Home ఎడిటోరియల్ బంధుప్రీతికి మోడీ దన్ను!

బంధుప్రీతికి మోడీ దన్ను!

Narendra-Modi

బంధుప్రీతిని దరిజేరనివ్వనన్న మోడీ ఎంతవరకు ఆ మాట నిలుపుకొన్నారు? ప్రధాని కావడానికి ముందు సాగించిన శిఖర స్థాయి ప్రచారంలో ‘నాకు కుటుంబం లేదు. నాచేత పనులు చేయించుకొనేవారు ఎవ్వరూ లేరు. మీ చౌకీ దారులా పనిచేస్తాను. బంధువులకు, ఇతర ఆశ్రితులకు ప్రత్యేక తరహా సేవలు అందించను’ అని ఆయన ఓటర్లకు చెప్పారు. అప్పట్లో తనను తాను ‘ఫకీర్’గా అభివర్ణించు కొన్నారు. మోడీ ప్రచారంలో విసుర్లు అన్నీ గాంధీ కుటుం బాన్ని, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను ఉద్దేశించినవే. యుపిఎ అధికారంలో ఉన్న కాలంలో వాద్రా ఆస్తులు ఎంతగానో పెరిగాయి. ‘అల్లుడు గారు’ పై చేసిన వ్యాఖ్యలు మోడీకి ఎన్నికల ప్రయోజనాలు కట్టబెట్టాయి. కానీ, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆయన నిజంగానే ఆశ్రిత పక్షపాతం లేని నేతా? స్నేహితులు, కుటుంబ సభ్యులకు పిఎంఒ(ప్రధాని కార్యాలయం)ద్వారా సహాయాలు అందలేదా?  మధ్యప్రదేశ్‌లో బిజెపి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా మూడో పదవీ కాలంలో ఉన్నారు. ఆయన కనుసన్నల్లో దేశంలో కెల్లా భారీదైన వ్యాపం, అడ్మిషన్లు రిక్రూట్‌మెంట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. వాటిలో రాజకీయవాదులకు, సీనియర్ అధికార్లకు, వ్యాపారవేత్తలకు ప్రమేయం ఉందని వినిపించింది. వ్యాపం కుంభకోణంపై దేశంలోని మీడియా చాలాకాలం పెదవి కదపలేదు. అయితే ఆ వ్యవహారంపై వికీపీడియా ప్రచురణ ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది జనం చూసిన పేజీలలో 19వదిగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాలకి, రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లకి జరిపిన ప్రవేశ పరీక్షల కుంభకోణం ఎంతో కలకలం రేపింది. రాజకీయ నాయకులకు, అధికార్లకు లంచాలిచ్చి అర్హతలేని అనేకమంది అభ్యర్థులు ప్రవేశ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు పొందారు. అంతేకాకుండాఈ కుంభ కోణం కారణంగా ఆ రాష్ట్రంలో 40మంది దాకా వ్యక్తులు అసహజ మరణానికి గురయ్యారు. ఈ కుంభకోణాలపై గగ్గోలు చెలరేగినప్పుడు చౌహాన్ నిరసన ప్రదర్శకులతో గట్టి ఎదురు దాడి సాగించారు. 2015 జూన్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వుతో సిబిఐకి దర్యాప్తు బాధ్యతను అప్పగించక తప్ప లేదు. కానీ ఇంతవరకు ఆ దర్యాప్తులో పురోగతి శూన్యం.  రాజ్యాంగేతర శక్తిగా చౌహాన్ భార్య చౌహాన్ భార్య సాధన ఆ రాష్ట్రంలో అత్యంత శక్తిమంత మైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన భర్త మద్దతుతో తన వ్యక్తిగత రాజకీయ దాహాన్ని సాధన విపరీతంగా పెంచు కున్నారు. రాష్ట్రంలో ఏ పనికైనా ఆమె తల ఊపితేనే అని ఆరోపణలు గుప్పుమన్నాయి. బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోడీ ఎంపిక కాకముందు చౌహాన్ అద్వానీతో చాలా సన్నిహితంగా మెలగడం మోడీ, అమిత్ షా ద్వయానికి రుచించలేదు. ఆ తర్వాత ఆయన్ని వారు క్షమించారు. అందుకే ఆ ద్వయం వ్యాపం కుంభకోణంపట్ల చూసీచూడనట్లు వ్యవహరించింది. అలాగే మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సాధన తిరుగులేని శక్తిగా ఎదగడాన్ని కూడా సాగనిచ్చింది.  చత్తీస్‌గఢ్‌లో రాజకీయవాదిగా మారిన 64 ఏళ్ల ఆయు ర్వేద వైద్యుడు రమణ్ సింగ్ 13ఏళ్ల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా పాలన సాగిస్తున్నారు. ఆయన కుటుంబంతో తిరుగులేని సంబంధాలు గల దగ్గరి బంధువు ద్వారానే పనులు సాగవన్నది బహిరంగ రహస్యం. ఆ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌లో గత ఏడాది అతిపెద్ద కుంభ కోణం బయటపడింది. ఆ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో దానిపై దర్యాప్తు జరుపుతోంది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆ కుంభకోణానికి సంబంధించిన అనేక పత్రాలు బయటపెట్టారు. 2007లో రమణ్ సింగ్ ప్రభుత్వం అగస్టా 109 పవర్ హెలీకాప్టర్‌ను కొనుగోలు చేయడానికి గ్లోబల్ టెండర్‌ను జారీ చేసింది. అందుకు జవాబుగా అగస్టా వెస్ట్‌లాండ్‌కు చెందిన మూడు కంపెనీలు మాత్రమే ఆ వేలంలో పాల్గొన్నాయి. ఆ కాంట్రాక్ట్ మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతాన్ని చూపిందని వెల్లడయింది. యుపిఎ హయాంలోని అగస్టా వెస్ట్ లాండ్ కేసు గురించి మోడీ తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించిన తరుణం లో సంభవించినదే ఆ అక్రమం. ప్రధానిగా అధికారంలోకి వచ్చాక కూడా మోడీ రమణ్ సింగ్ అగస్టా కుంభకోణంపై మౌనం వహించారు. రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్‌కు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో గల ‘విదేశీ అకౌంట్’ ఆరోపణ గురించి ప్రశాంత్ భూషణ్ వివాదం రేపారు. ఆ రాష్ట్ర మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ భార్య సరితా అగర్వాల్ ప్రభుత్వ అధీనంలోని 4.12 ఎకరాల అటవీ భూమిని సొంతం చేసుకోవడం గురించి మరో కథనం ఇటీవల బయట పడింది. అక్కడ ఒక విహార కేంద్రాన్ని సరిత నిర్మిస్తున్నారు. వీటిపై మోడీ స్పందన శూన్యం. ‘పనామా’ నిందితులతో దోస్తీ  నల్లధనం, విదేశీ అకౌంట్ల పీచమణుచుతామని మోడీ ప్రకటించినా ‘పనామా పేపర్లలో పేర్కొన్న కుంభకోణం’తో ప్రమేయం ఉన్నవారితో సన్నిహితంగా మెలగడానికి మోడీ వెనుకాడలేదు. అటువంటి వారిలో మోడీ అనేక పథకాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న అమితాబ్ ముఖ్యులు. ఆయన మోడీ ‘స్వచ్ఛ భారత్’, ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ వంటి పథకాలకు ప్రచార సారథిగా ఉన్నారు. గుజరాత్ పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా అక్కడ మోడీ హయాం లో అమితాబ్ ఉన్నారు. వారిద్దరి మధ్య స్నేహం చాలాకాలం నుంచీ ఉన్నదే. పనామా పేపర్స్ పేర్కొన్న మరో నటుడు అజయ్ దేవగన్ నోట్ల రద్దును సమర్థించిన ప్రముఖుడు. అప్పట్లో తన చలన చిత్రం ఒకటి ఫ్లాప్ అయినందుకు ‘జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని’ తాను విచారించ బోనని అన్యాపదేశంగా ఆయన వ్యాఖ్య చేశారు. అంటే దేశ ప్రయోజనాల కోణంలో నోట్ల రద్దును చూడాలని సూచన. ఆయన పన్నుల శాఖ యాడ్‌లో వచ్చారు కూడా. పనామా పేపర్స్ కుంభకోణ నిందితులతో మోడీ సాన్నిహిత్యంగా మెలిగితే దర్యాప్తు అధికారులకు అందే సందేశం ఏమిటి? సిబిఐని ‘పంజరంలో చిలక’లా అనేకమంది పన్నుల శాఖ అధికారులు వ్యంగ్యంగా అంటుంటారు. పనామా అకౌంట్లు గల తారలను మోడీ ఓ పక్క కౌగలించుకొంటుంటే మరోపక్క నల్ల ధనం వెలికితీసే ప్రకటిత లక్షం వెనకబడింది.  ఐపిఎల్ మాజీ పాలకుడు లలిత్ మోడీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత వసుంధరా రాజే సింధియా సాన్నిహిత్యం మోడీ నిర్వాకానికి ప్రత్యక్ష ఉదా హరణ. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర ఇంతకు ముందు హయాంలో లలిత్ మోడీ ఇష్టానుసారం వ్యవహ రించారు. ప్రభుత్వం చేత పనులు చేయించుకోడానికి లలిత్ మోడీని ఆశ్రయిస్తే చాలు అనుకునేవారు. అతను ఇంటర్ పోల్ వాంటెడ్ క్రిమినల్‌గా మీడియాలో ప్రచారం అయ్యాక అతని వ్యక్తిగత ప్రవర్తనకు వసుంధర ‘క్లీన్ చిట్’ ఇచ్చారంటే వారిద్దరి సాన్నిహిత్యం అర్థం చేసుకోవచ్చు. రాజే కుమారుడు దుష్యంత సింగ్ హెరిటేజ్ హోటల్‌కు సహ యజమాని. 2015 లో ఆ విలాసవంతమైన హోటల్ నిర్మాణానికి ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగపర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిత్రుడు లలిత్ ద్వారా దోల్‌పూర్ ప్యాలస్‌ను వసుంధర రాజే అక్రమంగా ఆక్రమించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు షా ఈ వ్యవహారంలో పెదవి కదపడం లేదు.  దుమ్ముపేరుకున్న దర్యాప్తులు  కార్పొరేట్ కంపెనీలు బొగ్గు, విద్యుత్ పరికరాల దిగుమతి బిల్లులు ఎక్కువ చేసి చూపడం వంటి మరికొన్ని కేసులపట్ల మోడీ ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతాన్ని చూపు తోందనడానికి నిదర్శనాలు ఉన్నాయి. ఆ కేసులపై దర్యాప్తు ఆర్థిక ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎజెన్సీల వద్ద పెండింగ్‌లో ఉండి దుమ్ముపేరుకుంటోంది. మరికొన్ని బడా కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి అక్రమంగా భారీ మొత్తాలు రుణాలుగా తీసుకొని ఎగవేసినట్లు కూడా కేసులు దర్యాప్తులో ఉన్నాయి. వాటి దర్యాప్తు కూడా నత్తనడక నడుస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద తిరిగి ఆ సంస్థలకే రక్షణ శాఖ కాంట్రాక్టులను ప్రభుత్వం కట్టబెట్టింది. అత్యంత ఉన్నత స్థాయి సాంకేతిక విజ్ఞానం అవసరమైన రక్షణ పరికరాల ఉత్పత్తి కాంట్రాక్ట్‌లు వాటికి కట్టబెట్టింది. ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఉత్పత్తి బాధ్యతను ప్రైవేటురంగంలోని కంపెనీలకు ప్రభుత్వం అప్పగిస్తోంది.  తాజాగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షా కంపెనీ ‘టెంపుల్ ఎంటర్ ప్రైజెస్’ 2014 15లో నష్టాల్లో ఉండి, మోడీ ప్రధాని అయ్యాక 201516లో హఠాత్తుగా రూ.50,000 నుండి రూ.80కోట్లకు ఆదాయాన్ని పెంచు కోవడంపై ప్రస్తుతం ‘ది వైర్’ అనే వెబ్‌సైట్ ప్రచురించిన కథనం సంచలనం రేపింది. ఆ వివాదంపై ముందువెనుకా చూడకుండా బిజెపి పెద్దలు ఖండనలు గుప్పించారు. వెంటనే జయ్ షా ఆ వెబ్‌సైట్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. క్రిమినల్ ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. ఈ తాజా ఉదంతం పై మోడీ మౌనాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. సిపిఎం ఈ వివాదంపై మోడీని నిలవెస్తోంది. అవినీతి అంటని చరిత్ర తనదని చెప్పుకొనే మోడీ తీరుపై ఆశ్చర్యాన్ని రేకిత్తిస్తున్న ఉదంతాలు ఇవి. ప్రధాని కావడానికి  దు మోడీ ఇచ్చిన హామీలు అన్నీ శుష్క వాగ్దానాలుగా రుజువవుతున్నాయి.

                                                                                                                                                                                  * స్వాతి చతుర్వేది