Home నిర్మల్ సివిల్ సప్లయ్ వాహనం మాటున అక్రమ దందా

సివిల్ సప్లయ్ వాహనం మాటున అక్రమ దందా

కిరోసిన్ తరలిస్తుండగా పట్టుకున్న గ్రామస్తులు

డీలర్‌ను సస్పెండ్ చేసి అరెస్టు చెయ్యాలని గ్రామస్థుల రాస్తారోకో

Lorryఖానాపూర్ : ప్రభుత్వం పేద ప్రజలకు రాయితీపై సరఫరా చేస్తున్న నీలి కిరోసిన్‌ను సంబంధిత డీలర్లు పేద ప్రజలకు ఇవ్వకుండా అక్రమ మార్గంలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సివిల్ సప్లయ్ వాహనం మాటుననే అక్రమ దంధా జరుగుతుంది. ఎన్నో రోజులుగా సాగుతున్న ఈ దంధా ప్రజలకు పట్టుకుని సంబంధిత అధికారులకు పిర్యాదు చేస్తే రెవెన్యూ శాఖాధికారులు కేసులు నమోదు చేస్తున్న డీలర్లలో మార్పు రావడంలేదు. తాజాగా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామంలో ఎప్రిల్ నెలలో పంపిణీ చేయడానికి బియ్యం లోడును గురువారం సివిల్ వాహనంలో తరలించారు. బియ్యం లోడును సివిల్ సప్లయ్ వాహనం నుండి దింపి అదే వాహనంలో డీలర్‌కు సరఫరా అయిన 180 లీటర్ల కిరోసిన్‌ను తరలించడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

లారీలో తరలిస్తున్న 3 డబ్బాల్లో ఉన్న కిరోసిన్‌ను చూసిన తర్లపాడ్ గ్రామస్తులు డ్రైవర్‌ను హమాలిలను కిరోసిన్‌ను ఎక్కడికి తరలిస్తున్నారని నిలదీశారు. తర్లపాడ్‌కు వచ్చిన కిరోసిన్‌నే ఇతర గ్రామలకు తరలిస్తున్నామని డ్రైవర్ చెప్పగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్‌ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని గ్రామస్తులు తర్లపాడ్‌లో రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వినయ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణజరిపారు.

పట్టుబడ్డ లారిని, కిరోసిన్‌ను ఖానాపూర్ పోలీస్స్టేషన్‌కు తరలించారు. తర్లపాడ్‌లో జరిగిన సంఘటనపై తహసిల్దార్ నరేందర్ ఆదేశాల మేరకు సివిల్ ఎన్‌ఫోర్సుమెంట్డిటి కవితారెడ్డి గిరిదావర్ పద్మా, విఆర్‌వో శ్రీనివాస్‌లు డీలర్‌కు చెందిన దుకాణంలో రికార్డులను తనిఖీ చేశారు. కిరోసిన్ అక్రమంగా తరలించినట్లు రికార్డుల ద్వారా తేలడంతో డీలర్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్సుమెంట్ డిటి కవితారెడ్డి తెలిపారు. డీలర్‌ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని తర్లపాడ్ గ్రామస్తులు డిమాండ్ చేశారు.