Home తాజా వార్తలు ఇంకా తెరిపిస్తాం

ఇంకా తెరిపిస్తాం

ktr

త్వరలో మరికొన్ని పరిశ్రమలు తెరుచుకుంటాయి : సిర్పూర్ సభలో మంత్రి కెటిఆర్

నల్లగొండ బీమా సిమెంట్, రామగుండం ఎరువుల కర్మాగారం, భూపాలపల్లి ఎపి రేయాన్, ఆదిలాబాద్ సిసిఐ పరిశ్రమలను కూడా త్వరలోనే ప్రభుత్వం తెరిపిస్తుంది
తెరిపించిన వాటి విస్తరణకూ కృషి చేస్తుంది

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: తెలంగాణాలో మరికొన్ని మూతపడిన పరిశ్రమలను త్వరలో తెరిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని  రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. మూతపడిన పరిశ్రమలను పున: ప్రారంభించేందుకు ప్రైవేట్ పెట్టుబడివర్గాలు ముందుకు వస్తే ప్రభుత్వం తరుపున  అనేక రాయితీలతో పాటు ప్రోత్సాహకా లు అందజేస్తామని మంత్రి తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలో ని సిర్పూర్ పేపర్ మిల్లు క్రీడా మైదానంలో గురువారం ఏర్పా టు చేసిన  బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు.  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే యాజమాన్యం నిర్లక్షం వల్ల సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడిందని దానికి ప్రభుత్వం బాధ్యత కాదని ఆయన స్పష్టం చేశారు.  తెలంగాణలో టిఆర్‌ఎస్  ప్రభుత్వం ఏర్పాటు తరువాత  సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో పాటు స్థానిక ఎంఎల్‌ఏ కోనేరు కోనప్ప పట్టుదలతోనే  సిర్పూర్ పేపర్ మిల్లును  పున : ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.  రాష్ట్రంలో  మూతపడ్డ పరిశ్రమలను మళ్లీ తెలిరిపించేందుకు సిఎం కెసిఆర్ ఎన్నో ప్రోత్సాహకాలు అందజేస్తున్నారని  నల్గొండ జిల్లాలోని భీమా సిమెంట్ కం పెనీ, రామగుండంలోని ఎరువుల కర్మాగారం, భూపాల్‌పల్లి జిల్లాలోని బాలాపూర్ ఇండస్ట్రిస్ (ఎపిరేయాన్), ఆదిలాబాద్‌లోని సిసిఐని ప్రారంభించేందుకు ప్రభుత్వం  పూర్తి స్థాయిలో రాయితీలు అందిస్తూ త్వరలోనే తెరిపించే ఏర్పాట్లు చేస్తుందన్నారు. మూతపడిన  పరిశ్రమలను తెరిపించడమే కాకుండా  పరిశ్రమల విస్తరణకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీని రూ. 2వేల కోట్ల తో  విస్తరించేందుకు  యాజమాన్యం  అంగీకరించిందన్నారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా చిన్న, మధ్య తరహా  పరిశ్రమలను ప్రోత్సహించేదుకు ప్రత్యేకంగా ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించి దాదాపు 60 పరిశ్రమలకు రాయతీలు అందిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడమే ధ్యేయంగా కాకుండా ఉపాధి కల్పన కోసం పరిశ్రమలను తెరిపిస్తున్నామన్నారు. కొలువుల కల్పనకు ప్రత్యేకంగా టిఎస్ ఐపాస్ ప్రవేశపెట్టి రూ. 123 వేల కోట్లతో కొత్త పెట్టుబడులు పెడుతున్నామన్నారు. తెలంగాణ వస్తే బతుకులు చీకటి అవుతాయని గతంలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాట్లాడారని, ప్రస్తుతం నాలుగేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధితో వాళ్ల నోళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంక్షేమం అభివృద్ధ్దిని అందరిని కలుపుకుపోవాలన్నదే సిఎం కెసిఆర్ ఆకాంక్ష అని, కలలు కనే బంగారు తెలంగాణ కావాలన్నారు. గత కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో రూ.800 కోట్లు పెన్షన్‌లకు కేటాయించగా ప్రస్తుతం రూ.5700 కోట్లు కు పెరిగిందన్నారు. కొందరు కాంగ్రెస్, టిడిపి , బిజెపి నేతలు సిఎం కెసిఆర్‌ను గద్దెదింపుతామని ప్రగల్బాలు పలుకుతున్నారని, అసలు సిఎం కెసిఆర్‌ను ఎందుకు గద్దె దించాలని ప్రశ్నించారు. పేదల ముఖం లో చిరునవ్వు చూడాలని ఆకాంక్షతోనే కెసిఆర్ ముందుకు సాగుతున్నారని, విద్యార్థులకు సన్నబియ్యం, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ పథకాల ద్వారా సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలను కాంగ్రెస్ నాయకులు కమీషన్ పథకాలుగా వక్రీకరిస్తున్నారని, పచ్చకళ్లవారికి ఊరంతా పచ్చగానే కనిపించినట్లు కమీషన్‌లు పొందే వారికి ప్రభుత్వ పథకాలు కమిషన్ పథకాలుగానే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులను ఆదుకునేందుకు పంటల పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెట్టి 58 లక్షల మంది రైతులకు రూ. 8 వేల చొప్పున అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందని, దేశంలోనే తెలంగాణ అభివృద్ధి పనుల్లో నంబర్ –1 స్థానంలో నిలిచిందన్నారు.
డిసెంబర్ నుంచి ఎస్‌పిఎంలో ఉత్పత్తి …
కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో వచ్చే డిసెంబర్ నెల నుంచి ఉత్పత్తి జరుగుతుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు.కార్మికుల కష్టాలను చూడలేకనే ఎంఎల్‌ఏ కోనప్ప పట్టుదలతో మిల్లు ను ప్రారంభించే విధంగా కృషి చేశారన్నారు. ఎస్‌పిఎం ను స్వాధీనం చేసుకున్న జెకె పేపర్‌మిల్స్ యాజమా న్యం దేశ వ్యాప్తంగా రూ.30 వేల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాలు సాగిస్తుందన్నారు. కార్మికులకు అందాల్సి న వేతన బకాయిలు, రాయితీలు దశలవారీగా అందిస్తామన్నారు. స్వార్థపూరిత రాజకీయ కుట్రలతో పారిశ్రామిక వాతావరణాన్నిదెబ్బతీయవద్దన్నారు. ఉపాధి కల్పనే ధ్యేయంగా నూతన పారిశ్రామిక విధానాలను పాటిస్తూ రాయితీలు అందజేస్తున్నామన్నారు.ఈ సభలో మంత్రులు జోగు రామన్న,అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వవిప్ నల్లాల ఓదెలు,ప్రభుత్వ సలహదారు జి.వి వేక్, ఎంపి గోడం నగేష్, ఎంఎల్‌సి సతీష్, ఎంఎల్‌ఏలు దివాకర్‌రావు, కోవలక్ష్మి,జెకె పేపర్‌మిల్స్ ఎండి సింఘానియా, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, జిల్లా పరిషత్ చైర్మన్ శోభసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.