Home తాజా వార్తలు ప్రజారోగ్య బంధు పారిశుద్ధ ప్రదాత నిజాం

ప్రజారోగ్య బంధు పారిశుద్ధ ప్రదాత నిజాం

Modern level Sewage water cleaning centers

 

మానవులు ఉత్పన్నం చేసే వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోతే మానవ జాతి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి, నిజాం పాలకులు దేశాలతో, సమానంగా ఎలా అభివృద్ధి పరిచారో, పారిశుద్ధ్యంపై వారి దృక్పథాన్ని , ప్రాధాన్యతను, ’నిజాం పాలన, పారిశుద్ధ్య ప్రగతి’ పుస్తక రచయిత, పరిశోధకుడు, ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ చేసిన గాదె వెంకటేష్ మనతెలంగాణ ‘మన’ ప్రతినిధి శ్యాంమోహన్‌కు వివరించారు.

స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా నిజాం హయాంలో లాగా పారిశుద్ద్యం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. దేశంలో వున్న మొత్తం 5161పట్టణాల్లో కేవలం 269 పట్టణాలకు మాత్రమే మురుగునీటి నిర్వహణ వ్యవస్థ ఉంది. అదికూడా పాక్షికంగానే ఉందన్న విషయం బహు బాధాకరమైన అంశం. ఇప్పటి ప్రభుత్వాలు పారిశుద్ధ్య పనులను చేపడుతున్న విధానంలోనైతే అన్ని పట్టణాలకు మురుగునీటి నిర్వహణ వసతులు కల్పించాలంటే.. మరో 3వేల సంవత్సరాలకు పైగా పడుతుందని ఓ అంచనా. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చాలా అధ్వాన్నంగా ఉంది. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో బహిరంగంగా మలవిసర్జన శాతం ఎక్కువ. గ్రామీణ అభివృద్ధి విషయంలో గుజరాత్ (సింధూ నాగరికత విలసిల్లిన ప్రాంతం అయినందుకు కాబోలు) బీహార్‌లు ఆదర్శంగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు. కానీ మొత్తంగా చూస్తే దక్షిణ భారతదేశంలో పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థ మెరుగ్గా వున్నది.

”ఏదైనా ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ప్రధాన ఉత్పత్తితో పాటు వ్యర్థాలు కూడా కూడా వెలువడుతాయి. వీటిని వ్యర్థాలు అనడం కంటే ఉప వుత్పాదకాలు అనడమే మంచిది. ఉపయోగకరం కాకపోయినా వీటిని నివారించలేం. నివారించి ఏ ఉత్పత్తినీ సాధించలేం. అలా అత్యంత అనివార్య ఉత్పాదకమమైన వ్యర్థాలను ఏ దృక్పథంతో, ఎలా నిర్వీర్యం చేస్తున్నామన్న దాన్నిబట్టే సమాజపు ఉన్నతి ఆధారపడి ఉంటుంది. ఇంటి గోడకు బూజు దులపడం ఎంత ముఖ్యమో, కిందబడ్డ బూజును సర్గిగా తీసి, దాంతో మళ్లీ మనకు ఏ ఇబ్బంది తలెత్తని రీతిలో ధ్వంసం చేయడం లేదా మరో రూపానికి మార్చి, సరైన ప్రదేశానికి తరలించడం అంతే ప్రధానం. ఇంకా చెప్పుకోవాలంటే మొదటి దానికన్నా రెండవదే అతి ముఖ్యమైనది. ఒక మనిషి రోజుకు గరిష్ఠంగా 100గ్రాముల మలం, 1.25 లీటర్ల మూత్రము, 250-450 ఘన వ్యర్థ పదార్థాల వుత్పత్తికి కారణమవుతాడు. మనకు ఏది ఆగినా వ్యర్థం రావడం ఆగదు. ఇది ఎల్లప్పుడు ఉండే, సర్వసాధారణ అతి ప్రధాన అంశం. అటువంటి దానికి శాశ్వతమైన అందులోనూ పర్యావరణహిత పరిష్కారం చూపగలిగిన విధానమే ఉన్నతమైనది.

ప్రపంచంలో మొదట పారిశుద్ధ్య వ్యవస్థ ఆనవాళ్ళు తూర్పు మధ్య భాగంలో అంటే ఇరాన్ దగ్గర్లో జాబోల్‌లో వున్నట్లు చరిత్ర చెబుతోంది. సింధూలోయ నాగరికత పారిశుద్ధ్య వ్యవస్థ చాలా శాస్త్రీయతను జోడించుకొని మహోన్నతమైనదిగా విలసిల్లింది. దాని తర్వాతనే ఇతర నాగరికతల పారిశుద్ధ్య వ్యవస్థలను గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.

 

Sewage water centers

పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?

విచిత్రమైన ముచ్చట ఏందంటే, కనీస పారిశుద్ధ్య సదుపాయాలకు నోచుకోని 95శాతం పారిశుద్ధ్య కార్మికులు ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలే. వీరే దేశాన్ని పరిశుభ్రపరిచే పనిలో వున్నారు. వీరే ఎందుకు ఈ వృత్తిలోకి నెట్టివేయబడుతున్నారో, ఇతర ఏ ఆధిపత్య కులాల వాళ్లు ఈ వృత్తుల్లో ఎందుకు కనిపించరో తెలియాలంటే భారతదేశ చాతుర్‌వర్ణ వ్యవస్థలోకి వెళ్లాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాల కంటే ఎక్కువగాపారిశుద్ధ్య కార్మికుల, పారిశుద్ధ్య మెరుగుదల కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ అవి పారిశుద్ధ్య కార్మికులను ఒక వర్గంగా చూస్తాయే తప్ప, కుల సమూహం అని అంగీకరించడం లేదు. స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కువ పనిభారం పెంచేవిగా తయారయ్యాయి కానీ, వారికి ఒక గౌరవప్రద స్థానం కల్పించేవిగా లేకపోవడం విచారకరం.

16 శతాబ్దంలో ఇంగ్లాండులో రాణి ఎలిజబెత్ కోసం సర్ హనింగ్టన్ మురుగునీటి శుద్ధి పద్ధతిని కనుగొన్నాడు. తర్వాత ఆధునిక కాలంలో అంటే 19వ శతాబ్దంలో వృథానీటి/ మురుగు నీటి సేకరణ, శుద్ధి ఆలోచనలు పదునెక్కాయి. నాగరికత అనే మాట ’నగరం’ అనే మాట నుంచి ఏర్పడింది. సింధు లోయ ప్రజల నాగరికత అక్షరాలా నగర నాగరికత. ఈ నాటికీ ఆశ్చర్యం గొలిపేటంత గొప్పది. సింధూ నాగరికతలో కలిబంగన్, మొహెంజోదారో, రాఖీనగర్, హరప్పా, దోలావీరా, లాతోల్ ముఖ్యమైన నగరాలు.

మొహెంజోదారో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ప్రమాణాలను పరిశీలిస్తే వారు పట్టణాలను అభివృద్ధి చేయడంలో సిద్ధహస్తులని, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తుంది. వారి పట్టణ రూపకల్పనను గమనిస్తే ప్రపంచంలో మొట్టమొదటి పరిశుభ్రత వ్యవస్థ ఇక్కడే ఆరంభమైనట్లు రుజువవుతుంది. పురాతన సింధులోయ నాగరికతలో నిర్మించిన ఈ మురుగు నీటి, డ్రైనేజీ వ్యవస్థ ఆ కాలంలో మధ్యప్రాచ్యంలో గాని వేరెక్కడైనా గాని నిర్మించిన డ్రైనేజీ విధానాలకంటే చాలా అభివృద్ధి చెందినది . అక్కడి ప్రజలు వ్యక్తిగత శుచి శుభ్రతలకు నగర పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. మొహెంజోదారోలో ప్రతి ఇంటికీ మంచినీటి బావి ఉండేది. ఇళ్ల క్రింద మురుగు నీరు పారడానికి తూములున్నాయి అవి పోయిపోయి వీధుల ప్రక్కగా భూగర్భంలో త్రవ్విన మురుగు కాల్వల్లో కలుస్తాయి. ప్రతి ఇంటికీ ప్రత్యేకమైన స్నానపుగదులు ,వ్యక్తిగత మరుగుదొడ్లు శాస్త్రీయ పద్ధతిలో నిర్మించుకున్నారు. అంతేకాకుండా అవి పర్యావరణ హితమైనవిగా ఉండేవి.

Gade Venkatesh

ఇంగ్లండ్ నుంచి డ్రైనేజీ పైప్‌లు

నాటి పారిశుధ్య విభాగం ప్రధాన కాలువలు, ఉప కాలువలు నిర్మించడమే కాకుండా ప్రజల విజ్ఞప్తి మేరకు ఇంటింటికి కనెక్షన్స్ కూడా ఇచ్చింది. అంతే కాకుండా నగర పర్యాటకులకోసం, ప్రజల కోసం ప్రజా మరుగుదొడ్లను, స్నానాల గదులను, మూత్రశాలలను చాలా ప్రదేశాల్లో ఏర్పాటు చేసింది. 1937లో హైదరాబాద్‌లో ఉన్న 5లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకొని మురుగునీరు నిలువ ఉండకుండా కావాల్సిన కాలువల కోసం ప్రణాళికలు తయారుచేశాడు నిజాం. 1100 కిలోమీటర్ల పొడవున కాలువలు నిర్మించాడు. అందులో 70కి.మీ.ల ప్రధాన కాలువలు, మిగిలిందంతా పిల్ల గొట్టాలు రూపొందించాడు. కాల్వలకు కావాల్సిన నాణ్యమైన పైపులను , మ్యాన్ హోల్స్‌ను, ఇతర సామాగ్రిని ఇంగ్లండ్ నుంచి తెప్పించాడు. ఎందుకంటే అప్పటికి భారతదేశంలో అవి లభ్యమయ్యే పరిస్థితే లేదు.

మరుగుదొడ్ల నుంచి మురుగునీటిని తరలించడానికి అనువుగా మరుగుదొడ్లు, వీధివైపు ప్రధాన ద్వారం నిర్మించేవారు. నేటి ఆధునిక స్థాయి మురుగునీటి శుద్ధి కేంద్రాలను తలపించే సాంకేతికతను వినియోగించారు. దానికి సాక్ష్యంగా గ్రిట్ చాంబర్, సెప్టిక్ ట్యాంకుల నమూనాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. మురుగునీటి తరలింపు ప్రధాన కాల్వలకు లో మ్యాన్ హోల్స్ ఉండేవి. ఎలాంటి చెత్త కాలువలో పడకుండా చాలా పకడ్బందీగా చెక్కతో చేసిన జాలీలు (మెష్‌లు) అమర్చి, పర్యవేక్షించేవారు. సింధు నాగరిక ప్రజలు (ప్రస్తుతం పాకిస్తాన్‌లోని, ఉత్తర, దక్షిణ భారతదేశాలలో కొంత భాగం) మరుగుదొడ్లలో పింగాణీ వస్తువులను బాగా వినియోగించారు. మొహెంజోదారో పట్టణాలలో కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పనిసరి. మూత్ర విసర్జన కోసం తవ్విన గోతులు వాడేవారు.

మురుగునీటి వ్యవస్థకు ప్రజా ఆరోగ్యానికి సంబంధం ఉందనే లోతైన ఆలోచన, దూరదృష్టి వున్న అతి కొద్దిమంది రాజులలో ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఒకరు. తన పాలనా రాజధాని హైదరాబాద్.. ఇవాళ ఆసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాలను కలిగి ,రోజుకు 10 లక్షల లీటర్ల సామర్థ్యం అంటే 339 ఎంఎల్‌డీ కెపాసిటీ ఉందంటే, మురుగు నీటి శుద్ధికి ప్రయోగశాలగా హైదరాబాద్ మారిందంటే.. అది నాటి నిజాం వేసిన పునాదుల ఫలితమే. నిత్యం ప్రజలు వాడే నీటిలో దాదాపు 80% మురుగునీరుగా మారుతుంది. మరి ఆ మురుగు నీటి నిర్వహణ సరైన పద్ధతిలో లేకపోతే డయేరియా, కలరా వంటి వ్యాధులు సోకి జనజీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఆరవ నిజాం 1908లో మూసీ వరదల తర్వాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి వృధా నీటి, మురుగు నీటి నిర్వాహణ వ్యవస్థకు పునాదులు వేసి, పారిశుద్ధ్య వ్యవస్థకు పురుడు పోశాడు. ఒక శతాబ్దం ముందే పారిశుద్ధ్య వ్యవస్థకు ఉన్న ఆవశ్యకతను నిజాం గుర్తించారు. జంట నగరాలకోసం వరదనీటి నిర్వహణతో పాటు, మురుగునీటి పారిశుద్ధ్య ప్రణాళికలను ఇంజనీరు ఎ.డబ్ల్యు.స్టోన్ బ్రిడ్జ్ సహాయంతో రూపొందించారు. ఆ పారిశుద్ధ్య పనులను (మురుగునీటి పారిశుధ్య కాలువలు కట్టడం) 1922 సంవత్సరంలో మొదలుపెట్టి, 1937 నాటికి పూర్తి చేశారు. ఇవి మినహా 2015వరకు తెలంగాణలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగనేలేదు.

బషీర్‌బాగ్‌లో పట్టణ మెరుగుదల విభాగం భవనం
ఆనాటి నిజాంల ముందు చూపు హైదరాబాద్‌ను ఒక ప్రణాళిక బద్దమైన పట్టణం గా ఎదిగేలా చేసింది. అలా సంకల్పించిన అంశాలను క్రమ పద్దతిగా అమలు జరగాలంటే పట్టణ మెరుగుదల విభాగానికి ఒక సొంత భవనం వుండాలని నిర్ణయించి బషీర్‌బాగ్‌లో 1890 సంవత్సరంలో నిర్మించిన అరుదైన భవనాన్ని నిర్మించారు. అదే భవనం తర్వాత హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి కార్యక్రమాలకు ఉపయోగపడింది. 1954లో ఆ భవనాన్ని గాంధీ వైద్య కళాశాల (మెడికల్ కాలేజీ) కు కేటాయించారు.

పారిశుద్ధ్య వ్యవస్థను నిజాంలు ఎలా నిర్వహించేవారు?

క్రీ.శ. 1912 సంవత్సరంలో పట్టణ మెరుగుదల విభాగం/పట్టణ అభివృద్ధి విభాగం ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి సాంకేతికతను నిజాం ప్రభువు అందిపుచ్చుకున్నాడనడానికి ఇప్పటికీ చెక్కుచెదరని నాటి పారిశుద్ధ్య వ్యవస్థే సాక్ష్యం. నిజాం పారిశుద్ధ్య వ్యవస్థను నిర్మించిన యాభై యేళ్ల తర్వాత అంటే 1970లలో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటై, నీటికాలుష్య చట్టానికి చెందిన మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చాక మాత్రమే తెలంగాణేతర ప్రాంతాలలో పారిశుద్ధ్య వ్యవస్థలు ఏర్పడ్డాయి. బషీర్‌బాగ్ కేంద్రంగా పని చేసిన పట్టణ మెరుగుదల విభాగం రాజుల కోసం కాకుండా ప్రజల సౌకర్యార్థం తెలిసింది. ఉద్యాన వనాలను విస్తరించడం, గృహ సముదాయ కాలనీ ప్రణాళికలు, శుద్ధి చేసిన తాగు నీరును గొట్టాల ద్వారా సరఫరా చేయడం, మురుగు నీటిని భూగర్భ మార్గాల ద్వారా తరలించడానికి ప్రత్యేక కాలువలను నిర్మించడం, వరద నీటిని తరలించడానికి ప్రత్యేక కాలువలు నిర్మించడం. ఈ చర్యల ఫలితంగానే ఇప్పటికీ పాత బస్తీలో ఎంత వర్షం పడ్డా నిలువ నీరు కనపడదు. ఈ ప్రత్యేకమైన మురుగు నీరు, వరద నీటి కాల్వల ఆనవాళ్లు ఈ మధ్యన హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం నాంపల్లి ప్రాంతంలో త్రవ్విన తవ్వకాల్లో బయటపడ్డాయి.

ఆ నాటి స్లమ్స్ అభివృద్ధికి నిజాం ఏం చేశారు?
మూసీ నది ఒడ్డున ఉన్న మురికి వాడలు సుల్తాన్ షాహి, మొగుల్ పుర, నాంపల్లి గన్‌ఫౌండ్రిలను అభివృద్ధి పరిచాడు ఏడవ నిజాం. అంతే కాకుండా ఇప్పుడు కనిపిస్తున్న రెడ్ హిల్స్, మల్లేపల్లి, డబ్బీర్‌పూరలను కొత్తగా నిర్మించాడు. ఏడవ నిజాం దృష్టిలో పట్టణ అభివృద్ధికి దిశానిర్దేశం చేశాడు. పేద వారికి గృహాలు నిర్మించడం, మిగులు భూములను సేకరించి పంచడం, భూగర్భ మురుగు నీటి పారుదలను ఏర్పాటు చేయడం, పథ్థర్ గట్టి బజారు వెడల్పు చేసి, బస్సులు తిరగడానికి వీలుగా రోడ్ల నిర్మాణం చేశారు.

హైదరాబాద్ మురుగునీటి వ్యవస్ధ ఏర్పాటు ఎలా జరిగింది?
క్రీ.శ.1926లో హైదరాబాద్ మురుగునీటి విభాగం ఏర్పాటయింది. 1908 (1318 ఫాల్సీ) సం.లో సర్. వీ.హ. మొదట నగరాన్ని పరిశీలించి ప్రణాళికలు రూపొందించి రూ.52 లక్షలతో వరద నీటి నిర్వహణ చేపట్టాలని సూచించాడు. కానీ ఎ.డబ్ల్యు. స్టోన్ బ్రిడ్జ్ అనే అప్పటి సానిటరీ ఇంజినీరు మోక్షగుండం విశ్వేష్వరయ్య (సర్. వీ.హ.) ఇచ్చిన ప్రణాళికలకు మెరుగులు దిద్ది , ఈ మొత్తం పట్టణానికి వరద నీరు, మురుగునీటి నిర్వహణ చేయాలంటే రూ. 1.63 కోట్లు అవసరమని నివేదికలు తయారు చేశాడు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను మిస్టర్ ఎం.ఎ. జమాన్ (కీ.శే.నవాబ్ అశాన్ యార్ జంగ్ బహదూర్)కి అప్పగించారు. జమాన్ ఇంకొంత మంది అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ నిపుణుల సలహాలతో, సూచనలతో కొద్ది మార్పు చేర్పులతో ప్రణాళికలను పటిష్ట పరిచి కాల్వల నిర్మాణం పనులు ప్రారంభించారు.

ఆ తర్వాత 1926లో వరద నీరు, మురుగు నీరు నిర్వహణను కల్పడం వల్ల మురుగు నీటి నిర్వహణ నిర్లక్ష్యానికి గురవుతుందని నిజాం భావించి మురుగు నీటికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి మిస్టర్ నవాబ్ కుర్మంత్ జంగ్ బహుదూర్‌ని చీఫ్ ఇంజనీరుగా, ఎం.ఎ. జమాన్‌ను ఎస్.ఇ.లుగా నియమించాడు ఏడవ నిజాం.

ఆ కాలంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలుండేవా?
కాలువల ద్వారా సేకరించిన మురుగునీటి శుద్ధి కోసం.. ’ఆక్సిడేషన్ పాండ్ టెక్నాలజీ’తో 53 ఎమ్‌ఎల్‌డీ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కూడా నిర్మించారు. అంబర్‌పేట మురుగునీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన నీటితో 1100 ఎకరాలకు సాగునీరు అందించేవారు. స్లడ్జ్‌ని శుద్ధి చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా చేశాడు. ఇదంతా 1937-1940 కాలంలోనే నిజాం తెలంగాణ ప్రజలకు అందించాడు. అంటే దేశంలో మొదటి 3-4 మురుగునీటి శుద్ధి కేంద్రాలలో హైదరాబాదు మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) ఒకటి. ఇతర దేశాల వాళ్ళు సైతం మురుగు నీటి కాల్వల నిర్వహణ, శుద్ధి అధ్యయనం కోసం ఇక్కడికే వచ్చేవారు. ఇప్పటికీ వస్తున్నారు. 1950లో హైదరాబాద్ మురుగునీటి వ్యవస్థకి సికింద్రాబాద్ మరియు పరిశ్రమల నుండి వచ్చే మురుగునీటి కాలువలను 6 లక్షలు ఖర్చుపెట్టి అనుసంధానం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ – డిటైల్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ 1351 ఎఫ్ (1950 ఎ.డి)). ఆ తర్వాత అంబర్‌పేట మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా 3 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మురుగునీటి విభాగం ఏర్పాట్లు చేసింది.

ఆసిఫ్‌నగర్, నారాయణగూడలలో అప్పటికే ప్రసిద్ధి గాంచిన మంచి నీటి శుద్ధి కేంద్రాలు ఉండేవి. ఆసిఫ్‌నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రం 100 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుండడం అప్పటి నిజాం రాజు నాణ్యతకు ఇచ్చిన ప్రాధాన్యత ఏపాటిదో తెలుస్తుంది. 1915లో వరదనీరు వ్యవస్థను, 1922లో మురుగునీటి వ్యవస్థను, 1940లో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) నిర్మించి ఆధునిక సాంకేతిక విప్లవానికి నిజాం నవాబులు జంట నగరాలలో నాంది పలికారు.

దేశంలో నేటి పారిశుద్ద్యం ఎలా ఉంది?
స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా నిజాం హయాంలో లాగా పారిశుద్ద్యం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. దేశంలో వున్న మొత్తం 5161పట్టణాల్లో కేవలం 269 పట్టణాలకు మాత్రమే మురుగునీటి నిర్వహణ వ్యవస్థ ఉంది. అదికూడా పాక్షికంగానే ఉందన్న విషయం బహు బాధాకరమైన అంశం. ఇప్పటి ప్రభుత్వాలు పారిశుద్ధ్య పనులను చేపడుతున్న విధానంలోనైతే అన్ని పట్టణాలకు మురుగునీటి నిర్వహణ వసతులు కల్పించాలంటే.. మరో 3వేల సంవత్సరాలకు పైగా పడుతుందని ఓ అంచనా. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చాలా అధ్వాన్నంగా ఉంది. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో బహిరంగంగా మలవిసర్జన శాతం ఎక్కువ.

గ్రామీణ అభివృద్ధి విషయంలో గుజరాత్ (సింధూ నాగరికత విలసిల్లిన ప్రాంతం అయినందుకు కాబోలు) బీహార్‌లు ఆదర్శంగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు. కానీ మొత్తంగా చూస్తే దక్షిణ భారతదేశంలో పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థ మెరుగ్గా వున్నది. ”పారిశుద్ధ్యం మీద ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి పది రూపాయలకు 9రూపాయలు లాభిస్తాయి. ఎందుకంటే పారిశుద్ధ్యం మీద ఖర్చు పెట్టడం అంటే ప్రజల ఆరోగ్యం వసతుల మీద ఖర్చు పెడుతున్నట్టే”. అనారోగ్యాలు, అం గ వైకల్యాలు తగ్గి, ఆరోగ్య కరమైన మానవులు రూపొందుతారు. అంటే నష్టం తక్కువగా వుందంటే లాభం జరిగిందన్నట్టే కాబ ట్టి పాలకులకు అతి ముఖ్యమైన విషయంగా మురుగునీటి నిర్వహణ అని చెప్పుకోవచ్చు.

                                                                                                                            – శ్యాంమోహన్ 
Modern level Sewage water cleaning centers in Hyderabad