Home ఆఫ్ బీట్ ‘యాప్’ రే ఇదిగో నవలోకం

‘యాప్’ రే ఇదిగో నవలోకం

Apps marketడిజిటల్ సమ్మోహిత భారత్

‘అర చేతిలో వైకుంఠం’ అనేది ఒకప్పటి మాట. కానీ సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన నేటి రోజుల్లో అన్నీ అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ ద్వారానే సమకూరుతున్నాయి. డిజిటల్ పరిజ్ఞానం యావత్తు విశ్వాన్నే కమ్మేసింది. మన అవసరాలన్నింటినీ ఇంటి గడప దాటకుండానే స్మార్ట్‌ఫోన్ ద్వారానే సమకూర్చుకునే వీలు కలిగింది. నగర జీవన విధానంలోనే విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. స్మార్ట్ ఫోన్‌తో బంధం పెనవేసుకుపోయింది. ‘అమ్మా! ఆకలేస్తోంది’ అంటూ పిల్లలు అడగ్గానే వారికి ఏం కావాలో మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చేస్తే నిమిషాల్లో ఇంటికే వచ్చి చేరుతున్నాయి. ఇంటిల్లిపాదీ షాపింగ్‌కు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా బుక్‌చేస్తే ఆ వస్తువే నడుచుకుంటూ ఇంటికొచ్చేస్తోంది. పిల్లల్ని తీసుకుని సినిమాకో, షికారుకో వెళ్ళాలనుకుంటే టికెట్లు దొరుకుతాయో లేదోననే బెంగ అవసరమే లేదు. ముందుగానే మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే సరిగ్గా సమయానికి స్వంత కారు ఉన్నా లేకపోయినా మొత్తం కుటుంబమంతా క్యాబ్‌లో వెళ్ళి వచ్చేసే సౌకర్యం కలిగింది. అన్ని రకాల అవసరాలకూ మొబైల్ యాప్‌లు దారి చూపిస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్లు& – మొబైల్ యాప్‌లు

మన రోజువారీ అవసరాలకు ఒక్కో రకమైన మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మన దేశ జనాభా 120 కోట్లే అయినా మన స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు మాత్రం దాదాపు 150 కోట్లు. 2017 చివరి నాటికే 124 కోట్ల మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గూగుల్ ప్లే తన నివేదికలో పేర్కొన్నది. 2015తో పోలిస్తే మరుసటి సంవత్సరానికే యాప్‌ల డౌన్‌లోడ్ మూడు రెట్లు పెరిగింది. ఇక స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 2017 చివరి నాటికే దేశంలో 29 కోట్ల మంది ఉంటే 2018 నాటికి 35 కోట్లకు పెరిగింది. మొత్తం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ వాడేవారే దాదాపు 82% మంది ఉన్నారు. సగటున ప్రతీ స్మార్ట్ ఫోన్‌లో 62 యాప్‌లు ఉంటే అందులో 35 ఎప్పుడూ యాక్టివ్‌లో ఉంటున్నట్లు గూగుల్ ప్లే 2018 నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచం మొత్తంమీద గూగుల్ ప్లే ద్వారా 330 బిలియన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే ఇందులో 11.2% భారతదేశంలోనే. జియో ఫోన్ ద్వారా 4 జి పరిజ్ఞానం 2016 సెప్టెంబరులో అందుబాటులోకి వచ్చిన తర్వాత 217% మేర వృద్ధి చోటుచేసుకుంది.

‘ఫోర్ జి’తో డాటా విప్లవం

మన దేశ జనాభా 120 కోట్లు ఉంటే మొబైల్ ఫోన్ కనెక్షన్లు మాత్రం 103 కోట్లు. దేశంలో ఉన్న మొత్తం టెలిఫోన్ సర్వీసుల్లో 97.7% మొబైల్ ఫోన్లేనని టెలికామ్ రంగం పేర్కొన్నది. దాదాపు 15 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లలో 92% మొబైల్ ఫోన్లు డాంగిల్ ద్వారా పొందినవే. 2017లో స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి, ఇతర దేశాల నుంచి దిగుమతి దాదాపు 64% పెరిగినట్లు ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2జి పరిజ్ఞానం ఉన్నప్పుడు డాటా వినియోగంలో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండడంతో మొబైల్ ఫోన్ల ద్వారా అవసరాలను తీర్చుకోవడం నిదానంగా ఉండేదని 4 జి అందుబాటులోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా జియో ప్రవేశంతో, వంద రెట్ల వేగం పెరిగి స్మార్ట్ ఫోన్ల వినియోగం ఊపందుకుందని పేర్కొనింది.

మొబైల్ యాప్‌లతో ముడిపడిన జీవితం

మొబైల్ యాప్‌లు విస్తృతంగా వినియోగంలోకి రావడంతో అన్ని అవసరాలకూ దారులు దొరుకుతున్నాయి. రెడీమేడ్ ఆహార పదార్ధాలకు స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ లాంటి అనేకం ఉన్నాయి. ఉబర్, ఓలా, మేరు లాంటి క్యాబ్ సర్వీసులు ఉన్నాయి. సినిమాలకు ‘బుక్ మై షో’, చెప్పులు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ తదితరాలకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటివి ఉన్నాయి. బస్సు, రైల్వే, విమాన టికెట్లకు రకరకాల యాప్‌లు ఉన్నాయి. ఆన్‌లైన్ వైద్య సేవలకు డాక్స్‌యాప్ లాంటివి ఉన్నాయి. పొద్దున లేచింది మొదలు నిద్రపోయే వరకు ఒక్కో రకమైన అవసరానికి మొబైల్ యాప్‌లు వినియోగంలోకి వచ్చాయి. కాలక్షేపం కోసం కోట్ల సంఖ్యలో గేమ్స్ యాప్‌లు ఉండనే ఉన్నాయి. అవసరమేదైనా మొబైల్ యాప్‌లు ‘మేమున్నాం’ అంటూ మనకి దారిచూపుతున్నాయి.

కడుపు నింపుతున్న స్విగ్గీ, జుమాటో

మాజేటి శ్రీహర్ష, నందన్ రెడ్డి, జైమిని రాహుల్ అనే ముగ్గురు యువకులు ఆరేళ్ళ క్రితం బెంగుళూరులో స్థాపించిన స్విగ్గీ అనే స్టార్టప్ కంపెనీ ఇప్పుడు యావత్తు దేశానికి విస్తరించింది. దేశంలోని ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో దాదాపు 38% వాటాతో రూ. 3290 కోట్ల నిధులను సమకూర్చుకుంది. నెలకు దాదాపు మూడు కోట్ల మందికి ఆహారాన్ని డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇందుకోసం సుమారు లక్ష మంది డెలివరీ ఏజెంట్లను వినియోగిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు సగటున రూ.40 వేల వరకు సంపాదించుకునే ఉపాధి కల్పిస్తోంది. సరఫరా చేస్తున్న ఆహారపదార్థాల విలువ దాదాపు రూ. 100 కోట్ల డాలర్లని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 232% మేర రెవిన్యూ పెంచుకున్నట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల వివరాలు వెల్లడిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 397 కోట్ల నష్టాన్ని పూడ్చుకుని రూ. 442 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించింది. దీనికి పోటీగా ఉన్న జుమాటో సైతం ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో 30% వాటా చేజిక్కించుకున్నట్లు ‘రెడ్‌సీర్’ అనే సంస్థ వెల్లడించింది. సుమారు రూ. 2632 కోట్ల మేర నిధులను సమకూర్చుకుని 40% వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసింది. ప్రతీ నెలా సగటున 2.10 కోట్ల డెలివరీలను చేస్తోంది.

ఒక్కో డెలివరీ మీద ఈ రెండు సంస్థల ఏజెంట్లకు సగటున రూ. 45 చొప్పున ఒక్కొక్కరు నెలకు గరిష్టంగా రూ. 40 వేల వరకు సంపాదిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. డెలివరీ ఏజెంట్‌లకు ఒక్కో ఆర్డర్‌పై రూ. 45, ప్రతీ గంటకు సంస్థ నుంచి రూ. 30, వరుసగా ఎనిమిది గంటలు పనిచేస్తే ప్రోత్సాహకంగా రూ. 200 చొప్పున లభిస్తోంది. సగటున రోజుకు పది డెలివరీలతో రోజుకు కనీసంగా రూ. 890 ఆర్జిస్తున్నారు. దీనికి తోడు వ్యాపార విస్తరణ కోసం ఈ సంస్థలు, హోటళ్ళు ఆర్డర్ల మీద 50% వరకూ తగ్గింపు ధరలనూ సమకూరుస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఇష్టమైన బిర్యానీ లాంటివి సగం ధరకే పొందగలుగుతున్నారు. ఎక్కువగా ఐటి, మార్కెటింగ్ సంస్థల్లో పనిచేసేవారు, కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకునేవారి నుంచే స్విగ్గీ, జుమాటోలకు ఆర్డర్లు వస్తున్నట్లు డెలివరీ ఏజెంట్లు తెలియజేశారు. వీటికి తోడు ఉబర్ ఈట్స్, డోమినోస్ పిజ్జా లాంటి అనేక సంస్థలు కూడా ఫుడ్ డెలివరీ ద్వారా గణనీయ స్థాయిలోనే వ్యాపారం నిర్వహిస్తున్నాయి.

స్వంత కారు లేకున్నా క్యాబ్ సర్వీసులు

దేశం మొత్తం మీద క్యాబ్ సర్వీసులు 2015లో పది లక్షల ట్రిప్‌లు వేయగా ఈ మూడేళ్ళలో క్యాబ్ సర్వీసుల మార్కెట్ సగటున 70% మేర పెరిగింది. ఉబర్ సంస్థలో నాలుగున్నర లక్షల మంది, ఓలాలో పది లక్షల మంది డ్రైవర్లకు ఉపాధి లభిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోనూ క్యాబ్ సర్వీసులకు ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో ఓలా సంస్థ ఆటో సర్వీసులను కూడా యాప్ కిందకి తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఓలా సంస్థ సుమారు రూ. 1300 కోట్ల మేర రెవిన్యూను ఆర్జించగా ఉబర్ రూ. 410 కోట్లను ఆర్జించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఓలా సంస్థ రెవిన్యూ ఏకంగా 70% పెరగ్గా ఉబర్ వృద్ధి మాత్రం పది శాతానికే పరిమితమైంది. మరోవైపు బస్సు, రైలు, విమాన ప్రయాణాలకు గతంలోలాగ కౌంటర్ల వరకూ వెళ్ళి టికెట్లు బుక్ చేసుకునే అవసరం పోయి ఆన్‌లైన్ ద్వారానే జరుపుకునే వెసులుబాటు వచ్చింది. రైల్వే టికెట్లను బుక్‌చేసే ఐఆర్‌సిటిసి సంస్థ 2002లో రోజుకు కేవలం 29 టికెట్లను మాత్రమే బుక్‌చేయగా ఇప్పుడు అది 13 లక్షలకు పెరిగింది. ఏటేటా ప్రయాణీకుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. 2011 మార్చి నాటికి ఏటా పది కోట్ల టికెట్లను మాత్రమే బుక్ చేసిన ఐఆర్‌సిటిసి మూడేళ్ళకే దాదాపు రెట్టింపయ్యే స్థాయికి చేరుకుంది.

ఇక ఏటా సుమారు పది కోట్ల మంది విమాన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని, ఇందులో దాదాపు 50% డొమెస్టిక్ విమాన సర్వీసులేనని ప్రాక్సిస్ గ్లోబల్ అలయెన్స్ అనే అంతర్జాతీయ ట్రావెల్ సంస్థ పేర్కొనింది. ప్రతీ ఏటా డొమెస్టిక్ విమాన టెకెట్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలుచేసేవారి సంఖ్య సగటున 15% చొప్పున పెరుగుతోందని, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇది 12%గా ఉందని పేర్కొనింది. విమాన ప్రయాణికులు వారి ఆదాయంలో సగటున 4% ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నది.

మధ్యతరగతిని ఊరిస్తున్న వినిమయ సంస్కృతి

‘ఇ కామర్స్’ విస్తృతంగా వినియోగంలోకి రావడంతో కన్జూమర్ వస్తువుల విక్రయం అనేక రెట్లు పెరిగింది. సౌందర్య సాధనాలు, హెయిర్ కేర్ ఉత్పత్తులు, దంత సంరక్షణ, ఆహార వస్తువులు, హోం కేర్ వస్తువులు& ఇలా రకరకాల వినిమయ వస్తువుల వినియోగం నాలుగైదేళ్ళుగా విస్తృతంగా పెరిగినట్లు ఐబిఇఎఫ్ (ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్) తన నివేదికలో పేర్కొనింది. మొత్తం ఎఫ్‌ఎంసిజి (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) వస్తువుల్లో దాదాపు మూడింట రెండు వంతులు వ్యక్తిగత వస్తువులు, ఆహార పదార్ధాలదేనని తేల్చింది. ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో మన దేశంలో వీటి వ్యాపారం 2018 మార్చి నాటికి దాదాపు రూ. 3.69 లక్షల కోట్లుగా నమోదైనట్లు పేర్కొనింది. మరో రెండేళ్ళకు ఇది రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. ఎఫ్‌ఎంసిజి వస్తువుల్లో వినియోగదారులు 23% హెయిర్ కేర్, 18% ఆహార పదార్ధాలు, 18% హెల్త్ సప్లిమెంట్‌లు, 15% దంత సంరక్షణ, ఐదు శాతం స్కిన్‌కేర్ అవసరాలకు వెచ్చిస్తున్నట్లు తేలింది. ప్రతీ ఏటా ఇది సగటున ఏడు శాతం చొప్పున పెరుగుతూ ఉందని పేర్కొనింది. ఐటిసి, హిందుస్థాన్ లివర్ కంపెనీల ఉత్పత్తుల వ్యాపారమే దాదాపు రూ. 85 వేల కోట్లు ఉన్నట్లు పేర్కొనింది. మన దేశంలో తలసరి ఆదాయం ఏటేటా సగటున ఐదు శాతం చొప్పున పెరగనున్నట్లు ఐఎంఎఫ్ (ప్రపంచ ద్రవ్య సంస్థ) అంచనా వేయడంతో రానున్న కాలంలో ప్రజల కొనుగోలుశక్తి మరింతగా పెరిగి ఈ రంగంలో రెవిన్యూ వృద్ధి గణనీయంగా ఉంటుందని ఐబిఇఎఫ్ పేర్కొనింది. గతేడాది జూన్, సెప్టెంబరు మధ్యకాలంలోనే దాదాపు 16.5% వృద్ధి నమోదైనట్లు పేర్కొనింది. నగర జీవన విధానంలో వచ్చిన మార్పులు, తలసరి ఆదాయం పెరగడం, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండడం, 24 గంటలూ షాపింగ్ చేసే సౌలభ్యం రావడంతో సమీప భవిష్యత్తులో కన్జూమర్ మార్కెట్ వృద్ధి బాగా పెరుగుతుందని అంచనా వేసింది.

‘ఇ కామర్స్’తో చేరువైన షాపింగ్ సంస్కృతి :

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి ‘ఇ కామర్స్’ సంస్థల ద్వారా ప్రజలు వస్తువులను కొనుగోలుచేసే ధోరణి ఊపందుకుంది. 2017 చివరి నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 44.6 కోట్ల ఉండగా, గతేడాది సెప్టెంబరు నాటికి 56 కోట్లకు పెరిగిందని, ప్రతీ నెలా సగటున పది లక్షల మంది పెరుగుతూ ఉన్నట్లు టెలికాం రంగం అధ్యయనంలో తేలింది. ఇ కామర్స్ వేదికగా అత్యధిక షాపింగ్ చేస్తున్నది మన దేశమేనని ఐబిఇఎఫ్ నివేదిక వెల్లడించింది. 2017 చివరి నాటికే మన దేశంలో ఆన్‌లైన్ (ఇ కామర్స్) ద్వారా చేసిన కొనుగోళ్ళ విలువ సుమారు రూ. 1.24 లక్షల కోట్లు. ప్రపంచం మొత్తంమీద ఆన్‌లైన్ ద్వారా చేస్తున్న కొనుగోళ్ళలో భారతదేశం తొలి స్థానంలో ఉందని, 2012, 2017 మధ్య కాలంలో దాదాపు 70% వృద్ధి నమోదైందని పేర్కొనింది.

అన్నింటికంటే ఎక్కువగా 48% కొనుగోళ్ళు ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించినవేనని, ఆ తర్వాతి స్థానంలో 29% స్థానంతో దుస్తుల విభాగం నిలిచిందని పేర్కొనింది. ప్రతీ ఏటా సగటున ఐదు శాతం చొప్పున స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్ళు పెరుగుతున్నాయి. ఇ కామర్స్ ద్వారా జరుగుతున్న మొత్తం కొనుగోళ్ళలో 50% ఎలక్ట్రానిక్స్ ఉంటే ఇందులో 90 శాతం మొబైల్ ఫోన్లే. గతేడాది జూలై నాటికి ప్రతీ రోజు సగటున 12 లక్షల కొనుగోళ్ళు ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయని, నెలకు అన్ని ఇ కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా జరుగుతున్న కొనుగోళ్ళు దాదాపు ఆరు కోట్లు ఉన్నట్లు పేర్కొనింది. మొత్తం కొనుగోళ్ళలో దాదాపు 50% మెట్రో నగరాల్లోనే జరుగుతున్నాయని, 38% ప్రధాన పట్టణాల్లో జరుగుతున్నట్లు తేలింది. దేశం మొత్తం మీద లక్ష పిన్‌కోడ్ కలిగిన గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉంటే ప్రస్తుతం ఇ కామర్స్ ద్వారా 15 వేల పిన్‌కోడ్ కేంద్రాలకు డెలివరీ నెట్‌వర్క్ ద్వారా వస్తువుల రవాణా జరుగుతోంది. ప్రతీ నెలా దాదాపు కోటి మంది కొత్త వినియోగదారులు ఇ కామర్స్ రంగంలోకి చేరుతున్నారని, ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో ఉన్నట్లు ఐబిఇఎఫ్ పేర్కొనింది.

ఎక్కువ అమ్మకాలు& తక్కువ లాభం

‘ఇ కామర్స్’ ద్వారా ప్రజలు వారికి ఇష్టమైన వస్తువులను స్మార్ట్‌ఫోన్‌లోనే చూసుకునే వీలు కలిగింది. వారు కోరుకునే ఫీచర్లు ఆ వస్తువులో ఉన్నాయో లేవో దుకాణం దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. తక్కువ మార్జిన్‌తో అమ్మడం ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తులను విక్రయించవచ్చనే ఫార్ములాను ఇ కామర్స్ సంస్థలు అనుసరిస్తుండడంతో కొనుగోలుదారులు సైతం బహిరంగ మార్కెట్‌లో లభిస్తున్న ధర కంటే తక్కువకే లభిస్తోందన్న ఉద్దేశంతో వీటినే ఆదరిస్తున్నారు. తక్కువ మార్జిన్ ఉంటున్నప్పటికీ రెవిన్యూ, ఆదాయం మాత్రం గణనీయంగా ఉంటోంది. అటు వాణిజ్య సంస్థలకు, ఇటు కొనుగోలుదారులకూ లాభంగా ఉండడంతో పాటు డెలివరీ సిస్టమ్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోంది. దుకాణాలను పెట్టి నిర్వహణ ఖర్చుల్ని కలుపుకుని వస్తువుని విక్రయించే సంప్రదాయ విధానం తగ్గిపోతోంది.

ఆన్‌లైన్ వైద్యులు

అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో చాలా మందికి అనుభవమే. సగటున ఒక్కో కుటుంబం వారి ఆదాయంలో దాదాపు ఇరవై శాతం వైద్యానికే ఖర్చు చేస్తోంది. ఈ అవసరాన్ని అవకాశంగా తీసుకున్న కొద్దిమంది వైద్యులు ఒక బృందంగా ఏర్పడి ఆన్‌లైన్ ద్వారా కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నారు. ఆరేళ్ల క్రితం బెంగుళూరులో సతీష్, ఇన్బ శేఖర్ అనే ఇద్దరు వైద్యులు ‘డాక్స్‌యాప్’ అనే పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్‌ను తయారుచేసి విస్తృతం చేయడంతో ఇప్పుడు రోజుకు సగటున 1200 మందికి ఆన్‌లైన్ ద్వారానే చికిత్స చేస్తున్నారు. 24 గంటలూ పనిచేసే ఈ నెట్‌వర్క్‌లో ఎప్పుడూ కనీసంగా వెయ్యి మంది స్పెషలిస్టు డాక్టర్లతో పాటు రెండున్నర వేల మంది వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. బిట్స్ పిలానీ నుంచి ఫార్మసీ పూర్తిచేసిన వైభవ్ అనే యువకుడు ‘విజిట్’ పేరుతో మొబైల్ యాప్ ద్వారా వైద్య సేవలను అందిస్తున్నాడు. నిమిషానికి ఏడు రూపాయల చొప్పున రకరకాల అనారోగ్య సమస్యలకు నిపుణులైన డాక్టర్ల ద్వారా కన్సల్టేషన్ అందిస్తున్నారు. ప్రతీ నిమిషం కనీసంగా 80 మంది ఆన్‌లైన్‌లో ఉంటున్నారని, చాటింగ్ ద్వారా ప్రస్తుతానికి ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే సేవలను పరిమితం చేసినట్లు ఆ సంస్థ పేర్కొనింది. భాషాపరమైన సమస్య ఉన్నందున దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించలేదని పేర్కొనింది. కానీ ‘ఐ క్లినిక్’ పేరుతో ఇంజనీరింగ్ పూర్తిచేసిన స్వయం ప్రకాశ్ అనే యువకుడు 1500 మంది డాక్టర్ల సాయంతో ఆన్‌లైన్ వైద్య సేవలను నిర్వహిస్తున్నారు. ఇక వీటికి తోడు ఆన్‌లైన్ ద్వారానే మందులను బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేసే సంస్థలు, ఆన్‌లైన్ ద్వారానే విజ్ఞప్తి చేస్తే ఇంటికే వచ్చి రక్తనమూనాలను సేకరించే సంస్థలూ ఇటీవల పుట్టుకొచ్చాయి.

చేతిలో నగదు లేకుండానే &

చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అరచేతిలో ఇమిడే స్మార్ట్‌ఫోన్‌తో అనేకం సమకూర్చుకునే డిజిటల్ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. నోట్ల రద్దు సమయం వరకూ అంతంతమాత్రంగా ఉన్న నగదు రహిత లావాదేవీలు ఇప్పుడు ఊపందుకున్నాయి. పేటిఎం లాంటి ఎన్నో సంస్థలు కనీస డిపాజిట్ నిబంధన లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. గత ఆగస్టులో ఈ సంస్థ 29 వేల కోట్ల లావాదేవీలను నిర్వహించింది. సుమారు తొమ్మిదిన్నర కోట్ల మంది ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తేలింది. ప్రతీ నెలా సగటున వంద కోట్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారని, ఇంతటి ఆదరణ ఉన్నందునే ఇటీవలి కాలంలో కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో అపార్టుమెంట్ల నిర్వహణ (మెయింటెనాన్స్) బిల్లులతో పాటు మున్సిపల్ శాఖ ద్వారా జరిగే చెల్లింపులు, బీమా తదితర సౌకర్యాలనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబ్బాట్ ఇటీవల వ్యాఖ్యానించారు.

నగదురహిత లావాదేవీలు ఇటీవల గణనీయంగా పెరిగాయని గతేడాది జూలైతో పోల్చుకుంటే ఆగస్టులో 32% వృద్ధి నమోదైందని, ఒక్క నెలలోనే మూడు కోట్ల లావాదేవీల ద్వారా సుమారు రూ. 5293 కోట్ల నగదు బదిలీ జరిగిందని, పన్నెండు నెలల కాలానికి ఇది సుమారు రూ. 54 వేల కోట్లుగా ఉందని జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ పేర్కొనింది. స్విగ్గీ, జొమాటో, ఇ కామర్స్, ఓలా, ఉబర్, విమాన టికెట్లు& ఇలా ఆన్‌లైన్ ద్వారా చేసే కొనుగోళ్ళలో గరిష్టంగా చెల్లింపులు కూడా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. జేబులో పైసా కూడా లేకుండా బైటకు వచ్చామే అనే ఆందోళన అవసరం లేకుండాపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏ అవసరాన్నయినా సమకూర్చుకునే డిజిటల్ ప్రపంచం ఆవిష్కృతమైంది. అందుకే డిజిటల్ సౌకర్యం లేని అనేక సంప్రదాయ దుకాణాలు, షోరూమ్‌లు క్రమంగా అస్థిత్వాన్ని కోల్పోతున్నాయి, వాణిజ్యంలో పోటీ పడలేకపోతున్నాయి.

mobile apps market growth