Home బిజినెస్ దేశీయ ఆర్థిక వ్యవస్థ మూడు చక్రాలు పంక్చరైన కారు

దేశీయ ఆర్థిక వ్యవస్థ మూడు చక్రాలు పంక్చరైన కారు

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం

CHIDAMBARAM

న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వ్యవస్థ మూడు టైర్లు పంక్చరైన కారు లాగా ఉందని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి చిదంబర్ వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. మహారాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ, ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ ఖర్చులు దేశీయ ఆర్థిక వ్యవస్థకు నాలుగు వృద్ధి ఇంజిన్లు, ఇది నాలుగు చక్రాల కారు లాంటిందని అన్నారు. దీనిలో ఒకటి, రెండు టైర్లు పంక్చర్ అయితేనే వేగం తగ్గుతుందని, కానీ మూడు టైర్లు పంక్చర్ అయ్యాయని, ఇక దేశీయ ఆర్థిక పరిస్థితి ఎలాంటి ఉందో ఊహించవచ్చని అన్నారు.

ప్రభుత్వం ఖర్చులు కేవలం ఆరోగ్య సంరక్షణ, కొన్ని ఇతర సదుపాయాల్లో మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఖర్చులు కొనసాగించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్‌పిజి గ్యాస్ పైనా పన్నుల భారం కొనసాగిస్తోందని అన్నారు. ఇటీవ విద్యుత్ రంగంలో పెట్టుబడులు చూస్తే.. పది ప్రధాన కంపెనీలు దివాలా తీస్తే వాటిలో ఐదు స్టీలు కంపెనీలే ఉన్నాయని, ఇలాంటి రంగాల్లో పెట్టుబడులను ఎలా ఆశిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

ఐదు శ్లాబ్‌తో వచ్చిన జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)పైనా చిదంబరం విమర్శలు చేశారు. ఇతర దేశాల్లో జిఎస్‌టి కింద ఒకే పన్ను వ్యవస్థ ఉంటుందనీ, భారత్‌లో మాత్రం రెండు రకాల పన్నుల వ్యవస్థ అమలు చేస్తున్నారని అన్నారు. ఆర్థిక సమస్యలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని చెప్పారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద మోడీ ప్రభుత్వం నాన్ కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల రుణం ఇస్తుందని, సరాసరిన ఓ వ్యక్తికి ముద్ర రుణం కింద దక్కేది రూ.43 వేలు మాత్రమేనని అన్నారు. ప్రజల నుంచి భారీ మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రజా సౌకర్యాల కోసం కొద్ది మొత్తంలోనే ఖర్చుపెడుతుందని విమర్శించారు.