Home Default ఊరినే ఖాళీ చేయించిన వానరం!

ఊరినే ఖాళీ చేయించిన వానరం!

Monkey Attackచెన్నై: ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తే ఓరేయ్ కోతి చేష్టలు అపురా అంటాం. మరీ కోతే అలాంటి తింగరి చేష్టలు చేస్తే ఇంకేమైనా ఉందా… అంతా ఆగం అడివే. ఒక కోతి చేష్టలను తట్టుకోలేక ఓ ఊరే ఖాళీ చేయాల్సి వచ్చిన ఘటన తమిళనాడులోని సీర్గాళీ, సమీపంలోని తెన్నల్కుడి గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బాధితుడు మాట్లాడుతూ… దాదాపు 60కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్న మా గ్రామంలో నెల రోజుల క్రితం ఓ కోతి వచ్చి చేరింది. అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి. మొదట్లో కోతి ఇండ్లలోకి చొరబడి ఆహారాన్ని ఎత్తుకెళ్లడం చేసేది. అలా మొదలైన కోతి చేష్టలు ప్రజలపై దాడుల వరకు వచ్చాయి. గ్రామంలోని పశువులను, కుక్కలను వెంబడించి కరవడం మొదలెట్టింది.
ఈ క్రమంలో ఒక రోజు కోతి 70 సంవత్సరాల వృద్ధురాలిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో ఆమె కోమాలోకి పోయింది. కోతిని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరకు బోనులు ఏర్పాటు చేసినా.. అది తెలివిగా తప్పించుకుంటూ మరింతగా రెచ్చిపోయి బీభత్సం సృష్టిస్తోంది. దీంతో కోతి చేష్టలు తట్టుకోలేక గ్రామ ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి, కట్టుబట్టలతో ఊరి చివర ఉండే ఆలయంలో తల దాచుకుంటున్నామని బాధితుడు తెలిపాడు. కోతిని పట్టుకున్న తర్వాతే తాము తిరిగి ఊళ్లోకి వెళ్తామని గ్రామస్తులు చెబుతున్నారు.. దీనిపై తిరువారూరు అటవీ శాఖ అధికారులు స్పందించారు. కోతులను పట్టుకునే నిపుణులను పిలిపించామని, దాన్ని త్వరలోనే పట్టుకుంటామని గ్రామస్తులకు హమీ ఇచ్చారు.
Monkey Attack in Nagapattinam