Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భారత్ రేటింగ్ ‘బిఎఎ2’

 13 ఏళ్ల తర్వాత రేటింగ్‌లో మార్పు
 ‘సానుకూలం’ నుంచి ‘నిలకడ’గా దృక్పథం
 సంస్కరణలతో పురోగతి బాటలో దేశం
 అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ వెల్లడి

Moody's

ముంబయి: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను పెంచింది. ఆర్థిక సంస్కరణలతో వృద్ధి దిశలో పయనిస్తున్న భారత్ రేటింగ్‌ను ‘బిఎఎ3’ నుంచి ‘బిఎఎ2’కు సవరించి.. నిలకడ రేటింగ్‌ను ఇచ్చింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మూడీస్ భారత్ రేటింగ్‌ను పెంచడం గమనార్హం. 2004లో భారత్‌కు ‘బిఎఎ3’కు రేటింగ్‌ను ఇవ్వగా, ఆ తర్వాత ఇప్పుడు ‘బిఎఎ2’కు పెంచడం భారత్‌కు ఎంతో సానుకూలమైన విషయంగా చెబుతున్నారు. అదే విధంగా 2015లో ఇచ్చిన ‘సానుకూలం’ నుంచి ‘నిలకడ’గా రేటింగ్‌ను మార్పు చేసింది. ‘బిఎఎ3’ రేటింగ్ అంటే అత్యంత తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ అన్నమాట.. అంటే తక్కువ హోదా కంటే కాస్త మెరుగని చెప్పవచ్చు. క్రెడిట్ రేటింగ్స్ దేశ ద్రవ్య, ఆర్థిక, నియంత్రణ విధానాలకు కొలమానంగా భావిస్తారు. ఉత్తమ రేటింగ్స్ ఉంటే ఆ దేశం, కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ పెట్టుబడులను సమీకరించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
అధిక రుణ భారంపై హెచ్చరికలు
అధిక రుణ భారం దేశ క్రెడిట్ ప్రొఫైల్‌కు అవరోధంగా మారే అవకాశం ఉందని కూడా మూడీస్ హెచ్చరించింది.
మోడీ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఆర్థిక, సంస్థాగత సంస్కరణలతో పురోగతి కొనసాగుతుందని, దీర్ఘకాలంలో భారత్ వృద్ధి పథంలో పయనించగలదనే అంచనాలతో భారత్ రేటింగ్‌ను పెంచాలని మూడీస్ నిర్ణయించింది. ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద, నిలకడ ఆర్థిక వ్యవస్థతో మధ్యకాలికంగా చూస్తే రుణ భారం తగ్గనుందని మూడీస్ నివేదిక పేర్కొంది. ఇటీవల భారత్‌లోని 29 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) కీలక సంస్కరణ అని, దీంతో అంతర్రాష్ట్ర వాణిజ్యానికి ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయని, దీంతో మరింత వృద్ధి సాధ్యమవుతుందని మూడీస్ పేర్కొంది. అదే సమయంలో భారత్ క్రెడిట్ ప్రొఫైల్ విషయానికొస్తే దేశీయ అత్యధిక రుణ భారం ఇప్పటికీ అవరోధంగా ఉందని, ఇటీవల చేపట్టిన సంస్కరణలు రుణ భారం సమస్యను తగ్గించడంలో దోహదం చేస్తాయని రేటింగ్ సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు అమలు చేసిన సంస్కరణలతో భారత్‌లో వ్యాపార వాతావరణం, ఉత్పా దకత పెరుగుతోందని, విదేశీ, దేశీయ పెట్టుబడులు పెరుగుతాయని మూడీస్ తెలిపింది.చివరకి బలమైన, స్థిరమైన అభివృద్ధిదిశగా దేశం ముందు కెళ్తుందని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్స్ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.
జిడిపి 6.7 శాతంగా అంచనా
ఆర్థిక సంవత్సరం ముగింపు 2018 మార్చి నాటికి భారత్ వాస్తవ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు మోస్తరుగా 6.7 శాతం ఉండనుందని మూడీస్ అంచనా వేస్తోంది. అంతకుముందు ఏడాదిలో వృద్ధి రేటు 7.1 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. స్థానిక కరెన్సీ రేటింగ్‌ను స్వల్పకాలికంగా పి 3 నుంచి పి 2కు మార్పు చేసింది. మోడీ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అనుకూలంగా పన్ను విధానాలను సులభతరం చేసిందని మూడీస్ పేర్కొంది.
మూడీస్‌ను ప్రశ్నిస్తున్న విదేశీ సంస్థలు
మరోవైపు ఇప్పటికీ కొన్ని మార్కెట్ సంస్థలు మూడీస్ నివేదికను ప్రశ్నిస్తున్నాయి. రేటింగ్ అప్‌గ్రేడ్‌కు తక్కువ సమయం ఇచ్చారని.. భారత్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణపై చాలా ఆందోళనలు ఉన్నాయని విదేశీ బ్యాంక్ డీలర్ ఒకరు అన్నారు. ఇతర ఏజెన్సీలు మూడీస్‌ను అనుసరిస్తాయని తాను ఊహించడం లేదని తెలిపారు. మూడీస్ ప్రకటనతో స్టాక్‌మార్కెట్లు ర్యాలీ బాట పట్టాయి. మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.

Comments

comments