Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

మోడీ మళ్లీ వస్తే భారత్ హిందూ పాకిస్థాన్

CONG

కాంగ్రెస్ నేత థరూర్ వ్యాఖ్య

న్యూఢిల్లీ/తిరువనంతపురం : కాంగ్రెస్ నేత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశంలో తిరిగి మోడీ అధికారంలోకి వస్తే భారతదేశం కాస్తా హిందూ పాకిస్థాన్‌గా మారుతుందని థరూర్ చెప్పారు. ఇటీవల కేరళలో ఒక కార్యక్రమంలో ఆయన ఈ విధంగా స్పందించారు. వచ్చే ఎన్నికలలో మోడీ అధికారంలోకి రాకూడదని వస్తే ఇక ఇప్పటి భారత్ రూపం మారుతుందని థరూర్ హెచ్చరించారు. మరో సారి బిజెపి విజయం సాధిస్తే మన ప్రజాస్వామ రాజ్యాంగ విధానానికి విఘాతం ఏర్పడుతుంది. అందులోని మౌలిక లక్షణాలు అన్నీ దెబ్బతింటాయి. బిజెపి వారు వారి ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటారు. దీనితో మైనార్టీల హక్కులు అణచివేతకు గురవుతాయి. వారికి సరైన ఆదరణ ఉండదు. రెండో శ్రేణి పౌరులు అవుతారు. ఈ క్రమంలో భారత్ కాస్తా హిందూ పాకిస్థాన్‌గా మారుతుందని హెచ్చరించారు. విలువైన స్వాతంత్య్రాన్ని గురుతరమైన ప్రజాస్వామ్యాన్ని , సలక్షణమైన రాజ్యాంగాన్ని అందించిన ఎందరో నేతల ఆకాంక్షలకు ఇది పిడుగుపాటు అవుతుందని థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ, నెహ్రూ, పటేల్, మౌలానా ఆజాద్ వంటి మహనీయుల త్యాగాలకు విలువ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత మాటలపై బిజెపితో పాటు కాంగ్రెస్ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. పార్టీ ఎంపి థరూర్ సరైన పదజాలంతో మాట్లాడి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.
శశి థరూర్ వ్యాఖ్యలకు బాధ్యత తీసుకుని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. థరూర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజస్వరూపం మరోసారి వెల్లడయిందని బిజెపి ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు.
మాటలకు కట్టుబడి ఉంటా
బిజెపి వస్తే దేశం రూపం మారుతుందనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తిరువనంతపురం ఎంపి థరూర్ స్పష్టం చేశారు. తాను అన్నమాటకు కట్టుబడి ఉంటానని, అక్షరం పొల్లు పోకుండా అవే మాటలను తిరిగి చెపుతానని స్పష్టం చేశారు. అధికార బిజెపి, ఆ పార్టీ మార్గదర్శి గురుస్థానపు ఆర్‌ఎస్‌ఎస్‌పై తన వైఖరి ఇదే అని తెలిపారు. పరివార్ వారు తన మాటలను మరోసారి గుర్తుకు తెచ్చుకోవచ్చునని సవాలు విసిరారు.

Comments

comments