Home దునియా దారంతా విజ్ఞాన భాండాగారమే

దారంతా విజ్ఞాన భాండాగారమే

పాత పుస్తకాలకు కోఠి, అబిడ్స్ సండే బజార్‌గా ప్రసిద్ధిగాంచింది. గత నాలుగు దశాబ్దాలుగా  పుస్తకాల బజార్ ఇక్కడ కొనసాగుతోంది. ప్రతి ఆదివారం  అబిడ్స్ నెహ్రూ విగ్రహం నుంచి కోఠి ఆంధ్రాబ్యాంక్ మీదుగా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వరకు ఫుట్‌పాత్‌లపై  పాత పుస్త కాల దుకాణాలు దర్శనమిస్తుంటాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలమంది వ్యాపారులు ఇక్కడి ఫుట్‌పాత్‌లపై పాత పుస్తకాలను పెట్టి అమ్ముతుంటారు. ఈ బజార్‌లో తెలుగు, ఇంగ్లిష్, హింది సాహిత్య పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను అమ్ముతుంటారు.

Books

హామ్లెట్, మర్చంట్ ఆఫ్ వెనీస్ (షేక్‌స్పియర్), మహాప్రస్థానం (శ్రీశ్రీ), వింగ్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం, ఇన్‌సైడర్, ద లాస్ట్ మొఘల్(విలియం డాల్‌రింగఫుల్), గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్(అరుంధతిరాయ్), ఇస్తాంబుల్ (బర్షాక్ పాముక్)లతో పాటు మరెన్నో పుస్తకాలు తక్కువ రేట్లకు లభిస్తాయిక్కడ. కాల్పనిక సాహిత్యం, విద్యా, వైజ్ఞానిక, చిత్రకళ మొదలైన రంగాలు, ఆర్కిటెక్చర్, మ్యాగజెయిన్లు లభించే చోటిది. కేవలం పది రూపాయలకే పాత పుస్తకాలు లభిస్తాయి. గొప్ప సాహిత్య పుస్తకాలు సైతం నామమాత్రం రేట్లకే తీసుకోవచ్చు.

రచయితను బట్టి, పుస్తకాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. ఎడ్యుకేషన్‌లో ఎల్‌కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు, ఎంసెట్ నుంచి త్రిపుల్ ఐటీ వరకు వివిధ ఎంట్రన్స్ టెస్టులకు అవసరమయ్యే మెటీరియల్ కావాలంటే ఇక్కడికి వస్తే సరిపోతుంది. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన బహిరంగ మార్కెట్‌లో రూ.250ధర పలికే పుస్తకం ఇక్కడ వంద రూపాయలకే దొరుకుతోంది.

ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ బజార్‌కు తరలివచ్చి పుస్తకాలను తక్కువరేట్లకు ఖరీదు చేస్తుంటారు. అలాగే పరిశోధనలు చేసే వారు సైతం ఇక్కడికి వచ్చి పుస్తకాలను కొనుగోలు చేస్తారు. ఇక్కడ వ్యాపారులు పాఠ్య పుస్తకాలను అద్దెకు సైతం ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వాటిని చదువుకొని తిరిగి ఇస్తుంటారు. ఫుట్‌పాత్‌పై కొనసాగే పాత పుస్తకాల వ్యాపారానికి వర్షం అడ్డంకిగా నిలుస్తోంది. వర్షం పడినప్పుడు పుస్తకాలను కాపాడుకోవడానికి వారు నానాయాతన పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పలు సందర్భాల్లో వర్షంలో తడిసి పాత పుస్తకాలు పాడై పోతూ వ్యాపారులు నష్టపోతున్నారు. ప్రస్తుతం సాంకేతి పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఆన్‌లైన్‌లోనే పుస్తకాలు కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్‌లో పుస్తకాలకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో రావడంతో ఆ ప్రభావం పాత పుస్తకాల వ్యాపారంపై పడుతుందని వ్యాపారులు వాపోతున్నారు.

సతీష్,
మన తెలంగాణ, సిటీబ్యూరో

అన్ని రకాల సాహిత్య, పాఠ్య పుస్తకాలు లభిస్తాయి

ఈ బజారులో అన్ని రకాల సాహిత్య, పాఠ్య పుస్తకాలు దొరుకుతాయి.  తక్కువ ధరలకే పుస్తకాలు లభిస్తుండటంతో చాలామంది ఇక్కడికి వచ్చి  పుస్తకాలను కొంటున్నారు.  ఇక్కడ పుస్తకాలను అద్దెకు ఇస్తుండటంతో విద్యార్థ్ధులకు ఎంతో మేలు కలుగుతోంది.

పి. చంద్రమోహన్, శంకర్‌మఠ్.

వ్యాపారం బాగా సాగట్లేదు

సండే బజార్‌లో పాత పుస్తకాల వ్యాపారం ఇప్పుడు బాగా నడవడం లేదు. గతంలో ప్రతి ఆదివారం 5 వేల వరకు  సంపాదించే వాళ్లం. కాని ఇప్పడు రెండు వేలు కూడ రావడం గగనమైపోయింది. దీంతో కుటుంబం గడవమే కష్టమయ్యింది. మాకు ప్రభుత్వం శాశ్వతంగా అడ్డాలను చూపి న్యాయం చేయాలి.

పుట్ట అశ్విన్‌కుమార్,
పాతపుస్తకాల వ్యాపారి, కోఠి.