Home ఆఫ్ బీట్ ‘భారత నిర్మాత’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

‘భారత నిర్మాత’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Moksha-Gundam

కమ్యూనిస్టులను ‘రాజకీయ, సామాజిక కమ్యూనిస్టులు’ గా విభజించారు చిలీ దేశ సామ్యవాది, రాజకీయ శాస్త్రవేత్త, పాత్రికేయురాలు, క్రియాశీల సామాజిక్ కార్యకర్త మార్తా హార్నెకర్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వృత్తి, ప్రవృత్తులలో సమాజ హితాన్ని కోరి ప్రజల కోసం పాటుబడిన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. దేశ నిర్మాత.
ప్రాథమిక విజ్ఞానశాస్త్రాల సంపూర్ణ జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు అనువర్తించేవారు, విజ్ఞానశాస్త్రానికి, సమాజానికి సంధానకర్తలుగా కార్యకలాపాలు నిర్వర్తించేవారు, ప్రజాసమస్యలను పరిష్కరించేవారు ఇంజినీర్లు. మానవ వనరులతో సహా సమస్త ప్రకృతి వనరులను సమాజ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా శాస్త్రవిజ్ఞానాన్ని అనుసంధానించే వృత్తి నైపుణ్యతతో, సామర్థ్యాల కళ ఇంజినీరింగ్. మానవ వినాశనానికి, పర్యావరణ కాలుష్యానికి, సహజ వనరుల దుర్వినియోగానికి దారితీసేది ఇంజినీరింగ్ కాదు. శాస్త్రీయవిజ్ఞానం సాధించిన సమాచార, సాంకేతిక మార్పులను సామాజిక విప్లవానికి అనుకూలంగా, ప్రత్యామ్నాయ సాధనాలుగా వ్యవస్థీకృతం చేసే కళల సమాహారం ఇంజినీరింగ్.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులది ప్రకాశం జిల్లా, కంభం దగ్గర, బేస్తవారి పేట మండలం లోని మోక్షగుండం. ఈ ఊరి పేరే వారి ఇంటి పేరు. వీరి వంశస్థులు దాదాపు మూడు శతాబ్దాల పూర్వం ఈ ఊరిని వదిలి కర్ణాటక లోని చిక్కబళ్ళాపూర్ తాలూకా ముద్దెన హళ్ళి గ్రామంలో స్థిరపడ్డారు. మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, ఆయన రెండవ భార్య వెంకట లక్ష్మమ్మ ల ఆరు మంది సంతానంలో రెండవ వారు విశ్వేశ్వరయ్య.
1860 సెప్టెంబర్ 15 న జన్మించిన విశ్వేశ్వరయ్య ఏప్రిల్ 14న 1962 న కీర్తి శేషులయ్యారు. 101 ఏళ్ళ ఏడు నెలల జీవితాన్ని గడిపారు. బాల్యం నుండి శ్రమజీవి. 12 సం.ల వయస్సులోనే తండ్రి చనిపోయారు. పేదరికం అనుభవించారు. పిల్లలకు ట్యూషన్లు చెప్పి తన చదువుకే గాక ఇంటి ఖర్చులకూ డబ్బు సంపాదించేవారు. ప్రాథమిక విద్య చిక్కబళ్ళాపూర్ ప్రభుత్వ బడిలో, ఉన్నత విద్య బెంగుళూరు హై స్కూల్ లో అభ్యసించారు. ఉన్నత పాఠశాల రుసుం సమయావధిలో చెల్లించలేక, పలుకష్టాలతో పొందిన సొమ్మును పాఠశాలలో చెల్లించడానికి ముద్దెనహళ్ళి నుండి బెంగుళూరుకు 65 కి.మీ.ర్లు నడిచి వెళ్ళారు. అప్పుడు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండిన బెంగుళూరు సెంట్రల్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. ఇప్పటి కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళ నాడు, కేరళ ఆనాటి మద్రాసు ప్రావిన్స్ (రాష్ట్రం) లో ఉండేవి. పూనా ఇంజినీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా, పోస్ట్ గ్రాజుయేషన్ డిగ్రీ చేశారు. ఇంజినీరింగ్ లో అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాల ప్రదర్శనకు ఆయనకు ‘జేమ్స్ బర్కిలి బంగారు పథకం’ లభించింది. జీవితాంతం నిరాడంబర జీవితం గడిపారు. స్వచ్ఛమైన బట్టలు ధరించే వారు. తన దుస్తులను తానే ఉతుక్కొని, ఇస్త్రీ చేసుకునే వారు. ఈ లక్షణాన్ని మనం కమ్యూనిస్టు యోధులు చండ్ర రాజేశ్వరరావు లో చూశాం. ఆరోగ్యవంతమైన శరీరంలో సామాజిక ఆరోగ్యాన్ని కాపాడే ఆలోచనలను పెంచుకున్నారు. సమాజానికి, దేశానికి ఉపయోగపడ్డారు.
ఇంజినీరింగ్ పూర్తిచేయగానే 23 ఏళ్ళ వయసులోనే బాంబే ప్రోవిన్స్ (రాష్ట్రం) లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగమిచ్చారు. ఆనాటి బాంబే రాష్ట్రం లో నేటి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు, కొంత కర్ణాటక ప్రాంతం ఉండేవి. తర్వాత ఆయనను భారత నీటిపారుదల కమిషన్ లో నియమించారు. నీటి ప్రవాహానికి తగినట్లుగా జలాశయంలో నీటిమట్టం నిర్ణాయక స్థాయికి చేరగానే గేట్లు వాటంతటవే మూసుకుపోయే వ్యవస్థను కనుగొన్నారు. దీని వలన ఆనకట్టలకు ప్రమాదం వాటిల్లదు. ఈ ఏర్పాటును మొదట 1903 లో పూణె దగ్గర ఖడక్ వాస్లా జలాశయం లో ఉపయోగించారు. అటు పిమ్మట మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ వద్ద అల్ తిగ్రా ఆనకట్ట లో వినియోగించారు. మైసూరులో కావేరి నది పై కృష్ణరాజ సాగర్ ఆనకట్టలో కూడా ప్రయోగించారు. ఈ ఆనకట్ట క్రిందనే బృందావన్ గార్డెన్స్ గా ప్రసిద్ధి చెందిన మనోహర ఉద్యానవనాన్ని నిర్మించారు. హైదరాబాదు లో నీటివసతిని, డ్రైనేజ్ వ్యవస్థను నెలకొల్పారు. ఆ నగరాన్ని మూసీ నది వరదల నుండి రక్షించే పథకాన్ని ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ నిర్మాణం ఆయన ప్రణాళికే. విశాఖపట్టణం రేవును సముద్ర నీటి కోతలకు గురికాకుండా రక్షణ వ్యవస్థను నెలకొల్పారు. తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణం లో ఈయన ప్రధాన పాత్ర పోషించారు. శతాబ్దం దాటినా ఈ నిర్మాణాలన్ని చెక్కుచెదరకుండా పనిచేస్తున్నాయి. ఇన్నేళ్ళ్ పరిణామాలకు సరిపడే పథకాలను రూపొందించడం గమనించదగ్గ అంశం. ఆయన నాసిక్ లో, ఖాందేశ్ లో, పూనా లో, సూరత్ మునిసిపాలిటీ లో, సింధ్ ప్రాంతంలో పని చేశారు. 1906-07 మధ్యకాలంలో ఆయనను భారత ప్రభుత్వం అరేబియా దేశమైన యెమెన్ లోని ఏడెన్ కు పంపింది. అక్కడ ఆయన నీటిపారుదల, మురుగునీటి ప్రవాహ వ్యవస్థలకు పథకాలను రచించి విజయవంతంగా అమలు చేశారు. చైనా, జపాన్, ఈజిప్ట్, కెనడా, అమెరికా, రష్యా మొదలగు దేశాలలో పర్యటించి ఆ దేశాలలో కూడా అనేక ప్రాజెక్టులను రూపొందించారు. 1909 లో ప్రభుత్వ సేవల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి మైసూరు సంస్థానంలో దివాన్ (మంత్రి) గా పని చేశారు. అక్కడ ప్రజాపనుల, రైల్వేశాఖలను నిర్వహించారు. 58 సం.ల వయస్సులో మైసూరు సంస్థానం నుండి పదవీ విరమణ చేశారు. తదుపరి 1927 నుండి 1955 వరకు టాటా స్టీల్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి ని నిర్వహించారు. అటు తర్వాత దాదాపు 95 ఏళ్ళ్ వయసు వరకు, తల శరీరానికి 90 డిగ్రీల కోణంలో వంగినా, కళ్ళజోడు కూడా లేకుండానే చదువుతూ, రాస్తూ అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేవారు. పదవీ విరమణ మరణానంతరమేనన్న కమ్యూనిస్టుల నానుడిని నిజంగా అమలు చేశారు.
విశ్వేశ్వరయ్య ఏనాడూ బిరుదులను, పేరు, కీర్తి, ప్రతిష్టలను కోరుకోలేదు. అవే ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. ఆయన ప్రతిష్టను పురస్కారాలు పెంచలేదు. ఆయనే పురస్కారాల గౌరవాన్ని నిలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం తమ అత్యుత్తమ బిరుదులలో ఒకటైన సర్ బిరుదుతో సన్మానించింది. ఈ బిరుదు ను జోడించి ఆయనను మర్యాద పూర్వకంగా సర్ ఎం.వి. అని పిలిచేవారు. బ్రిటిష్ ప్రభుత్వం ఐదవ జార్జ్ రాజు ఆధ్వర్యంలో, 1911 లో భారత సామ్రాజ్య సహచరుడు (కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్), 1915 లో భారత సామ్రాజ్య యోధుడు (నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్) అన్న బిరుదులతో సత్కరిం చింది. 1955 లో భారత ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారం భారత రత్న తో గౌరవించింది. లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్, గౌరవ సభ్యత్వం తో, బెంగుళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫెలొషిప్ తో సన్మానించాయి. ప్రపంచవ్యాపితంగా 8 విశ్వవిద్యాలయాలు అనేక గౌరవ డాక్టరేట్లతో సన్మానించాయి. డాక్టర్ ఆఫ్ సైన్స్, డాక్టర్ ఆఫ్ లాస్, డాక్టర్ ఆఫ్ లిటరేచర్ వీటిలో కొన్ని. ఈ విభాగాలన్నింటిలో విశ్వేశ్వరయ్య నిష్ణాతులే. 1923 లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన శత వార్షికోత్సవానికి (100 వ పుట్టిన రోజు ఉత్సవాలకు) నాటి ప్రధాని నెహ్రూ హాజరు కాగా మైసూరు రాజు అధ్యక్షత వహించారు.
సమాజ ప్రయోజనం కోసం అనేక రచనలు చేశారు. పుస్తకాలు రాశారు. ‘భారత నిర్మాణానికి’ (1920) అన్న పుస్తకంలో భారత సాంస్కృతిక గొప్పదనాలను, జ్ఞాన సంపదలను, నాగరికతా విశిష్టతలను వర్ణించారు. నిరక్షరాస్యతా నిర్మూలనకు అనేక సూచనలు చేశారు. దుబారా ఖర్చులను నిరసించారు. పొదుపును, నిరాడంబరతను ప్రోత్సహించారు. సైన్యంపై పెడుతున్న అధిక ఖర్చుకు అసంతృప్తి వ్యక్తపరిచారు. ఆనాటి రూ.15 కోట్ల వార్షిక అప్పును విని ఆశ్చర్యపడ్డారు. అప్పుల భారంతో దేశ్ భవిష్యత్తు ఏమవుతుందోనని బాధపడ్డారు. ‘భారత దేశానికి ప్రణాళికా బద్ద ఆర్థిక వ్యవస్థ’ (1936) దేశ నిర్మాణంలో మొదటి ప్రామాణిక ప్రణాళికా గ్రంథం. స్వాతంత్రం తర్వాత ప్రణాళికాబద్ద అభివృద్ధికి ఇది దోహద పడింది. సోవియట్ యూనియన్ పంచవర్ష ప్రణాళికలను అనుసరించి, అమలుచేసుకోవడానకి మార్గదర్శకమైంది. ‘భారత దేశంలో నిరుద్యోగం, కారణాలు, పరిష్కారాలు’ (1932) అనే పుస్తకంలో వివరించిన అంశాలన్నీ నేటికీ సజీవంగా కొనసాగుతున్నాయి. పరిష్కారాలను మాత్రం ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదు. ‘నా ఉద్యోగ జీవిత జ్ఞాపకాలు’ (1951) 5. బెంగుళూరు ఉపన్యాసాలు ‘నా సంపూర్ణ ఉద్యోగ జీవిత సంక్షిప్త జ్ఞాపకాలు’. ఇవి విశ్వేశ్వరయ్య్ రచనలలో కొన్ని.
‘మనం నిష్క్రియా పరత్వానికి, కష్టరహిత జీవనశైలికి (సోమరితనానికి) అలవాటు పడ్డాం. మతవాద భావజాలంతోనో, ఉన్నత వర్గ దేశభక్తితోనో, అదృష్టం మీద నమ్మకంతోనో ప్రభావితులమవుతున్నాం. శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని సంపాదించకుండానే అభివృద్ధి కావాలనుకుంటాం. క్రియాశీలత, ఆలోచన, క్రమశిక్షణ, ఆధునిక ఆశయాలు గతకాలపు అవసరాలనుకుంటాం.‘ అని 16.03.1912 న బెంగుళూరు లో ఒక సమావేశంలో అన్నారు. ఉపన్యాసాలు ఇవ్వవలసిన సందర్భాలలో బాగా తయారయి మనసారా ప్రేక్షకులను, వీక్షకులను ఆకట్టుకునే విధంగా ఉపన్యసించే వారు. ‘నిజమైన సేవలనందించాలంటే డబ్బుతో కొనలేని, కొలవలేని మానవత్వాన్ని అందులో రంగరించాలని‘ ఎప్పుడూ అనే వారు. ‘సోమరితనం మన దేశానికి పెద్ద శాపం. అందరూ పని చేస్తున్నట్లే కనిపిస్తారు. నిజానికి ఒక్కరో ఇద్దరో పని చేస్తారు. పని చేసేవారి కంటే పర్యవేక్షించే వారే ఎక్కువ. మన వ్యవస్థలో పని చేసేవారికి, చేసినట్లు నటించేవారికి ప్రయోజనాల కల్పనలో తేడాలుండవు. ఐదు మంది పనివారున్న సమూహంలో ఒకరే పని చేస్తారు. ఒకరు ఏమీ చేయరు. ఒకరు విశ్రాంతి తీసుకుంటారు. ఇంకొకరు వీరిని గమనిస్తూ ఉంటారు. ఇంకొకరు వీరందరి కార్యక్రమాలకు సహాయపడుతుంటారు.‘ అని విశ్వేశ్వరయ్య బాధతో, ధిక్కార స్వరంతో ఒకింత ఎగతాళి ధోరణి లో అన్నారు. ‘ఇనుములా తుప్పు పట్టే కంటే ఉక్కులా సేవలందించడం మేలు.‘ ఆయన సందేశం.
‘పారిశ్రామికీకరించు లేదా నశించు ‘అన్నది విశ్వేశ్వరయ్య్ నినాదం. స్వాతంత్ర సమర యోధులు బాల గంగాధర టిలక్, గోపాల కృష్ణ గోఖలే, మహాత్మా గాంధి మొదలగు వారితో ఈయనకు మంచి పరిచయాలున్నాయి. వారి మధ్య తరచూ చర్చలు జరుగుతూ ఉండేవి. గాంధీ గ్రామీణ పారిశ్రామికీకరణ గురించి ప్రముఖంగా ప్రస్తావించేవారు. ఒక సారి విశ్వేశ్వరయ్య గాంధీకి ఇలా సమాధానమిచ్చారు. ‘గ్రామీణ లఘు, గృహ పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలు కూడా అవసరం. ఇవి మన దిగుమతులను తగ్గించగలవు. విదేశాలకు అధికంగా తరలి పోతున్న డబ్బును ఆపగలవు. మన స్థానిక పట్టణ పరిశ్రమలకు, గ్రామీణ ఉపాధి పరిశ్రమలకు యంత్రాలను, పరికరాలను అందించగలవు.‘ ఇది ఈనాటికీ నిత్యనూతనమైన మాట. సర్ ఎం.వి. సనాతన సాంప్రదాయ కుటుంబంలో జన్మించినా ఆధునికతను అందిపుచ్చుకున్నారు. ప్రగతిశీల భావాలతో పయనించారు. జాతీయ, అంతర్జాతీయ్ సమాజాల్ శ్రేయస్సు కోసం 80 ఏళ్ళ పాటు అలుపెరిగని కృషి చేశారు. స్వార్థరహిత సమాజ సేవ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సుగుణాల కమ్యూనిస్టు భావాలను పుణికి పుచ్చుకున్నారు. ఆయన మంచి ఇంజినీరే కాదు. సంఘ నిర్మాత, సంస్కర్త, సామాజిక కమ్యూనిస్టు, భారత నిర్మాత్.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి,
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు – 23.10.2016 సంచార వాణి: 9490 20 4545