Home దునియా పేదల కడుపునింపడంలోనే తృప్తి

పేదల కడుపునింపడంలోనే తృప్తి

నలుగురికి సాయం చేయాలంటే బాగా డబ్బు ఉండనవసరం లేదు.. మనసుంటే మార్గముంటుందని నిరూపిస్తోంది నేటియువత..వారు తల్చుకుంటే సాధించలేనిది ఏదీలేదు. సినిమాలు, సరదాలకే తాము పరిమితం కాలేదంటోంది కుర్రకారు. సమాజానికి తమకు తోచినంత సాయం చేయడానికి మొగ్గుచూపుతున్నారు. సమాజసేవ చేయడంలో ఉన్న మానసిక తృప్తిని ఆస్వాదిస్తున్నారు. అలాంటి కోవకు చెందినవాడు మహమ్మద్ సుజాతుల్లా. ‘హ్యుమానిటీ ఫస్ట్ ఫౌండేషన్’ ద్వారా ప్రతి రోజూ కనీసం వెయ్యిమందికి అల్పాహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సుజాతుల్లాను హరివిల్లు పలకరించింది.

Help-to--poor-People

ముషీరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ సుజాతుల్లా ప్రస్తుతం సుల్తాన్ ఉలాల్ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో ఫార్మసీ డి చదువుతున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. మూడేళ్ల క్రితం బిఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. అల్లాను నమ్మే వ్యక్తి కావడంతో తనకున్న ఒకే ఒక బ్యాక్‌లాగ్‌ను తొలగించమని అల్లాను ప్రార్థించి ఈసారి పరీక్ష రాసాడట. ఎగ్జామ్ పాసయ్యాడు. విజయం సాధించడంతో అల్లా మెచ్చే విధంగా సమాజ సేవ చేయాలని అనుకున్నాడు. అలా అప్పుడు పుట్టిందే పేదల కడుపు నింపాలనే ఆలోచన అంటాడు సుజాతుల్లా.

అలా ఒకరోజు సుజాతుల్లా సికింద్రాబాద్ స్టేషన్ ముందున్న కొంతమంది ఆనాథలకు కడుపునిండా తినిపించి, వారి కళ్లల్లో ఆనందాన్ని చూసాడు. అంతే ఇలా ప్రతిరోజు కొంతమందికి తిండి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారమే అతను రోజూ ఎంతోమంది కడుపు నింపుతున్నాడు. నిత్యం సుమారుగా 1000 మంది ఆకలి తీరుస్తున్నాడు. ప్రతిరోజు తనకు సుమారుగా రూ.4000 వరకు ఖర్చు అవుతుందన్నాడు. కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉదయం 8:30ని॥, నీలోఫర్ ఆస్పత్రిలో ఉదయం 8గం.లకు ప్రతిరోజు అక్కడి వారందరికి అల్పాహారం అందిస్తున్నాడు.

రోజూ 20 కేజీల ఉప్మాను చట్నీతో సహా వాహనంలో పెట్టుకోవడం, హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రితోపాటు మరో ఆస్పత్రి ఎదుట పేదలకు పెట్టడం.. అందులోనే తాను కొంత తినడం.. తరువాత కాలేజీకి వెళ్లడం.. ఇదీ అతని దినచర్య. అతను ఇలా 2016 నుంచి వరుసగా 585 రోజులపాటు ఏ రోజు కూడా మిస్‌కాకుండా నిత్యం పేదలకు అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నాడు. తనను అల్లా పాస్ చేయించినందునే దేవుడు మెచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానని చెబుతున్నాడు. కేవలం టిఫిన్స్ పెట్టడమే కాకుండా వేసవిలో తాగునీటిని అందించడం, చలికాలం రాత్రి సమయాల్లో రోడ్డు మీద ఉండే వారికి దుప్పట్లు పంచడం, హెల్త్ క్యాంపులు నిర్వహించడం, ఉచితంగా వారికి మందులు ఇవ్వడం లాంటివి చేస్తున్నాడు.

హ్యుమానిటీ ఫస్ట్ ఫౌండేషన్‌ని ఏర్పాటు చేసి పేద మహిళలకు ఉచితంగా టైలరింగ్ నేర్పిస్తున్నాడు. సదాశివపేట్‌లో 3 టైలరింగ్ సెంటర్లను ఏర్పాటు చేశాడు. ఇప్పటివరకు అక్కడ 450 మహిళలు శిక్షణ పొందినట్లు సుజాతుల్లా తెలిపాడు. రోడ్డుపై తిరుగుతున్న మతిభ్రమించినవారిని గుర్తించి, వారికి స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగి, పోలీస్‌ల సహాయంతో అనాథాశ్రమంలో చేర్పిస్తుంటాడు. ఇప్పటివరకు చాలా మందిని ఫలక్‌నుమాలో ఉండే ఫాతిమా, సైనిక్‌పురిలోని ద సెకండ్ ఛాన్స్ ఆనాథాశ్రమాల్లో చేర్పించినట్లు చెబుతున్నాడు.

నమ్మకం కుదిరాకే విరాళం…

ఎవరైనా దాతలు తనకు విరాళాలు ఇవ్వాలనుకుంటే, వారిని ఉదయం ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర తను అల్పాహారం పంపిణీ చేసే సమయంలో రమ్మని చెబుతాడు. అక్కడ పరిస్థితి చూసి వారికి నమ్మకం కల్గిన తరువాతే విరాళం ఇవ్వమని చెబుతాడు. లేకుంటే ఫేస్‌బుక్‌లో ఉంటే ఫొటోలు చూపిస్తాడట. ప్రస్తుతం రంజాన్ మాసం కాబట్టి ఉదయం 3 గంట ల సమయంలో ఒకసారి, మళ్లీ రాత్రి 8 గంటల సమయంలో అల్పాహారాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే అందిస్తున్న తన సేవలను హైదరాబాద్‌లో ఉంటే పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో కూడా మొదలు పెట్టాలనేదే ధ్యేయంగా పెట్టుకున్నాడు సుజాతుల్లా. రాబోయే రోజుల్లో తను అనుకున్న ప్లాన్ విజయం సాధించాలంటే ఇంకా కొంతమంది వాలంటీర్లు అవసరమంటున్నాడు. ఎవ్వరికైనా పేద వారికి సేవ చేయాలనే ఇష్టం ఉంటే తనను సంప్రదించాలని కోరుతున్నాడు. ఇప్పటి వరకు తన స్నేహితులు, బంధువులు, సోషల్ మీడియా ద్వారా అందిస్తున్న విరాళాల వల్లే తనకీ సేవచేసే భాగ్యం కలిగిందంటున్న సుజాతుల్లా యువతరానికి ఆదర్శం గా నిలుస్తున్నాడు.

విష్ణు చారి కాసోజు