Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఎంపి, ఎంఎల్‌ఎల ఎంపిక సమీక్ష కాదు

More Preparance For youth In Panchayath Elections
మనతెలంగాణ/వరంగల్ అర్బన్ ప్రతినిధి : పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం సమీక్షలు నిర్వహించే సమయం ఇప్పుడు కాదని, బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయడానికి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎఐసిసి కార్యదర్శి, వరంగల్ పార్లమెంటు పరిశీలకులు శ్రీనివాస్ కృష్ణన్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని డిసిసి భవన్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యకార్యకర్తలు, నాయకుల సమీక్ష సమావేశాన్ని ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు స్థానికంగా ఉన్న సమస్యలపై అందరిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, ఇక్కడి ప్రజ ల ఆకాంక్షను గుర్తించి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. దీన్ని గత ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సరైన విధంగా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకపోక పోవడం వల్లనే ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయామన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చక వైఫల్యం చెందిందని వీటిని ప్రజల మధ్యలో పార్టీ శ్రేణులు ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి బూత్‌కమిటీల నుంచి గ్రామ, మండల జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు సంబంధాలు మెరుగుపడుతాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో, రాష్ట్రంలో బిజెపి, టిఆర్‌ఎస్ ప్రభుత్వాల పరిపాలన పట్ల ప్రజలు విసిగివేసారి పోయారని అంతిమంగా కాంగ్రెస్ పా లనను ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 2019 ఎన్నికలను లక్షంగా తీసుకొని నాయకులు ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నా రు. శక్తియాప్ ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు మరింత దగ్గరవుతామని ఆ యన పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి, ఎంపి నంది ఎల్లయ్య మాట్లాడుతూ ఉద్యోగ కల్పనలో మోడి ప్రభు త్వం విఫలమైందన్నారు. అన్నివర్గాలకు కాంగ్రెస్ పార్టీలో స్థా నం ఉంటుందని చెప్పారు. పార్టీలో గ్రూపులు, వర్గపోరులు పక్కకుపెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని ఈ పార్టీలో అన్నివర్గాల నాయకత్వం ఉంటుందన్నారు. దానివల్లనే వర్గాలు, గ్రూపులు ఉంటాయని ఇది తీవ్రమైన చర్చకు దారితీసి ప్రజలకు మంచి నిర్ణయాలు అందుతాయన్నా రు. బేధాభిప్రాయాలన్నింటిని తాత్కాలికంగా వ్యక్తుల మధ్య ఉంటాయే తప్ప పార్టీకి వర్తించవని దాన్ని పరిగణనలోకి తీసుకొని నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నర్సంపేట ఎంఎల్‌ఎ దొంతిమాధవరెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంఎల్‌ఎ శ్రీధర్, పిసిసి సభ్యులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– సమీక్ష సమావేశానికి దూరంగా ఉన్న పొన్నాల
వరంగల్ పార్లమెంటు సమీక్ష సమావేశానికి మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దూరంగా ఉన్నారు. ఆయనతోపాటు అనుచరవర్గం కూడా సమావేశానికి ఎక్కువ శాతం హాజరుకాలేకపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షకు హన్మకొండ, వరంగల్ తూర్పు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమీక్ష సమావేశం కొంత వాడివేడిగా జరిగినప్పటికి ఎలాంటి ఘర్షణలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా సమావేశం ముగియడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన నాయకత్వం, గ్రూపులు ఎక్కువగా ఉండడం వల్ల డిసిసి భవన్‌లో జరిగే ప్రతి సమీక్ష సమావేశంలో గొడవలు, ఘర్షణలు జరిగిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. అందులో ఎన్నికల సమయం ఆసన్నం కావడం ఈ సమయంలోనే ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, పరిశీలకుడిగా రావడం ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికి ఎలాంటి గొడవలు లేకుండా ఐకమత్యంతో సమీక్ష ముగియడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

Comments

comments