Home తాజా వార్తలు జల దిగ్భంధనంలో కాలనీలు

జల దిగ్భంధనంలో కాలనీలు

పట్టించుకోని అధికారులు

Rain

మన తెలంగాణ / భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలలోని రోడ్లు కొద్దిపాటి వర్షానికే వాగుల్లా మారుతున్నాయి. గురువారం మధ్యాహ్నం కురిసిన చిన్న వర్షానికి పట్టణంలోని సీతారామనగర్ కాలనీలోని మొదటిలైన్ రోడ్డు వాగును తలపించింది. చాలా కాలంగా పంచాయతీ సిబ్బంది కాలువలు శుభ్రం చేయక పోవడంతో, కొద్దిపాటి వర్షం కురిసినా వరద నీరు ఇళ్లలోకి వచ్చి, కాలనీవాసులు జలదిగ్భంధలో చిక్కుకుని ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వెంటనే కాలువలు శుభ్రం చేయక పోతే వర్షాకాలం మరింత ఇబ్బంది కలుగుతుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించు కోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మెయిన్‌రోడ్ పై కూడా ఇదే తంతు…

భద్రాచలం పట్టణంలోని ప్రధాన జాతీయ రహదారి రోడ్డుపై కూడా ఇదే తంతు కొనసాగుతుంది. మెయిన్‌రోడ్‌కు ఇరుప్రక్కల ఉన్న కాలువలను పంచాయతీ సిబ్బంది ఏళ్ల తరబడి శుభ్రం చేయకపోవడం వల్ల, కాలువలను దాటి ఫుట్ పాత్‌లను కూడా ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు నెలకొల్పుతున్నారు. దీంతో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురౌతున్నాయి. అంబేద్కర్ సెంటర్ నుంచి యుబి రోడ్ వరకు మెయిన్‌రోడ్ పై ..ఇరువైపుల ఉన్న కాలువలను పెద్ద హోటళ్లు, ఆసుపత్రులు ఫుట్‌పాత్ దాటి ముందుకు వచ్చి నిర్మాణాలు చేపట్టారు ఈ విషయం అనేక సార్లు పత్రికల్లో వచ్చినా అధికారులు పట్టించుకోక పోవడంలో అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం 6 నెలలకు ఒకసారి అయినా.. ప్రధాన రహదారి పై కాలువలు శుభ్రం చేస్తే.. ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీల ఆక్రమణలను అరికట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

 

More Water Flowing in Colonies in Khammam Roads