Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కనెక్టికట్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న సానియా-మోనికా జోడీ

saniaన్యూ హేవన్: భారత్ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు నూతన ఉత్తేజం కలిగించే విజయం దక్కింది. మొదలు కానున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు ముందు ఆమె రోమానియా క్రీడాకారిణి మోనికా నికులెస్కుతో కలసి కనెక్టికట్ ఓపెన్ గెలుచుకుంది. సానియా-మోనికా జోడీ తమ తొలి డబుల్స్ టైటిల్ ఖాతాను మొదటిసారి తెరచింది. వీరి జోడీ కటెరినా బోండరెంకో(ఉక్రెయిన్)-చువాంగ్ చియా-జుంగ్(తైవాన్)లపై స్ట్రెయిట్ సెట్లతో విజయాన్ని కైవసం చేసుకుంది. గంటన్నర మ్యాచ్‌లో సానియా-మోనికా జోడీ 7-5, 6-4తో గెలుపొందింది. సానియా-మోనికా జోడీ గతంలో 2010లో కలసి ఆడారు. అప్పట్లో వారు వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరారు కూడా. కానీ ఆ తర్వాత వీరిద్దరూ తమ జోడీని వదులుకున్నారు. ఇటీవలి కాలం వరకు సానియా స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జోడీ కలిపి ఆడింది. సానియా-హింగిస్ జోడీ చాలా వరకు సఫలం అయింది కూడా. వీరి జోడీ ఇటీవల కాలంలో అనేక విజయాలు కూడా నమోదు చేసింది. సానియా గత వారం చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోర స్ట్రైకోవాతో కలసి సిన్సిన్నాటీ మాస్టర్స్‌లో తొలి టోర్నమెంట్ ఆడింది. అందులో హింగిస్(స్విస్)- కోకో వాండెవెఘే(అమెరికా) జోడీపై విజయం సాధించింది.
సానియా-మోనికా తమ తొలి టోర్నమెంట్ టైటిల్‌ను కలసి గెలుచుకున్నప్పటికీ వారిద్దరూ తాము మళ్లీ తమ పాత రెగ్యులర్ జోడీలతోనే కలసి యుఎస్ ఓపెన్‌కు తలపడబోతున్నామని వెల్లడించారు.
కనెక్టికట్ ఓపెన్ మ్యాచ్ ముగిశాక విలేకరులతో సానియా మీర్జా మాట్లాడుతూ తాను బార్బోర స్ట్రైకోవాతో కలసి ఆడనున్నానని తెలిపింది. ఇక నికులెస్కు ఏమో తాను వనియా కింగ్‌తో కలసి ఆడనున్నట్లు తెలిపింది. సానియాతో జోడీ కట్టడం గురించి అడిగినప్పుడు నికులెస్కు తాను సానియాను సిన్సిన్నాటీలో కలసి ఆడదామా అని అడిగానని, దానికి సానియా సరేనందని తెలిపింది. తామిద్దరూ కనెక్టికట్ ఓపెన్ గెలుచుకోవడం ఆనందంగా ఉందని కూడా తెలిపింది. సానియా మాట్లాడుతూ తామకు పాత పరిచయం ఉందని, ఒకరి ఆట మరొకరికి బాగా తెలుసునని, అందుకనే మొదటి మాచ్‌లు సునాయాసంగా గెలిచామని తెలిపింది. గ్రాండ్ స్లామ్‌కు వారం ముందు గెలుపొందడం ఆనందంగా ఉందని, తామిక న్యూయార్క్‌కు వెళ్ళి ఆడబోతున్నామని, తనకసలు ఈ వారం ఆడాలనిపించలేదని, కానీ మోనికా తనని కలసి అడిగేసరికి కలసి ఆడాలని నిర్ణయించుకున్నానని సానియా వివరించింది.

Comments

comments