Home ఆఫ్ బీట్ పారిశ్రామిక పరుగులు

పారిశ్రామిక పరుగులు

తెలంగాణ బాట పట్టిన విదేశీ పరిశ్రమలు
విప్లవాత్మక టిఎస్ ఐపాస్

Industrial-Area

తెలంగాణ ఏర్పాటైతే పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపో తాయి, విద్యుత్ సరఫరా ఉండదనే విమర్శలు చేసిన వారి నోటికి ఈ నాలుగేళ్ల పరిపాలన తాళం వేసింది. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ ను అందించడం మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి సైతం పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయి. దేశంలోనే విప్లవాత్మకమైన టిఎస్ ఐపాస్ పారి శ్రామిక పాలసీ ని ఆవిష్కరించి ఈ నాలుగేళ్లలో 6818 పరి శ్రమలకు అనుమతులు మంజూరుకావడంతో రాష్ట్రానికి సుమారు రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న తెలంగాణ సులభ వాణిజ్య విధానంలో వరుసగా దేశంలోనే రెండేళ్లుగా తొలిస్థానంలో నిలుస్తోంది.

ఆరు వేల పరిశ్రమలకు అనుమతులు : దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని తీరులో విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడంతో ఇప్పటివర కు రూ.1,27,050 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఆన్‌లైన్ విధానం (సింగిల్ విండో) ద్వారా 6,818 పరిశ్రమలకు అనుమతులు మంజూరుకాగా 4382 పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ పరిశ్రమల్లో 1,87,978 మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందారు. మరో 684 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ప్రారంభమైతే 5.38 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
సిఎం కార్యాలయంలో స్పెషల్ ఛేజింగ్ సెల్ : సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కేవలం 15 రోజుల్లోనే 57 రకాల అనుమతులు ఇస్తున్నారు. 23 ప్రభుత్వ శాఖ ల పర్యవేక్షణలో అనుమతులు త్వరితగతిన జారీ చేయించేందుకు ముఖ్యమం త్రి కార్యాలయంలో స్పెషల్ ఛేజింగ్ సెల్ ఏర్పాటైంది. పారిశ్రామిక అనుమతుల కోసం ఆయా కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని అనుమతులనూ ఇవ్వ డం ఈ సెల్ ప్రత్యేకత. పారిశ్రామికవేత్తల కోసం పావలా వడ్డీకే రుణాలు, విద్యుత్‌లో రాయితీలు, భారీ పరిశ్రమలకు 50 శాతం, మధ్య తరహా పరిశ్రమలకు 75 శాతం, చిన్న పరిశ్రమలకు 100 శాతం వ్యాట్‌లో రాయితీ ఇస్తోంది. బడ్జెట్‌లోనూ ప్రతీ ఏటా పరిశ్రమల శాఖకు నిధుల కేటాయింపు పెరుగుతోంది. 2016-17 బడ్జెట్‌లో రూ. 973.73 కోట్లు , 2017–18లో రూ.985 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో రూ. 1285.72 కోట్లను కేటాయించారు.
పెట్టుబడుల ఆకర్షణలో టాప్ : తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం గా మారింది. దేశ విదేశాల పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం దరిదాపుల్లో లేవు. గత ఐదేళ్ల కాలంలో పెట్టుబడుల ఆకర్షణలో దేశవ్యాప్త సగటు వృద్ధి రేటు 20.8 శాతంగా ఉంది. తెలంగాణ ఏకంగా 79 శాతంగా వృద్ధిని సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ. 5.9 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో 68.5 శాతం వృద్ధిని గత మూడేండ్లలోనే సాధించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఆకర్షించిన మొత్తం పెట్టుబడుల్లో ఇరిగేషన్, విద్యుత్, సేవా, తయారీ రంగాలదే సింహభాగం. వీటిలో ఇరిగేషన్ రంగం 28 శాతంతో మొదటి స్థానంలో నిలువగా, ఆర్థికేతర సేవల రంగం 25 శాతంతో రెండో స్థానాల్లో ఉన్నాయి. విద్యుత్ రంగం 18.5 శాతం, తయారీ రంగం 11 శాతంతో ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి.

ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఆతిథ్యం : దేశంలోనే ఐటి రంగానికి కీలకంగా ఉన్న హైదరాబాద్ నగరం ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సదస్సు-2017ను నిర్వహణకు వేదికైంది. భారత, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగిన జిఈఎస్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరైనారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 1500 మంది పారిశ్రామిక వేత్తలు, మూడు వేల మంది ప్రతినిధులు హాజరైనారు. టిఈస్ ఐపాస్ పాలసీకి ముగ్ధులైపోయిన పలువురు పారిశ్రామికవేత్తలు తెలంగాణ సృజనాత్మకతను ప్రశంసించడమేకాక ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి హామీ ఇచ్చారు. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రమే అయినప్పటికీ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని కొనియాడారు.

జహీరాబాద్‌లో ‘నిమ్జ్’ : రాష్ట్రానికి మంజూరైన జాతీయ పెట్టుబడులు, ఉత్పాద క మండలి ‘నిమ్జ్’ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. రంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటీ (ఔషధ నగరి)కి కూడా నిమ్జ్ హోదా ఇచ్చేందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. మెదక్ జిల్లాలో 12 వేల ఎకరాల్లో నిర్మించనున్న ‘నిమ్జ్’ కోసం ఇప్పటికే 3,700 ఎకరాల భూమిని సేకరించింది.
అపాచీ యుద్ధ విమానాల ప్రధాన భాగాల తయారీ కేంద్రం : తెలంగాణ రాష్ట్రం రక్షణ రంగ పరిశ్రమలకు కేంద్రంగా ఆవిర్భవించింది. ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్‌లో బోయింగ్ విమాన తయారీ సంస్థ, టాటా అడ్వాన్డ్ సిస్టమ్ లిమిటెడ్‌ల సంయుక్త భాగస్వామ్యంతో (టాటా బోయింగ్ ఏరోస్సేస్ లిమిటెడ్) తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. అపాచీ యుద్ధ విమానాల ప్రధాన భా గాలు ఇక్కడ తయారవుతాయి. కేవలం 18 నెలల కాలంలోనే దీని నిర్మాణం పూర్తి కావడం విశేషం.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీ : రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ త్వరలో సాకారం కానుంది. కేంద్రం ఇటీవలే పర్యావరణ అనుమతులను కూడా మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.15,085 కోట్లుగా అం చనా వేయగా, హడ్కో రూ.740 కోట్ల మేర రుణం రూపంలో అందజేసింది. సుమారు రూ. 64 వేల కోట్ల మేరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ అంచనా. కాలుష్య రహత (జీరో డిశ్చార్జ్) వ్యవస్థతో పని చేయనున్న ఈ ఫార్మాసిటీ అందుబాటులోకి వస్తే సుమారు 58 వేల కోట్ల ఎగుమతులు జరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఇందులో ఏర్పాటవుతున్నాయి. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లతో కూడా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.