Home అంతర్జాతీయ వార్తలు మధ్య ఆఫ్రికా సాయుధ ఘర్షణలో100 మంది మృతి

మధ్య ఆఫ్రికా సాయుధ ఘర్షణలో100 మంది మృతి

africaబాంగుయి(మధ్య ఆఫ్రికా): రోమ్‌లో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసి వారం కూడా గడువక ముందే గణతంత్ర మధ్య ఆఫ్రికా బ్రియా పట్టణంలో  సాయుధ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో 100 మంది మరణించారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు బుధవారం చెప్పారు. భద్రత అంతగా  లేకపోవడం వల్ల రెడ్ క్రాస్ బృందాలు సైతం వీధుల్లో పడి ఉన్న మృత దేహాలను ఖననం చేయడానికి ముందుకు రాలేదు. ‘ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఘర్షణ మొదలవుతుందో అన్న స్థితి ఉండడంతో ఎవరూ బయటికి రాడానికి ధైర్యం చేయడం లేదు’ అని బ్రియాలోని సెయింట్ లూయిస్ క్యాథలిక్ మిషన్‌కు చెందిన రెవరెండ్ గిల్డాస్ గిబేని అన్నారు. ఘర్షణల్లో ప్రాథమికంగా 100 మంది చనిపోయారని, డజన్ల కొద్దీ ఇతరులు గాయపడి ‘డాక్టర్స్ వితవుట్ బార్డర్స్’ నడిపిస్తున్న  స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని  మేయర్ మౌరిస్ మౌరిస్ బెల్‌కోవుజూ తదితరులు తెలిపారు. ఘర్షణ మంగళవారం ఉదయమే మొదలైందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గణతంత్ర మధ్య ఆఫ్రికా దేశంలో 2013 నుంచే మతపరమైన, సామూహికపరమైన దారుణ ఘర్షణలు  జరుగుతున్నాయి.  2015 చివర నుంచి 2016 వరకు కొంత ప్రశాంతత నెలకొన్నా మళ్లీ ఇప్పుడు ఘర్షణలు రాజుకున్నాయి. బ్రియాలో మే నుంచి పదేపదే ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాణ భయంతో దాదాపు 41,000 మంది ఆ ప్రాంతం నుంచి పారిపోయారని సమాచారం.