Home రాష్ట్ర వార్తలు మైనార్టీలకు మరింత అండ

మైనార్టీలకు మరింత అండ

cm-kcrరిజర్వేషన్ల విషయంలో   మా ప్రభుత్వం ముస్లింల పక్షమే: కెసిఆర్

ముస్లిం యువతకు ఉన్నత, వృత్తి విద్యల్లో సమున్నత శిక్షణ, ఉర్దూలో పోటీ పరీక్షలు రాసే
అవకాశం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పని విధానం మెరుగుపర్చాలి, అన్యాక్రాంత వక్ఫ్
భూములు తిరిగి అప్పగింత, జూన్ నుంచి ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ‘ముస్లిం రిజర్వేషన్ల’ విషయంలో ప్రభుత్వం వారి పక్షమే వహిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీనిచ్చారు. మైనార్టీల నిధులను పక్కదారి పట్టించే బ్రోక ర్లపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాత కూడా అమలు తీరులో జాప్యం జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అర్హులైన ముస్లిం పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్ట్టిస్తామన్నారు. ముస్లిం యువతను గొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలన్నదే తన ధ్యేయమన్నారు. పోటీ పరీక్షల్లో ముస్లిం విద్యార్థులు తమ మాతృ భాషలోనే ఉర్దూలో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆయన ఆదేశించారు. బిసి, ఎస్‌సి, మహిళలకు అమలవుతున్న విధంగానే మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాలు అమలు కావాల న్నారు. ముస్లిం యువత అంటే కేవలం ఎలక్ట్రీషియన్, మెకానిక్, ప్లంబర్ పనులు చేసే వాళ్లు కాదని, వారికి టిఎస్‌ఐ పాస్ కింద ఐటి పార్కులను ఏర్పాటు చేసి, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయా లని సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం లో ఎంపి వినోద్‌కుమార్, ఎంఐఎం నేతలు, ఎంపి అసుద్దీన్ ఒవైసీ, శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మైనార్టీ వెల్ఫేర్ శాఖ కార్య దర్శి ఉమర్ జలీల్, ఎసిబి డైరెక్టర్ జనరల్ ఎ.కె.ఖాన్, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించా రు. ముస్లింలకు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాల అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. షాదీ ము బారక్ పథకంతో సహా విద్యార్థుల స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఉపాధి శిక్షణ, ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర పథకాలన్నీ ముస్లిం లబ్ధిదారులకు అందాలని సూచించారు. మార్చి 31లోపు మైనార్టీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆయన మైనార్టీ ఫైనాన్స్ సెక్రటరీని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఇప్పటి వరకు 26,635 మంది షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ధిపొందారిరని తెలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే షాదీ ముబారక్ పథకం అమలులో కొన్ని లోపాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా పేద మస్లిం యువతకు చేరాల్సిన నిధులు పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, అలాంటి బ్రోకర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి కల్పనలో ముస్లిం యువతకు అధికారులు పూర్తి అండగా నిలువాలని, అర్హులైన యువతకు ఆర్థిక సహాయం అందించే దిశగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పని విధానాన్ని మరింత మెరుగుపర్చాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు, స్వయం ఉపాధి పథకాలు, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకు అవసరమైతే ఎస్‌డిఎఫ్ నుంచి కూడా మైనార్టీ సంక్షేమానికి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అవకాశమిస్తే ప్రయోజకులవుతారు..
ముస్లిం యువతకు అవకాశం దొరికితే అద్భుతమైన ప్రయోజకులుగా మారుతారని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఇంజనీరింగ్, ఉన్నత, వృత్తి విద్య తదితర రంగాల్లో వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన శిక్షణను అందిం చాలని సూచించారు. ఏప్రిల్ నెలలో చేపట్టబోయే పోలీసు నియామకాల్లో ముస్లిం యువత భాగస్వామ్యం మరి ంత పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇందుకు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు మంచి సంస్థలను గుర్తించాలని, ఇందుకు ఎంత ఖర్చు అయినా వెనకాడకూడదని అధికారులకు సూచించారు. హైదరాబాద్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న జూనియర్, డిగ్రీ తదితర కళాశాల భవన నిర్మాణలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మైనార్టీ అనగానే నిర్లక్ష దోరణి ఆహ్వానించదగ్గ పరిణామం కాదని, మైనార్టీ సంక్షేమాన్ని గత పాలకులు నిర్లక్షం చేశారని, బడ్జెట్ కేటాయింపుల్లో పక్షపాతం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వక్ఫ్‌బోర్డుకు నష్టపరిహారం చెల్లించండి : జిహెచ్‌ఎంసికి ఆదేశం
జిహెచ్‌ఎంసి పరిధిలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను గుర్తించి వక్ఫ్‌బోర్డుకు అప్పజెప్పాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగంగా వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలాలు కోల్పోతే, వాటికి తగిన నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. హుస్సేని షావలి దర్గా, బియా బాని దర్గా, ఫకీర్ ముల్లా దర్గా తదితర దర్గాలకు చెందిన వందల ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా తక్షణమే సర్వే నిర్వహించి వక్ఫ్‌బోర్డుకు అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మక్కా మసీదు కట్టడానికి సంబంధించిన పునరుద్ధరణ పనులు రంజాన్ పండుగలోపు పూర్తి చేయను న్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మైనార్టీ సంక్షేమానికి సంబంధించి విస్తృత స్థాయి సమీక్షను చేపట్టనున్నట్లు చెప్పారు. దారుల్ ఉల్ మ్‌లో ఆడిటోరియం నిర్మాణానికి రూ.10 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. పాతబస్తీలో పలు చోట్ల నిర్మించ తలపెట్టిన జూనియర్ డిగ్రీ కళాశాలలు భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రతిష్టాత్మక జామై నిజామియా యూనివర్సిటీకి చెందిన కోర్సులకు గుర్తింపును పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రికి కెసిఆర్ ఫోన్‌లో ఆదేశించారు.
ఉద్యోగ నియామకాలను తక్షణమే చేపట్టండి
జూన్ నెల నుంచి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందుకు సంబంధించిన ఉద్యోగ నియామకాలను తక్షణమే చేపట్టాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో అవసరమైతే అర్హులైన ఇతరులను అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని సూచించారు. కాగా రెసిడెన్షియల్ పాఠశాలల కట్టడాలు ఆలస్యం అయ్యే చోట అనువైన భవనాలను ఎంపిక చేసుకుని అద్దెకు తీసుకుంటున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.