Home అంతర్జాతీయ వార్తలు సమ్మతితో కాదు, బలాత్కారం

సమ్మతితో కాదు, బలాత్కారం

అక్బర్ లైంగిక చేష్టలపై జర్నలిస్టు పల్లవి ధ్వజం 

Metoo, MJ Akbar , Journalist Pallavi Gogoi

వాషింగ్టన్ : మాజీ మంత్రి, జర్నలిస్టు ఎంజె అక్బర్‌పై అమెరికాకు చెందిన జర్నలిస్టు పల్లవి గొగోయ్ తమ దాడిని తీవ్రతరం చేశారు. అక్బర్ తనతో బలవంతంగా, అధికార దర్పంతో సంబంధాలు పెట్టుకున్నాడని ఈ జర్నలిస్టు స్పష్టం చేశారు. మహిళా జర్నలిస్టు సమ్మతితోనే ఆమెతో తాను లైంగిక సంబంధాలు పెట్టుకున్నానని అక్బర్ చెప్పడాన్ని ఆమె తోసిపుచ్చారు. తాను ఇండియాలో ఆయన పరిధిలో పత్రికలో పనిచేస్తున్నప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పల్లవి గొగోయ్ ఆరోపించడం సంచలనానికి దారితీసింది.

ఆమెతో తనకున్నది ఇష్టాపూర్వక లైంగిక సంబంధం అని అక్బర్ చెపుతూ వస్తున్నారు. అయితే ఈ వాదనను నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్‌పిఆర్) చీఫ్ బిజినెస్ ఎడిటర్ అయిన పల్లవి గొగోయ్ ఖండించారు. తాను నిజాలే చెపుతానని, నేరానికి పాల్పడి అబద్థాలకు దిగే అక్బర్ బాపతు కాదని పల్లవి తమ ట్విట్టర్‌లో తెలిపారు. తనపై అక్బర్ అత్యాచారానికి పాల్పడిన అంశం గురించి వాషింగ్టన్ పోస్టుకు తాను ఇచ్చిన ఇంటర్వూలోని ప్రతి అక్షరంతో తాను కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు.

తన లాగా ఇతర మహిళలు ఇటువంటి వారికి బలి కాకూడదనే అభిప్రాయంతో తాను నిజాలను వెల్లడిస్తున్నట్లు , ఆయన పాలిట బడి అత్యాచారానికి గురయిన మహిళలు తనను చూసైనా నిజాలు తెలియచేసేందుకు ముందుకు వస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తాను ఎదుర్కొన్న అవమానాన్ని నిజాయితీతో నిర్భీతితో వెల్లడిస్తానని స్పష్టం చేశారు. 67 సంవత్సరాల అక్బర్ ఇటీవలి కాలం వరకూ మోడీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే మీ టూ ఉద్యమ నేపథ్యంలో ఆయనపై పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

తొలుత తనకు వీటితో సంబంధం లేదని చెపుతూ వచ్చిన అక్బర్ విదేశీ పర్యటన నుంచి రాగానే పదవికి రాజీనామా చేశారు. వాషింగ్టన్ పోస్టులో వెలువడ్డ వార్తా కథనంలో గొగోయ్ తనపై చేసిన ఆరోపణలను అక్బర్ తీవ్రంగా  ఆమెను తాను బలవంతంగా అనుభవించినట్లు చెప్పడాన్ని తోసిపుచ్చారు. ఆమె తరచూ తన వద్దకు వస్తూ ఉండేదని, ఆమె సమ్మతితోనే 1994 ప్రాంతంలో తమ ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడిందని అక్బర్ చెప్పారు. ఆ తరువాత ఇది మధ్యలో ఆగిపోయిందని తెలిపారు. అయితే అక్బర్ వాదనలో నిజం లేదని ఆయన తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని లైంగిక వాంఛలు తీర్చుకున్నాడని, దీనికి సమ్మతి ముద్ర తగిలించాలని చూస్తున్నారని మహిళా జర్నలిస్టు పల్లవి ఇప్పుడు పేర్కొనడం కీలకంగా మారింది.

MJ Akbar Raped on Me: Pallavi Gogoi

Telangana news