Home పెద్దపల్లి దళిత ఉద్యోగిపై ఎంఎల్‌ఎ దాడి?

దళిత ఉద్యోగిపై ఎంఎల్‌ఎ దాడి?

Father-Beating-Son

ఫైర్ కానిస్టేబుల్‌ను చితకబాదినట్లు ఆరోపణలు
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
దాడి ఘటనను జనరల్ డైరీలో నమోదు
ఎస్‌సి,ఎస్‌టి కేసులు నమోదు చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు విజయరామారావు డిమాండ్

పెద్దపల్లి: ఇనుప పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో చిక్కుకోగా, ఎంఎల్‌ఎ స్వయానా ఫోన్ చేసినా ఫైర్ సిబ్బంది స్పందించకపోవడంతో ఆగ్రహంతో, ఫైర్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడ విధుల్లో ఉన్న జవాన్ భూమయ్యపై దాడి చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన ఫిబ్రవరి రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగినప్పటికీ, ఘటన బయటికి రాకుండా అగ్నిమాపకశాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి మండలం పెద్దకాల్వల వద్ద ఇనుపలోడుతో వెళ్తున్న లారీ మంటల్లో చిక్కుకొంది. విషయం తెలిసిన స్థానిక ఎంఎల్‌ఎ వెంటనే ఫైర్‌స్టేషన్‌కు ఫోన్ చేశారు. ఫోన్ ఎవరూ ఎత్తకపోవడంతో వెంటనే ఆగ్రహించిన ఆయన ఫైర్‌స్టేషన్‌కు వెళ్లి, విధుల్లో ఉన్న ఫైర్ జవాన్ భూమయ్యను తూలనాడుతూ దాడి చేశారని తెలిసింది.

కాగా తనపై  దాడి చేసి చితకబాదినట్లు బాధితుడు భూమయ్య స్టేషన్ జనరల్ డైరీలో నమోదు చేశారు.  ఫోన్లు పని చేయడం లేదని ఎంత చెప్పినా ఎంఎల్‌ఎ వినకుండా తనను కొట్టారని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుదర్శన్‌కు తెలపడంతో ఆయన సూచన మేరకు జిడిలో నమోదు చేశానని, తోటి ఉద్యోగులు శ్రవణ్‌కుమార్,బి బుచ్చ య్య సంతకం చేసినట్లు బాధితుడు తెలిపారు.  కాగా ఈ విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగి స్టేషన్ జనరల్ డైరీ మార్చినట్లు తెలుస్తోంది.దళితుడైన ఫైర్ జవాన్‌పై దాడికి పాల్పడిన స్థానిక ఎంఎల్‌ఎ దాసరి  మనోహర్‌రెడ్డిపై వెంటనే ఎస్‌సి,ఎస్‌టి కేసు నమోదు చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షులు విజయరామారావు డిమాండ్ చేశారు.  ఆదివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మనోహర్‌రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేదన్నారు. స్వయంగా ఎంఎల్‌ఎనే దాడులకు పాల్పడటం గర్హనీయమని, వెంటనే ప్రభుత్వం న్యాయవిచారణ జరిపించి, ఎంఎల్‌ఎపై చర్య తీసుకొని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.