Home దునియా మంచి సలహా

మంచి సలహా

ఆహారం వెదుక్కుంటూ..గుంపులు, గుంపులుగా ఊళ్ళ మీదకి బయలుదేరాయి కోతులన్నీ. ఎంతసేపు వెదికినా వాటన్నింటికీ సరిపడా ఆహారం ఎక్కడా దొరకలేదు. ఎక్కడైనా ఒకటి రెండు చెట్లపై కాయలో పళ్ళో కొద్దిగా కనిపించినా అవి ఎవరికీ సరిపోవటం లేదు. పైగా పోట్లాటలు వచ్చేస్తున్నాయి. ఆ గుంపులోనే ఒక తల్లి కోతి ఉన్నది. ఆహారం కనిపించినప్పుడల్లా పిల్ల కోతి కోసమని అది కూడా ప్రయత్నిస్తుంది. కానీ ఏదీ పిల్ల ఆకలి తీరేంతగా దొరకటం లేదు. నిరాశగా పిల్ల కోతి వైపు చూసింది. అది ఆకలికి తాళలేక చెట్టు కొమ్మని కరుచుకుని పడుకుండిపోయింది.

అది చూసి తల్లి కోతికి బాధ కలిగింది. పిల్ల కోతి ఆకలి తీర్చేది ఎలాగ అని బాగా ఆలోచించింది. ఇలా గుంపులో ఉంటే తినటానికి దొరకటం కష్టమే అని దానికి తోచింది. అందుకే తన పిల్లను తీసుకుని గుంపుని వదిలి వేరే దారిలో ఆహారాన్ని వెదుక్కుంటూ బయలుదేరింది.

కొంతసేపటికి ఒక ఊరిలో ప్రవేశించిన తల్లి కోతికి ఊరంతా పండ్లూ, కాయలతో కళకళ్ళాడుతూ కనిపించింది. వాటిని చూసి సంబరంతో చాలా సేపు తల్లీ, పిల్లా ఆ కొమ్మ మీదకీ , ఈ కొమ్మ మీదకీ ఎగిరి గంతులేసాయి. కాసేపయ్యాకా తల్లి కోతి, పిల్ల కోతి కాయల్ని కోసి తినటం మొదలెట్టాయి. అయితే పిల్లకోతి చేతికి అందిన ప్రతి కాయా కొయ్యటం, కొరకటం నచ్చకపోతే కిందకి పడెయ్యటం చెయ్యసాగింది. అది గమనించిన తల్లి కోతి..ప్రతీకాయా ఎందుకలా కొరికి కింద పడేస్తున్నావ్? అని కోప్పడింది పిల్లకోతిని..ఆహారం దొరికిన ఆనందంలో తల్లి కోతి కోపాన్ని పట్టించుకోలేదు పిల్ల కోతి.

అప్పుడు తల్లికోతి పిల్ల కోతిని దగ్గరకు రమ్మని..ఇప్పటి వరకూ ఆహారం దొరకక బాగా నీరసించి పోయావు. ఇప్పుడేమో దొరికిన ఆహారాన్ని కొరికి కింద పడేస్తున్నావ్. ఎక్కువగా ఉంది కదా అని వృథా చెయ్యకూడదు. పొదుపు ఎప్పుడూ మంచిదే. ఆకలి తీరే వరకూ సరిపడా తిను. అంతేకానీ కళ్ళ ఎదురుగా ఎక్కువ ఆహారం ఉంది కదా అని కొరికి పడేస్తే కొద్ది రోజులకే ఆహారం అయిపోతుంది. పైగా సరి పడా తిని వదిలేస్తే రైతు మనలను పట్టించుకోడు. వృథాగా కొరికి పడేస్తే తన్ని తరిమేస్తాడు. అప్పుడు మళ్ళీ మనం ఆకలితో ఉండాల్సివస్తుంది అంది. అమ్మో..! వద్దు. బాగా చెప్పావమ్మా..! నాకు కావాల్సినంతే తింటాను. కొరికి పడెయ్యను. అంది పిల్ల కోతి ఆకలి బాధ గుర్తొచ్చి. సంతోషంగా చూసింది తల్లి కోతి పిల్లకోతి వైపు తన సలహా ఫలించినందుకు.

కన్నెగంటి అనసూయ
9246541249