Home లైఫ్ స్టైల్ గుడ్డ సంచులను తీసుకెళ్లడం మరవొద్దు…

గుడ్డ సంచులను తీసుకెళ్లడం మరవొద్దు…

Most of the old days used cloth clogs

పాతరోజుల్లో ఎక్కువగా గుడ్డ సంచీలనే వాడేవారు. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు ఒకటే సంచీ చాలాకాలం పాడవకుండా ఉపయోగించేవారు. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండేది కాదు. మారుతున్న యాంత్రిక జీవన పరిస్థితుల్లో ఇంటి నుండి గుడ్డసంచి తీసుకుని వెళ్లాలంటే సమయం ఉండదు. దీంతో ప్లాస్టిక్ బ్యాగుల వాడకం పెరిగిపోయింది. దీంతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ అలవాటును మార్చటానికి ప్రయత్నిస్తున్నాం అంటున్నాడు శశికాంత్ కాజా.

మన దేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా కొంత భాగాన్ని మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారు. మిగతా మొత్తాన్ని సముద్రాలలో, నదులలో పడేస్తున్నారు. షాపు యజమానుల మీద, వినియోగదారుల మీద జరిమానా వేస్తే కొంత తగ్గుముఖం పడుతుందేమో? అంటే ప్లాస్టిక్ తయా రీ నిపుణులు అంగీకరించటం లేదు. ప్రభుత్వం ప్లాస్టిక్‌ను నిషేధిస్తుందా అంటే అది అమలులో జరగటం లేదు. దీనికి అంతం కనిపించటం లేదు. ఈ సమస్య పరిష్కారానికి నగరంలో రివీల్ ఎకో సొల్యూషన్స్ అనే సంస్థను 27 ఏళ్ళ శశికాంత్ కాజా ‘బ్యాగ్‌మాన్ ’ పేరుతో ఒక సంస్థను నెలకొల్పాడు. తన లక్షాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. ‘ఈ పాలిథీన్ బ్యాగులు ప్రజ లు వాళ్ల సౌలభ్యం, అవసరాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ఒకరికి అని చెప్పం. మేము రిటైల్ షాపులకు వెళ్ళి వాళ్ళకి ‘ద బ్యాగ్‌మాన్’ మీద అవగాహన కలిపిస్తున్నాం. ఇప్పటికే కొన్ని షాపులు మా గుడ్డ సంచీలను వాడుతున్నారని అంటున్నాడు శశికాంత్.
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సుమారుగా 4,500 మెట్రిక్ టన్నుల వేస్టేజి వస్తోంది. దాంట్లో 50శాతం ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్ ఉంటున్నాయి. అందరిలో ఈ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనందరం కృషిచేయాలంటున్నాడు శశికాంత్.మచ్చ బొల్లారంలో ఒక ఫ్యాక్టరీలో ఈ గుడ్డసంచీలను తయారు చేస్తున్నారు. ఆరుగురు మహిళలు రోజంతా పనిచేస్తూ ఈ బ్యాగులను తయారు చేస్తున్నారు. ఒక మనిషి ప్యాక్టరీ పని విధానాన్ని చూసుకుంటాడు. నెలకు 30,000 దాకా బ్యాగులు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగస్తులకు స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, ఇతర సాంకేతిక పరంగా కూడా శిక్షణ ఇస్తున్నట్లు శశికాంత్ చెప్పాడు. కొద్దికొద్దిగా మార్పులు చేస్తూ ప్రజలు క్లాత్ బ్యాగ్‌లను వాడేట్లుగా ప్రయత్నిస్తున్నారు.
తక్కువ ధరకు ఇచ్చే ప్లాస్టిక్ సంచులను ఎక్కువ ధరకు అమ్మాలని దుస్తుల దుకాణాలు, సూపర్ మార్కెట్ యజమానులకు సూచనలిస్తున్నాడు. కర్రీ పాయింట్స్, కిరాణాషాపులలో మన్నికగా ఉండే గుడ్డసంచీలను వినియోగించాలని వర్తకులకు సలహాలు చెప్తున్నాడు. దానికనుగుణంగా డబ్బులు వసూలు చేసి వాటిని తిరిగి ఇస్తే ఆ బ్యాగు డబ్బును మళ్లీ వినియోగదారునికి చెల్లించే ఏర్పాటు చేయాలంటున్నాడు. బయటికి వెళ్లేటప్పుడు మర్చిపోకుండా క్లాత్ బ్యాగులను తీసుకుని వెళ్లాలని, లేకపోతే షాపులలో ప్లాస్టిక్ బ్యాగులు ఇస్తే యజమానిని రీసైక్లింగ్ పద్ధతి ఉందా అని అడగాలని వినియోగదారులకు సూచనలిస్తున్నాడు శశికాంత్. గుడ్డ సంచీలు కావాల్సిన వారు వీరి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు… డబ్లుడబ్లుడబ్లు.ది బ్యాగ్‌మాన్.ఇన్