Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మిషన్ కాకతీయ నాల్గవ దశ

sampadakeyam

రాష్ట్రంలోని 46,500 చెరువులను ఐదేళ్లలో మరమ్మత్తు చేసే నిమిత్తం ‘మిషన్ కాకతీయ’ పేరుతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న బృహత్ కృషి నాల్గవ దశలో ప్రవేశించింది. ఈ దశ కింద 5073 చెరువులను గుర్తించారు. గడచిన మూడు సంవత్సరాల్లో 23,233 చెరువులను కాంట్రాక్టు ఇవ్వగా ఇప్పటికి 17,000 చెరువుల పనులు పూర్తయినాయి. గత మూడేళ్లలో వివిధ కారణాల రీత్యా మిగిలిపోయిన 6,000 చెరువుల మరమ్మత్తులను కూడా ఈ సంవత్సరం పూర్తిచేయాలని ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్‌రావు పట్టుదలతో ఉన్నారు. కాకతీయుల కాలం నుంచీ తెలంగాణ వ్యవసాయానికి వెన్నుదన్ను అయిన చెరువుల వ్యవస్థ గత ప్రభుత్వాల కాలంలో నిర్లక్షానికి గురైంది. భారీమధ్యతరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వాలు చిన్ననీటి వసతులను పట్టించుకోకపోవటంవల్ల చెరువులు పూడికలెత్తాయి. పలుచోట్ల ఆక్రమణలకు గురైనాయి. దాంతో భూగర్భ నీటిమట్టం కిందకు వెళ్లింది. బోరుబావులు విపరీతంగా పెరిగాయి. ఉచిత కరెంట్ ఇచ్చినా గిట్టుబాటుకాని పరిస్థితులు దాపురించాయి. జలధార కోసం బోర్లు మరింత లోతుకు వేయటం, ఒకటికినాల్గు బోర్లు వేసినా నీరు తగలక పోవటంతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతులున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి, రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెరువుల పూడికతీసే పథకానికి శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాలను సేద్యపునీటి సాగుకిందకు తేవాలన్న కృత నిశ్చయంతో ప్రాజెక్టుల రీడిజైనింగ్, ఇరిగేషన్ శాఖకు ఏటా పాతికవేలకోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో తన ప్రాధాన్యతలేమిటో స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రతి ఇంటికీ నల్లానీరు ఇచ్చేందుకు ఉద్దేశించి ‘మిషన్ భగీరథ’ పేరుతో మరో బృహత్ కార్యక్రమాన్ని శరవేగంతో పూర్తి చేస్తున్నారు. త్వరలోనే అనేక గ్రామాల్లో ప్రతి ఇంటికీ రక్షిత నీరు అందనుంది. ఈ పైపు మార్గాలవెంట ఇంటర్నెట్ కేబుల్ కూడా వేస్తున్నందున బ్రాడ్‌బాండ్ సేవలు గ్రామాలకు అందుబాటులోకి వస్తాయి.
చెరువుల పూడికతీసేందుకు 2015లో శ్రీకారం చుట్టిన ‘మిషన్ కాకతీయ’ కింద ఏటా 9,500 చెరువుల పునరుద్ధరణకు లక్ష నిర్దేశన జరిగింది. ఇందులో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేశారు. చెరువుల్లో పూడికతీసిన ఒండ్రుమట్టిని పంటపొలాలకు చేర్చటం ఇందులో భాగం. దీనివల్ల వ్యవసాయ భూములు సారవంతమై పంట దిగుబడులు పెరుగుతాయి. చెరువుల్లో వర్షపునీటి నిల్వ వల్ల భూగర్భ జలాలు ఉబికి వస్తాయి. బోర్లకు సైతం నీరు సులభంగా లభ్యమవుతుంది. ఒకవేళ ఒక ఏడాది ప్రకృతి వికటించినా వ్యవసాయానికి ఢోకా ఉండదని భావించటం జరుగుతున్నది.
అయితే లక్షం మేరకు చెరువుల పునరుద్ధరణ పూర్తికాకపోవటానికి కాంట్రాక్టర్లు సకాలంలో పనులు చేపట్టకపోవటం, కాంట్రాక్టర్ల ప్రామాణికత తక్కువగా ఉన్నందున ప్రభుత్వమే కొన్ని కాంట్రాక్టులు రద్దుచేయటం, అలాగే కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించటంలో జాగువంటి వాటిని కారణాలుగా మంత్రి పేర్కొన్నారు. అయితే గత సంవత్సరాల్లో పూర్తిచేసిన పనులకు ప్రభుత్వంనుంచి చెల్లింపులు పెండింగ్‌లోఉండడం కాంట్రాక్టర్లను నిరుత్సాహ పరుస్తున్నదనే ఆరోపణ ఉంది. అనుభవంనుంచి నేర్చుకున్నామని, లోపాలను సరిదిద్ది నిర్ణీత లక్షాలను చేరుకుంటామంటున్న హరీష్‌రావు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవటం అవసరం. చెరువుల్లో పూడిక చేరటం ప్రతివర్షాకాలంలో జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఐదుపదేళ్ల కొకమారైనా పూడిక తీస్తుండాలి. ఈ మైనర్ ఇరిగేషన్ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించే విషయాన్ని కొత్త పంచాయతీచట్టం రూపకల్పన సందర్భంలో పరిశీలించదగింది.

Comments

comments