Home లైఫ్ స్టైల్ అగ్రవర్ణ పరువు హత్యలే

అగ్రవర్ణ పరువు హత్యలే

female-image

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యక్తిగత హత్యలకు గురవుతున్న వారిలో సగానికంటే ఎక్కువ శాతం స్త్రీలే. ఐక్యరాజ్య సమితికి చెందిన పాపులేషన్ ఫండ్ సేకరించిన సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 50 వేల మంది స్త్రీలు హత్యకు గురవుతున్నారు. అందులో సగం కంటే ఎక్కువ మంది భర్తలు, బంధువులు వీరంతా తల్లిదండ్రుల చేతుల్లో హత్య చేయబడ్డవారే. ఇట్లా హత్య చేయబడ్డ స్త్రీలందరూ దాదాపుగా ‘కుటుంబ గౌరవం’ ‘కుటుంబ పరువు’ కు బలైనవారే. అనాదిగా పితృస్వామ్య సమాజాల్లో స్త్రీ నడవడికను, ఆమె సంతానోత్పత్తి ప్రక్రియను బేరీజు వేసి చూడటం ఒక భయంకరమైన సంప్రదాయంగా మారింది. కుటుంబం పరువు, మర్యాదలు ఆ కుటుంబంలోని స్త్రీల నడవడిక పైనే ఆధారపడి ఉంటాయన్న భావన అన్ని మతాల్లోనూ, సమాజాల్లోనూ స్థిరపడింది. నాగరికత అభివృద్ధి చెందిందని చెబుతున్న కాలం నుండి స్త్రీలపై నియంత్రణ కొనసాగడం మొదలైంది. నియంత్రణ అనేది ఒక సంప్రదాయ చట్రంలో ఆమెను బంధించి ఉంచడమే కాకుండా, ఒక నాగరిక లక్షణంగా కూడా రూపు దిద్దుకొంది. ఈ చట్రంలోంచి ఆమె ఏ మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం చేసినా ఆ చర్య కుటుంబ గౌరవానికి పరువుకు భంగకరంగా చూడబడుతుంది. ఈ పరిస్థితి దేశంలోని నగరాల్లో, గ్రామాల్లో, అన్ని కులాలలో, వర్గాలలో నెలకొని ఉంది. రోమన్ సామ్రాజ్యం కాలం నుండే పరువు హత్యలు కనిపిస్తాయి. వివాహితగాని, పెళ్లికాని స్త్రీగాని సమాజ పద్ధతులకు భిన్నంగా లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఆ స్త్రీని చంపే అధికారం రోమన్ సామ్రాజ్య కాలంలో ఉండేది. అలాగే యూరప్ దేశాలలో, మధ్య యుగాలలో ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపే చట్టం యూదుల్లో ఉండేది. కొన్ని దక్షిణ ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాల్లో ఇప్పటికీ ఈ పద్ధతి అమలులో ఉన్నట్లు వార్తల ద్వారా అర్థం అవుతుంది. పరువు హత్యల భావన అరబ్ సంస్కృతిలో, ఆలోచనల్లో దృఢంగా నాటుకొని ఉందని బీరూట్ యూనివర్శిటీ మానవ శాస్త్రం ప్రొఫెసర్ షరీఫ్ ఖన్నా తన పరిశోధన ఆధారంగా చెప్పారు. పరువుకు భంగం వాటిల్లడానికి కారకురాలైన స్త్రీని హత్య చేసిన పురుషుడు శరీరం నిండా ఆమె రక్తాన్ని పులుముకొని, హత్యకు ఉపయోగించిన ఆయుధం ప్రదర్శిస్తూ వీధుల్లో తిరిగే ఆచారం అట్టోమన్ పాలన కాలంలో కొన్ని దేశాలలో ఉండేదట. పురుషుడు గీసిన రేఖను దాటే స్త్రీని చంపడం తప్ప వేరే శిక్షలేవీ ఉండేవికావు.

పాశ్చాత్య దేశాల్లో కూడా కుటుంబ గౌరవాన్ని, ప్రతిభను పరిరక్షించే పద్ధతులు ఎన్నో అమలులో ఉండేవి. పురుషత్వాన్ని ప్రదర్శించేందుకు ముష్టి యుద్ధాలు అమలులో ఉండేవి. కెనడా దేశంలో కూడా 1800 సంవత్సరం వరకు ఇటువంటి ఆచారం అమలులో ఉండేది. బ్రిటిష్ రాజు హెన్రీ తన భార్య శీలం కోల్పోయిందనే అనుమానంతో ఆమె తల నరికేయిస్తాడు. ప్రసిద్ధి గాంచిన షేక్స్‌పియర్ ఒథెల్లో నాటకంలో ముఖ్య మహిళా పాత్ర డెస్డిమోనా కూడా పరువు హత్య గావించబడుతుంది. చాలా అరబ్ దేశాల్లో ఇస్లాం మతం ఆవిర్భావానికి ముందు నుండే పరువు హత్యలు ఉండేవని, అందుకు చారిత్రక ఆధారాలున్నట్లు పరిశోధకులు తెలుపుతున్నారు. అరబ్ దేశస్థులు, అప్పటి సింధు, ఇప్పుడు పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌పై యుద్ధానికి వచ్చినప్పుడు, స్థానికులు పెళ్లికాని ఆడపిల్లల గౌరవం కాపాడటానికి సజీవంగా ఖననం చేసేవారట. షియా, సున్నీ ముస్లిం మత తెగలకు మధ్య వివాహ, ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండవు. అలా తమ తెగ అవతలి వారిని ప్రేమించిన సందర్భాలలో అమ్మాయిని, అబ్బాయిని చంపే ఉదంతాలు ఇప్పటికీ ఉన్నాయి. పరువు హత్యల గురించి ముస్లిం మత గ్రంథాలలోకాని ఆమాట కొస్తే ప్రపంచంలోని ఏ మత గ్రంథాలలో కాని ప్రస్తావన లేదు. ఏ మత సిద్ధాంత కర్తలు మతం చట్రంలో ఇటువంటి హత్యలను సమర్థించలేదు. సామాజిక స్థాయి, హోదా భిన్నంగా ఉన్నప్పుడు, ధనికులైన అమ్మాయి, అబ్బాయిలు బీద వారిని ప్రేమించిన సందర్భాల్లో ఇటువంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాల విషయంలో ఎటువంటి తార్కికత, హేతుబద్ధతకు తావుండదు. సౌదీ అరేబియా రాజవంశంలోని రాకుమారి మిషా అల్ 1977లో చదువు నిమిత్తం లెబనాన్ వెళ్లినప్పుడు ఖాలిద్ అనే అతి మామూలు యువకుడ్ని ప్రేమించి, ఆయనతో సహజీవనం సాగిస్తుంది. ఆమె తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత ఆమె తాత మరణ శిక్ష విధించి, కాల్చి చంపేస్తాడు.

ఆ తర్వాత ఆమె ప్రియుడు ఖలీద్‌ను కూడా ఆధీనంలోకి తీసుకొని అయిదు కత్తి వేట్లతో తల, మొండెం వేరు చేసి శిక్షిస్తారు. ఈ సంఘటనపై “డెత్ ఆఫ్ ఎ ప్రిన్సెస్‌” అనే ఆంగ్ల సినిమా కూడా వచ్చింది. అన్ని మతాల లాగానే ఇస్లాం కూడా చట్ట వ్యతిరేకంగా మనిషి ప్రాణాన్ని తీయడాన్ని ఒప్పుకోదు. అయినా పరువు పేరుతో ఇస్లాం దేశాల్లో ఈ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. జోర్డాన్, సిరియా దేశాలలో పరువు పేరుతో భర్తకు బంధువులు హత్యకు పాల్పడి నట్టయితే వారిపట్ల ఉదారంగా వ్యవహరించమని చట్టాలు చెబుతున్నాయని, 2002లో ఐక్యరాజ్య సమితి సంస్థకు సంబంధించిన మానవ హక్కుల శాఖ నివేదిక తెలిపింది. ఆఫ్రికా ఖండంలోని తెగల్లో, తెగ కట్లుబాట్లు, కుటుంబ ఆచార వ్యవహారాలు చాలా బలంగా ఉంటాయి. ఒక స్త్రీ తమ తెగ ఆవల వ్యక్తిని ప్రేమించినా, వివాహం చేసుకున్నా రకరకాల శిక్షలు అనుభవించడమే కాకుండా హత్యకు గురవుతారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం 1977 వ సంవత్సరంలో పాకిస్థాన్‌లో దాదాపు 1000మంది, యెమెన్‌లో 400 మంది, ఈజిప్టులో 32 మంది, జొర్డాన్‌లో 32 మంది స్త్రీలు పరువు హత్యకు గురయినారు. మన దేశంలో 2014లో 28 మంది పరువు హత్యల పేరుతో ప్రాణాలు కోల్పోగా 2015లో అనూహ్యంగా ఆ సంఖ్య 251 వరకు పెరిగిందని పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకిచ్చిన సమాధానంలో హో మంత్రి చెప్పారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లో 131 మంది ఇట్లా హత్య గావింపబడ్డారు. దేశంలో అనాదిగా అమలులో ఉన్న కుల వ్యవస్థ, వర్ణ ధర్మం, బ్రాహ్మణ సంస్కృతి, ఫ్యూడల్ భావ జాలం ఈనాటికీ బలంగానే కొనసాగుతున్నాయి.

ప్రపంచీకరణతో, ఆధునికత ఏర్పడిందని మార్కెట్, సంస్కృతి పరంగా ప్రపంచం అంతా ఒక కుటుంబంగా మారుతుందని ఎన్ని ఉపన్యాసాలిచ్చినా మనిషి ఆలోచనల్లో పెద్ద మార్పు రాలేదు. సామాజిక జీవితంలో అలవర్చుకున్న కుహనా విలువలు, దానికి సంబంధించిన భావ జాలం, ఆలోచనలు తాత్విక ఆలోచనల్లోనూ, సంస్కృతిలోనూ చాలా ప్రబలంగా ఉంది. కుల వ్యవస్థలో భౌతిక హింసే కాకుండా తాత్విక హింస కూడా నెలకొని ఉంది. హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ‘కాప్’ పంచాయితీలు, తమిళనాడులో కట్ట తతంగం, రాజస్థాన్‌లో గద్దె దగ్గర న్యాయం చెప్పే పద్ధతులన్నీ ప్రధానంగా ప్రేమ సంబంధాల నిరాకరణే. గత మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 19 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది పరువు హత్యలకు గురైనట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ హత్యలన్నీ కుల దురహంకార హత్యలుగానే పరిగణించాలి. 2014లో నల్లగొండ, తుంగతుర్తికి చెందిన ప్రవీణ్ కుమార్ (యాదవ), స్వప్న (మున్నూరు కాపు) ను ప్రేమించాడు. స్వప్న కుటుంబం వారి వివాహానికి అంగీకరించలేదు. ప్రవీణ్‌ను హత్య చేశారు. ఆదిలాబాద్ జిల్లా నారగొండ గ్రామంలో గత సంవత్సరం బి.సి. కులస్తుడిని ప్రేమించిందని ఒక లంబాడా యువతిని ఆమె కుటుంబస్థులంతా కలిసి హత్య చేశారు. వేములవాడలో మౌనిక (యాదవ) అనే యువతిని ప్రేమిస్తున్నాడని అనిల్ ( దళిత) అనే యువకుడిని ఆ అమ్మాయి బంధువులు పెట్రోల్ పోసి తగులపెట్టారు. గత సంవత్సరం బిసి కులస్థుడితో కలిసి తిరుగుతున్నదని ఒక రెడ్డి అమ్మాయిని ఆమె అన్న హత్య చేశాడు. కరీంనగర్‌లో జీవన్ అనే దళిత ఇంజినీర్ మున్నూరు కాపు కులానికి చెందిన తన సహ విద్యార్థిని ప్రేమించడంతో ఆమె బంధువులు అతనిని విపరీతంగా చిత్ర హింసలు పెట్టారు. సమయానికి వైద్య సహాయం అందడంతో బతికాడు. ఈ సంవత్సరం జమ్మికుంటలో ఇనుగాల రమేష్ అనే యువకుడు గ్రామం నుంచి మాయమై, బావిలో శవమై తేలాడు. బంధువులు ఆందోళన చేయగా పోలీసులు మృతుడి కాల్ డేటా ఆధారంగా, అదే గ్రామానికి చెందిన బుక్క కులానికి చెందిన యువతి బంధువులు హత్య చేసినట్లు నిర్ధారించారు.

పెద్దపల్లి దగ్గరి కతలాపూర్‌లో మాదిగ కులానికి చెందిన యువకుడు కూడా ప్రేమ వ్యవహారంలోనే హత్య చేయబడ్డాడు. ఆయన ప్రేమించిన మున్నూరు కాపు యువతి బంధువులే హత్య చేశారని తేలింది. ఈ సంఘటన కొద్ది రోజుల్లోనే భోనగిరి దగ్గర రజక కులానికి చెందిన నరేశ్, రెడ్డి కులానికి చెందిన స్వాతిల ప్రేమ గాథ పెద్ద వివాదంగా మిగిలింది. పోలీస్ స్టేషన్ నుంచి స్వాతి తండ్రి ఆ దంపతులను ఇంటికి తీసుకెళ్లుతున్న క్రమంలో నరేశ్‌ను మార్గ మధ్యంలోవేరు చేసి, ఊరికి దూరంగా తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేసి హత్య చేశాడని తేలింది. దానితో కూతురు స్వాతి ఇంట్లో ఉరి వేసుకుంటుంది. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన శ్రీనివాస్ రెడ్డి తన కూతుర్ని తానే హత్య చేశానని, కులాంతర వివాహాలు చేసుకున్న వారిని ఇలా అంతమొందించడమే న్యాయమని ప్రకటించాడు కూడా. భారత దేశంలో జరిగిన, జరుగుతున్న పరువు హత్యలన్నీ అగ్రకుల అహంకారానికి సంబంధించినవే. అంబేడ్కర్ చెప్పినట్లు కులాంతర వివాహాలు, కుల నిర్మూలనకు దోహద పడుతాయా? ఈ కేసుల్ని సుమోటోగా స్వీకరించాలని లా కమిషన్ 2012లో సూచించింది. రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న సందర్భంలో సమర్పించే ఫారమ్‌లో, తమ రక్షణ గురించి వివరాలు రాయడానికి ఒక కాలమ్ ఉండాలని సూచించింది. ఈ సూచనలు ఏ రాష్ట్ర ప్రభుత్వంగాని, కేంద్ర ప్రభుత్వంగాని పట్టించుకోలేదు. సమగ్ర చట్టం కోసం రాజకీయ పార్టీలు, పౌర, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. సంస్కృతిపరంగా చేయవలసిన కృషి చాలా ఉంది.

                                                                                                                                       ఎస్. జీవన్ కుమార్
                                                                                                                               మానవ హక్కుల వేదిక 9848986286