Home జనగామ పట్టుదలతో చదువుతేనే ఉన్నత శిఖరాలు

పట్టుదలతో చదువుతేనే ఉన్నత శిఖరాలు

MLA Yerrabelli Dayakar Rao Speech About HigherStudy

మన తెలంగాణ/పాలకుర్తి : ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రత్యేక శ్రద్ధతో చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చునని వరంగల్ పోలీస్ కమీషనర్ డాక్టర్ విశ్వనాధ్ రవిందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డన్ ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 రోజుల పాటు నిర్వహించే ఉచిత కోచింగ్ సెంటర్‌ను వరంగల్ సిపి రవిందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులగా సిపి రవిందర్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవిందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఒక లక్షం ఉండాలని ఆ లక్షం సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో చదవాలని సూచించారు. కష్టపడంది ఏది సాధించలేమన్నారు. శోధన జరిగినప్పుడే ఫలితం లభిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి రోజుకు 12 నుండి 14 గంటలు చదివితే అనుకున్నదాన్ని సాధించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిందని వాటిలో ఎస్సై, కానిస్టేబుళ్లు, గ్రూపులతో పాటు విఆర్‌ఓ పోస్టులు ఉన్నాయని కష్టపడి చదివితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందన్నారు. రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఉచిత కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నిత్యం ప్రజలకు సేవ చేయడమే లక్షంగా పనిచేసే నాయకుడని, ఆయన లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఆయన పని తీరుకు అద్దం పడుతున్నారు. నియోజకవర్గంలో అత్యధిక మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలనే ఆలోచనలతో పాలకుర్తి, తొర్రూర్ మండలాలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్కడ మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించి 70 వేల మందికి శస్త్ర చికిత్సలు, మూడు వందల మందికి గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, నాలుగు వేల మందికి జనరల్ ఆపరేషన్లు చేయించానని గుర్తు చేశారు. వారి కోసం రూ.3 కోట్ల వ్యయంతో మందులు కొనుగోలు చేసి ఇప్పించామని అన్నారు.

ఈ ఉచిత కోచింగ్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తాను రెండు రోజులకు ఒకసారి కేంద్రాలను పర్యవేక్షిస్తానని అన్నారు. ప్రతి విద్యార్థి 50 రోజుల పాటు క్రమశిక్షణతో చదవాలని తప్పని సరిగా శిక్షణ పూర్తి చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోనే  పాలకుర్తి నియోజకవర్గం నుండి అత్యధిక శాతం మంది ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. డిసిపి మల్లారెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో తాను పనిచేస్తున్న క్రమంలో ప్రజలతో మమేకమై పని చేసిన నాయకులు రావుల చంద్రశేఖర్‌రావు, చిన్నారెడ్డిని చూశానని, జనగామ జిల్లాలో పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావును చూశానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎసిపి మధుసుధన్, ఎంపిపి దల్జిత్ కౌర్, కొడకండ్ల జెడ్పిటీసి బాకి లలిత, సర్పంచ్‌లు అంజమ్మ, నాగిరెడ్డి, ఎంపిటిసి విజయ, ట్రస్ట్ కో ఆర్డినేటర్ రజినీకాంత్, వీరమనేని యాకాంతారావు, సింగారపు దీపక్, రామోజీ, గడ్డం రాజు, పసునూరి నవీన్, రాంబాబు, వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, గజ్జి సంతోష్, గోపి తదితరులు పాల్గొన్నారు.