Home మెదక్ లాకౌట్ దిశగా మిట్టపల్లి ఆర్చ్?

లాకౌట్ దిశగా మిట్టపల్లి ఆర్చ్?

ఏడాది కాలంగా నిలిచిపోయిన పనులు
కరెంటు కట్…చీకట్లోనే విధులకు హాజరవుతున్న కార్మికులు
ఆందోళనలో 470 మంది కార్మికులు
రైతులకు అందని పంట నష్టపరిహారం
కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న యాజమాన్యం
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
ARCHమన తెలంగాణ/సిద్దిపేట : సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ఒక్కగానొక్క కంపెనీ మూత పడే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ కంపెనీ మీద ఆధారపడ్డ కుటుంబాల భవిష్యత్తు ప్రశ్రార్థకంగా మారింది. సిద్దిపేట మండలం మిట్టపల్లి శివారులో గత 20 ఏళ్ల క్రితం వెలసిన ఆర్చ్ ఫార్మా(తర్వాత వాట్సల్‌గా మార్చారు) కంపెనీ గత ఏడాది కాలంగా పనులు నిలిపి వేయడంతో కార్మికులు..ఇవ్వాల..రేపు కంపెనీలో ఉత్పత్తి ప్రారంభిస్తారంటూ బోలెడంత ఆశతో వేతనాలు ఇవ్వకున్నా రోజువారి విధులకు హాజరవుతున్నారు. మంత్రి హరీశ్‌రావు జోక్యంతో కంపెనీ నడుస్తుందని సిఎండి అజిత్ కామత్ తెలిపినా..నేటికీ ఉలుకూ.. పలు కూ లేకపోవడంతో కార్మికులు గత వారం రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యేగా ఉన్న కాలం లో 1995లో సిద్దిపేట మండలం మిట్టపల్లి శివారులో 150 ఎకరాలలో ఆర్చ్ కంపెనీని ప్రారంభించారు. పారి శ్రామికంగా సిద్దిపేట ఏరియాలో ఒక్క మధ్యతరగతి కంపెనీ లేకపోవడంతో ఆర్చ్ కంపెనీ వెలియడంతో కార్మిక లోకం సంతోష పడ్డారు. మొదట్లో వంద మంది కార్మికులతో ప్రారంభమైన కంపెనీ తర్వాత పనితీరు పుంజుకోవడానికి 120 మంది పర్మినెంట్, 350 మంది కాంట్రాక్టు ప్రాతిపదికన కార్మికులను తీసుకోవడం జ రిగింది. ఒక దశలో జిల్లాలో ఆర్చ్ కంపెనీకి ఉన్న మిగ తా యూనిట్లు వివిధ కారణాలతో నడవకున్నా… మిట్టపల్లి కంపెనీ ద్వారానే వారికి ఆదాయం అధికంగా వచ్చేది. అందుకే మిట్టపల్లి యూనిట్‌ను వారు కంపెనీకి మదర్ ప్లాంట్‌గా పేర్కొనేవారు. కంపెనీలో రసాయన మందులకు సంబంధించిన ముడి సరుకును బల్క్ డ్రగ్స్ ఇంటర్ మీడియట్ స్టేజీ వరకు వారు తయారు చేసి ఫార్మా కంపెనీలకు వారు ఎగుమతులు చేసేవారు. ఈక్రమంలో గత రెండు, మూడేళ్లుగా సిద్దిపేట ఆర్చ్ కంపెనీని యాజమాన్యం పట్టించుకోవడం మానేశారు. నాలుగు షిప్టులు నడిపించాల్సిన చోట ఒక్క షిప్టుకూడా నడిపించని పరిస్థితి నెలకొనడం, జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితిలోకి తీసుకొచ్చారు. గత ఏడాది డి సెంబర్ మాసం నుంచి కంపెనీ ప్రొడక్షన్‌ను మొత్తానికి నిలిపివేశారు. కంపెనీ ఉత్పత్తి నిలిపేసినా యాజమా న్యం కార్మికులకు మాత్రం ఏ విషయం చెప్పక… ఏడాది కాలంగా వారి జీవితాలతో ఆడుకుంటున్నది. ఏడాది నుంచి 10 మంది వరకు కంపెనీని టేకప్ చేయడానికి వస్తూ, పోతుండడంతో వెనుకా ముందు కంపెనీ పుఃన ప్రారంభం కాకపోతుందా అనే ఆశతో కార్మికులు రోజు వారీ విధులకు హాజరవుతూ వస్తున్నారు. గత 6 నెలల క్రితం కంపెనీకి సంబంధించిన కరెంటు సరఫరాను సైతం నిలిపివేయడంతో చీకట్లోనే కార్మికులు ఉండాల్సి వస్తుంది.
మంత్రి హరీశ్ జోక్యంతో…
ఏడాది కాలంగా కంపెనీ ఉత్పత్తి నిలిపివేయడంతో పా టు జీత, భత్యాలు ఇవ్వకపోవడంతో కార్మికులు గత డిసెంబర్ మాసంలో సమస్యను స్థానిక ఎమ్మెల్యే, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు వెల్లదీయడం కష్టంగా మారిందని వారు వాపోయారు. స్పందించిన మంత్రి హరీశ్‌రావు కంపెనీ సిఎండి అజిత్ కామత్‌తో మాట్లాడి కంపెనీ ఉత్పత్తి మొదలు పెట్టడం తో పాటు కార్మికులకు జీతాలు అందించాలని కోరారు. మంత్రి ఆదేశంతో గత డిసెంబర్ 19 వరకల్లా జీతం డ బ్బులు చెల్లిస్తామని, ఉత్పత్తి ప్రారంభిస్తామని యాజమా న్యం కార్మికులకు తెలుపడం జరిగింది. ఈక్రమంలో ప్లాంటు బాధ్యతలు చూస్తున్న వైస్ ప్రెసిడెంట్ వసంత్‌రెడ్డిని కార్మికులు జీతం డబ్బులు చెల్లించాలని కోరగా..తాను సెలవులో ఉన్నానని, కంపెనీకి రాజీనా మా చేస్తున్నట్లు తెలుపడంతో కార్మికుల గుండెల్లో రా ళ్లుపడినట్లైంది. ఇక కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఓపిక నసించిన కార్మికులు డిసెంబర్ 28 నుంచి రిలే దీక్షలకు పూనుకున్నారు. గత ఆరు రోజులుగా వారు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
రైతులకు అందని పరిహారం…
రసాయన పరిశ్రమ కావడంతో కంపెనీ నుంచి వచ్చిన వ్యర్థ జలాలు, రసాయనాలతో కంపెనీ పరిసర ప్రాంతా ల్లోని వ్యవసాయపొలాలు కాలుష్య కాసారాలుగా మారాయి. ఒప్పందం ప్రకారం పంట నష్ట పోతున్న రైతులకు 6 నెలల కొకసారి పరిహారం అందించాల్సి ఉండగా, గత 2 ఏళ్లుగా పరిహారం చెల్లించకపోవడంతో రైతులు గొల్లు మంటున్నారు. నేడు పంట పండించుకో వాల్సిన పరిస్థితి లేదని, కంపెనీతో విషతుల్యంతో పం టలు ఎదగడం లేదన్నారు.
ప్రశ్నార్థకంగా కార్మికుల భవిష్యత్తు!
పరిశ్రమలు లేని సిద్దిపేట ప్రాంతంలో కంపెనీలో జాబ్ వచ్చిందని సంతోషపడ్డారు. వేరే ఉపాధి ఎందుకు జీవిత కాలం పాటు కంపెనీ సాగుతుందని, తమ జీవితానికి డోకా లేదని వారు భావించారు. నేడు కంపెనీ మూత దశకు రావడంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఏడాది కాలంగా జీతాలు లేకుండా విధులకు హాజరవుతూ…భవిష్యత్తులో కంపెనీ సాగక పోదా అన్న ఆశ.. అడియాసగానే మారుతుంది.
ఆర్చ్ కంపెనీని ఎవరైనా టేకాఫ్ చేస్తేగాని.. సమస్య పరిష్కారం అయ్యేలా లేదు.. లేదా..కంపెనీ వారు ప్లాంట్ సాగేలా చర్యలు తీసుకుం టే కార్మికులకు మేలు జరుగుతుంది. లేని పక్షంలో సిద్దిపేట ఏరియాలో ఉన్న ఏకైక మధ్యతరగతి పరిశ్రమ మూతపడే అవ కాశాలు లేకపోలేదు..
కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి :మంత్రి
సిద్దిపేట మండలం మిట్టపల్లి ఆర్చ్ ఫార్మా కంపెనీ సజావుగా సాగేలా తనవం తు కృషి చేస్తానని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వారికి హామీ ఇచ్చారు. కంపెనీ నడవకపోవడంతో పాటు జీతాలు చెల్లించక పోవడంతో కార్మిక జెఎసి నాయకులు కిషన్ యాదవ్, ఎల్లారెడ్డి, భూపాల్ యాదవ్, రమేష్, ఎల్లారెడ్డి తదితరులు శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలిశారు. తమ సమస్యలను విషయాన్ని అయన దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీ సాగేలా, జీతం డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటా నని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్‌కు సైతం శనివారం వారు వినతి పత్రం సమర్పించారు. లేబర్ కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని వారు తెలిపారు.
కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : మంద పవన్
కార్మికుల శ్రమ శక్తితో కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న యాజమాన్యం నేడు కంపెనీని నిలిపివేసి వారికి అన్యాయం చేస్తుందని ఎఐటియుసి జిల్లా నాయకులు మంద పవన్ పేర్కొన్నారు. మిట్టపల్లి ఆర్చ్ కంపెనీ వద్ద కొనసా గుతున్న రిలే దీక్షలు శనివారం నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు సంఘీభావం ప్రకటించిన మంద పవన్ మాట్లాడుతూ సిద్దిపేట ప్రాంతంలో ఉన్న ఏకైక పరిశ్రమ మూతపడకుండా మంత్రి హరీశ్‌రావు చొరవతీసు కోవాలని ఆయన కోరారు. కార్మికుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఊరు కోబోమని ఆయన హెచ్చరించారు. కంపెనీలో ఉత్పత్తి కొనసాగించి, కార్మి కులకు జీత బత్యాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీక్షల్లో విరూపాక్షరెడ్డి, సత్యం, లక్ష్మణ్, శ్రీధర్‌రెడ్డి, రజని, యాదగిరి, బాబు, సన్యాసి రావు తదితరులు కూర్చోగా. .కార్మికులు పాల్గొన్నారు.