Home ఎడిటోరియల్ ప్రజలను గాయపరిచిన మోడీ

ప్రజలను గాయపరిచిన మోడీ

pm-modi

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు అస్త్రం దారి తప్పింది. డబ్బు మార్పిడిని సజావుగా నిర్వహించటంలో ఆయన ‘గరిష్ట ప్రభుత్వం’ విఫలంకావటంతో అన్ని జీవన రంగాలకు చెందిన కోట్లాది మంది అత్యవసరాలకు చేతిలో డబ్బులులేక బాధలు పడుతున్నారు. నగదుతో నడిచే దేశ ఆర్థిక వ్యవస్థను అరాచకం ఆవహించింది. ఉవాచగామారిన ‘సర్జికల్ స్ట్రయిక్’ దొంగ నిల్వదారులు, అవినీతిపరులపై కాకుండా ఇప్పుడు ప్రజలపై జరుగుతున్నది. వారు ఆహారం ఇతర ప్రాథమిక అవసరాలు కొనుగోలు చేయలేక పోతున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు స్తంభించిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 60 శాతం అసంఘటి రంగంలో ఉంది. ఉత్పత్తికి, ఎగుమతులకు, ఉపాధికి పెద్దగా తోడ్పడుతున్నది లఘు పారిశ్రామికరంగం ఇప్పటి పరిస్థితు లను బట్టి చూస్తే ఆర్థిక వ్యవస్థ ‘ప్రక్షాళన’ ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టం చేసేలా ఉంది. ప్రజల కష్టాలు ప్రధాన మంత్రి ఊహించినట్లు 50 రోజుల్లో తీరేలా లేవు. పాత కరెన్సీ నిల్వలను భర్తీ చేసేందుకై కొత్తనోట్ల ముద్రణ, రవాణా, దేశ వ్యాపితంగా సర్కులేషన్ లోపెట్టటం అనే ప్రక్రియ అందుకు తీసుకునే సమయా న్ని బట్టి ఈ పరిస్థితి మార్చి నెల తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలోకి వెళుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
ప్రతిష్టంభన నుంచి ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప జేయటంలో, వాగ్దానం చేసిన ఉద్యోగాల కల్పనలో ప్రభు త్వం గత రెండున్నర సంవత్సరాల్లో వైఫల్యం చెందుతూ, దాంతోపాటు దాని ప్రతిష్ఠ దిగజారుతూ వస్తున్నది. ఈ స్థితిలో ఆ ఉన్నత శిఖరాలను మళ్లీ చేరుకునేందుకు తెగువ తో కూడిన రాజకీయ చర్యగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు స్పష్టమైంది. యుపి ఎన్నికలు, అనంతరం 2019 ఎన్నికల్లో పార్టీ అదృష్టాలను అంచనా వేయటం ప్రధాని ప్రారంభించినట్లున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండింటిలో ఆయన అనేక చొరవలు తీసుకోలేదని అనలేము. అయితే అవి మరింత సమర్థవంతంగా అమలులోకి రావాల్సి ఉంది. రాజకీయ స్థాయిలో ముఖ్యంగా ఎన్నికల్లో విశృంఖలంగా ఉన్న అవినీతిని సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలన్న ది ఆయన ఆకాంక్ష. దాంతో అవినీతికి, నల్లధనానికి, టెర్రరిజానికి వ్యతిరేకంగా తురుపు ముక్కను ఆయన ప్రయోగించారు.
పెద్దనోట్లు చలామణీ రద్దు వెనుక అంత గొప్ప ఆశయం ఉన్నప్పుడు, ద్రవ్య వ్యవస్థలో వ్యవస్థాగత సంక్షోభాన్ని మోడీ ప్రభుత్వం నివారించి ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ఫిర్యాదుకు అవకాశం ఉండేది కాదు.
ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా దీర్ఘకాల లబ్ది ఏమి జరిగినప్పటికీ ఈలోపు తీవ్రమైన సామాజిక పర్యవసానాలు అనివార్యం. నగదు మార్చుకునేందుకు లేదా సేవింగ్స్ తదితర ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకునేందుకు దేశమం తటా బ్యాంకు బ్రాంచీల ముందు బారులు తీరుతున్న క్యూ లైన్‌లు అనంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తొలి 13 రోజులు 50 మందికిపైగా జనాలు, 11 మంది బ్యాంక్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.
పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజల కష్టాలపై ప్రతిపక్షాలు నిలదీ యటంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆరంభం నుంచీ దద్దరిల్లుతున్నాయి. ఈ గందరగోళంలో తన పాత్రను రిజర్వు బ్యాంక్ తప్పించుకోలేదు. తమ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకై బిజెపి నాయకులేమో ప్రతిపక్షాలను, నల్లధనం మద్దతుదార్లుగా అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపలున్న, బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధంలేని నామమాత్రపు అక్షరా స్యతగల కోట్లాది మంది గ్రామీణ ప్రజలు కూలీలకు చెల్లించటానికో, అవసరమైన సేవలు పొందటానికో చేతిలో డబ్బులేక, ఉన్న డబ్బు కొరగాక పడుతున్న అవస్థలు కనిపిం చటం లేదా? కూరగా యలు, పాలు, వంట సరుకుల వంటి నిత్యా వసరాలకు కట కట చెప్పనలవి కానిది.
రబీ పంటలు విత్తే సమయంలో, వ్యవసా య పరపతిలో ముఖ్యపాత్ర పోషించే సహకార సంఘా లను కరెన్సీ మార్పిడి, ఇతర లావా దేవీల నుంచి మినహా యించటం దారుణం.
నగదు కొరత అన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను దెబ్బ తీసింది. వినిమయం తగ్గుదల మూడవ త్రైమాసికం (అక్టోబర్ – డిసెంబర్) వృద్ధిపై ప్రతికూలత చూపుతుంది. జిడిపి రెండవ త్రైమాసికం వృద్ధి గణాంకాలు నవంబర్ ఆఖరుకు తెలుస్తాయి. ముడి సరుకుల ధరలు, ముఖ్యంగా ఆయిలు ధర తగ్గుదల కొనసాగుతున్నందున ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుంది. అయితే కొరతలు ధరల పెరుగు దలకు దారి తీయవచ్చు. ఆదాయపు పన్ను అధికారులు క్రియాశీలం కావటంతో ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకా శం ఉంది. దీనివల్ల ద్రవ్యలోటును జిడిపిలో 3.5 శాతానికి పరిమితం చేసే అవకాశం ఆర్థికమంత్రికి లభిస్తుంది. ప్రజల ఇబ్బందుల నుంచి ఖజానా నింపుకున్నా ప్రజా పనులపై మరింతగా పెట్టుబడి పెడతామన్న వాగ్దానాన్ని ప్రభుత్వం నిలుపుకుంటుందా అనేది అనుమానమే.
మోడీ ప్రభుత్వం కార్పొరేట్లపట్ల ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నది. కొన్ని బ్యాంక్ అప్పుల రద్దు, వడ్డీ రేట్లు మరింతగా తగ్గింపు వల్ల మూడు – నాలుగేళ్ల తదుపరైనా ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇంకా చట్టం కావలసి ఉన్న జిఎస్‌టితోపాటు పెద్ద నోట్ల రద్దు మధ్యకాలికంగా ప్రభుత్వానికి, ఆర్థిక వ్యవస్థకు ఆదాయాలు పెంచుతుంది. అయితే ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు తాత్కాలికంగా కనీవినీఎరుగని ఇబ్బందులు పడకతప్పదు.