Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

తల్లి,కొడుకుల చోరాయణం

Robbery

హైదరాబాద్‌సిటీబ్యూరో: పాత నగరానికి చెందిన తన కుమారులిద్దరిని దొంగలుగా తయారుచేసింది. వారు చోరీచేసేందుకు సహకారాన్ని అందించడంతో పాటు చోరీ సొత్తును విక్రయించేది. వచ్చిన నగదుతో తాను, తన  కుమారులు జల్సాగా గడపడం మొదలుపెట్టారు. ఈ ముగ్గు రు చివరకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. ఈ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి చోరీలనే వృత్తిగా చేసుకున్న తల్లి, ఇద్దరు కుమారులను నగర వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 1.65 కిలోల బంగారు నగలు, 80 తులాల వెండి, ఒక కారు, ఒక మోటార్‌సైకిల్, ఎల్‌ఇడి టివిలను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ముగ్గురు నిందితుల వివరాలను వెల్లడించారు. చాంద్రాయణగుట్ట శాహీన్‌నగర్‌కు చెందిన సనాబేగం అలియాస్ నిజామున్నీసా బేగంకు ముగ్గురు కుమారులు సయ్యద్ మహమ్మద్, సయ్యద్ సోహైల్, సయ్యద్ సాహిల్‌లు. వీరిలో మహ్మద్, సాహిల్‌లు ఏ విధమైన పని చేసేందుకు ఆసక్తి చూపకుండా చోరీలు చేయాలని ప్రణాళికలను సిద్దంచేసుకున్నారు. వీరి ఆలోచనలకు వారి తల్లి సనాబేగం కూడా ప్రోత్సహించడంతో పాటు ఇద్దరు కొడుకులు చోరీచేసి తెచ్చిన నగలను నూర్ జ్యువెల్లరీ దుకాణం యజమాని మహ్మద్ నూరుద్దీన్‌కు విక్రయిస్తున్నది. తద్వారా వస్తున్న నగదుతో విలాసంగా జీవితాన్ని గడుపుతున్నది. వీరు ముగ్గురు కలిసి 2015 నుండి పగటి, రాత్రిపూట సంపన్న వర్గాలు ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ, తాళం వేసి ఉన్న ఇళ్ళను లక్షంగా చేసుకుని వంటగది కిటికీలు, తలుపులను స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, వైర్ల కట్టర్‌లతో తొలగించేవారు. ఈ నేపథ్యంలోనే వీరు అధికంగా గోల్కొండ(14 కేసులు), బంజారాహిల్స్(6), లంగర్‌హౌస్(04), ఆసిఫ్‌నగర్(04), హుమాయూన్ నగర్(03), నార్సింగి(02కేసులు) పోలీసు స్టేషన్‌లలో మొత్తం 33 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరు బంధువులు, స్నేహితుల శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అధికంగా బంగారు నగలను ధరించడం చూసిన స్థానికులు ఆశ్చర్యపోతూ ఆసక్తికరంగా చర్చించుకునేవారు. ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. దీంతో వారు చోరీలుచేస్తున్నట్టు గ్రహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో వారి తదుపరి విచారణ నిమిత్తం గోల్కొండ పోలీసులకు టాస్క్‌ఫోర్స్ వారు అప్పగించారు. వీరిని అరెస్టు చేసిన వారిలో డిసిపి రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు తదితరులున్నారు. వారిని నగర సిపి అంజనీకుమార్ అభినందించారు.

Comments

comments