు

Mission Bhagiradha Works In Suryapet District

సూర్యాపేటలో రోడ్లను తవ్వి మిషన్ భగీరథ పథకం పైపులు వేసే పని గత కొన్ని నెలలుగా నత్తకు పోటీగా… నత్తనడకన పను లు సాగుతున్నాయి. యథేచ్చగా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా రోడ్లను ఇరువైపులా గుంతలు తీస్తూ వదిలేయడం పరిపాటైంది. రోజులలో చేయాల్సిన పనులను నెలల తరబడి చేస్తూ నిత్యం ప్రజలు, వాహనదారులకు ప్రమాదంగా మారి ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతుంది. పనులను సకాలంలో చేయకపోవడంతో తీసిన గుంతలలో పడి పలువురు ప్రమాదానికి గురయ్యారు. కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. పట్టణంలో రోడ్లను తవ్వుతూ వదిలేస్తున్న తతంగంపై మన తెలంగాణ ప్రత్యేక కథనం.
పని జరిగే ప్రాంతంలో ఇబ్బందులు ఉంటాయని కేవలం ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా పోలీసు వారు ఏర్పాటు చేసుకున్న ఒకటి, రెండు బోర్డులు తప్పిచ్చి పనులు చేస్తున్న ప్రాంతంలో బోర్డులు లేకపోవడం గమనార్హం.

మన తెలంగాణ/సూర్యాపేట : మిషన్ భగీరథ మంచినీటి పథకం కోసం గత కొన్ని నెలలుగా సూర్యాపేట పొట్టి శ్రీరాములు సెంటర్, ఈద్గా రోడ్డు, ఖమ్మం రోడ్డు ప్రాంతాలలో పైపులు వేసే పని కొనసాగుతుంది. నల్లాలబావి ప్రాంతంలో రెండు వైపులా హెచ్చరికలు లేకుండా రోడ్డును తవ్వుతుండడంతో అనేక ప్రమాదాలు జరిగాయి. రాత్రివేళల్లో పనిచేసే ప్రాంతాలలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయలేదు.

ఇంకా ఎన్నేళ్లు : పనులను సకాలంలో పూర్తి చేసి ట్రాఫిక్‌కు ఎలాంటి ఇ బ్బ ందులు కలగకుండా చూడాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్షంగా వ్యవ హరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గుంతలు తవ్వి నెలల తరబడి ఉంచడంతో ప్రమాదాలు జరగడమేగాదు.. ఇప్పటికే జఠిలంగా ఉన్న ట్రాఫిక్ సమస్య మ రింత ఇబ్బందిగా మారింది. గడువులోపల పూర్తి చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్ల పట్టింపులేని ధోరణి, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పరిస్థితిని మరింత ఎగుడుదిగుడుగా తయారైంది.
పైపులు వేసిన కాడ బాగుజేసేదెన్నడు : పొట్టి శ్రీరాములు సెంటర్, శంకర్ విలాస్ సెంటర్‌లలో పైపులు వేయడం పూర్తయింది. కానీ అప్పటి వరకు అక్కడ ఉన్న మంచి రోడ్డు తవ్వడంతో గుంతలుగా తయారై మట్టితో నిండింది. అయితే అక్కడ ఇంతకు ముందు ఉన్న విధంగా సీసీ రోడ్డుగానీ, తారు రోడ్డుగానీ పూర్వం ఉన్న ప్రకారం గుంతలన్ని పూడ్చి నున్నగా చేయకపోవడంతో ట్రాఫి క్‌కు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి.
జిల్లా కేంద్రంలోనే నత్తనడకన : సూర్యాపేట జిల్లా కేంద్రం ఏర్పడిన నాటి నుండి పట్టణంలో రద్దీ బాగా పెరిగిపోయింది. వాస్తవానికి పట్టణంలో పైపులు వేసే పనులు మొదలుపెడితే చకచకా పూర్తి చేయాల్సి ఉంది. త్వరితంగా పూర్తి చేసి రోడ్డుని తిరిగి అందంగా యధావిధిగా చేయాల్సి ఉంది. అయితే పనులు నెలల తరబడి నత్తనడకన కొనసాగడమేగాకుండా పైపులు పూర్తయిన చోట్ల రోడ్లకు పూర్వ వైభవం రాకపోవడంతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పట్టణంలో పైపులు వేసే పనిని సకాలంలో పూర్తి చేయాలని అందుకు సంబంధించిన అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments