Search
Friday 16 November 2018
  • :
  • :

బస్టేషన్లలో బొమ్మ

రాష్ట్రంలోని 23 బస్‌స్టేషన్లలో సినిమా థియేటర్లు 

ఏటా రూ. 500 కోట్ల ఆదాయం లక్ష్యం, ఆర్‌టిసి నష్టాలను పూడ్చుకునేందుకు నిర్ణయం

Bus-stations

హైదరాబాద్ : ఆర్‌టిసికి ఆదా యం పెంచడం ద్వారా ఆ సంస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించిన రవాణాశాఖ 23 ప్రధాన బస్‌స్టేషన్లలో సినిమా థియేటర్లను నిర్మించాలని నిర్ణయించింది. సంస్థకు ప్రస్తుతం ఉన్న ఆస్తులను పరిరక్షించుకుంటూనే మరింతగా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించడంలో భాగంగా ఆర్‌టిసికి ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించింది. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్‌టిసి ఎం డి, ఇతర ఉన్నతాధికారుల బృందం కొద్ది రోజులు గా సమావేశాల్లో చర్చించడంతో పాటు నిపుణుల సలహాలను పరిశీలించింది. బస్టాండ్ స్థలాల్లోనే సినీ మల్ట్లిప్లెక్స్ థియేటర్ల ఏర్పాటు కోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన ఉన్నతాధికారుల బృం దం రాష్ట్రంలో 23 బస్‌స్టేషన్లు అనువైనవిగా గుర్తించింది. రోడ్ మ్యాప్‌నూ తయారు చేసింది. హైదరాబాద్ జోన్ పరిధిలో 9 బస్‌స్టేషన్లు, కరీంనగర్ జోన్ పరిధిలో 14 బస్‌స్టేషన్‌లలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్  ఏర్పాటుకానున్నాయి. ఒక్క కరీంనగర్ బస్టాండ్ మాత్రం మొదటి అంతస్తులో థియేటర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా 22 చోట్ల క్రింది అంతస్తుల్లోనే నిర్మాణాలకు అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు.
సినిమా థియేటర్లు రానున్న బస్టాండ్లు ఇవే: మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల (800 చ.అడుగులు), రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ (800 చ.అ), మెదక్ జిల్లా నర్సాపూర్ (800 చ.అ), సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగారెడ్డి ( 800 చ.అ), నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (1,110 చ.అ), వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ (800 చ.అ), తాండూరు (1324 చ.అ), ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ (1667 చ.అ), ఆసిఫాబాద్ (750 చ.అ), నిర్మల్ (1667 చ.అ), ఖమ్మం జిల్లాలోని సత్తుపలి (1,111 చ. అ), కల్లూరు (556 చ.అ), కొత్తగూడెం ( 800 చ.అ), కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి (1,111 చ.అ), హుజూరాబాద్ ( 500 చ.అ), సిరిసిల్ల ( 1667 చ.అ), పెద్దపల్లి ( 1361 చ.అ), వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ (1,111 చ.అ), నిజామాబాద్ జిల్లా ఆర్మూరు (1667 చ.అ), బోధన్ (1,111 చ.అ) గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్ ప్లాట్లలోనే సినిమా థియేటర్లను నిర్మించనున్నారు. ఇక పోతే హైదరాబాద్, సూర్యాపేట తర్వాత విస్తీర్ణంలో అతి పెద్దదైన కరీంనగర్ బస్టాండ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో థియేటర్‌ను నిర్మించనున్నారు.

ఏటా రూ. 500 కోట్ల ఆదాయమే లక్షం ః సునీల్ శర్మ
ఈ 23 బస్టాండ్లలో సినిమా థియేటర్లతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఫుడ్ కోర్టులు, హోటళ్లు, రెస్టారెంట్లు, అలాగే పార్కింగ్ స్థలాలల్లో యూజర్ ఛార్జీలు, బస్టాండ్లు, థియేటర్ కాంప్లెక్స్‌లలో వివిధ రకాల డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటుచేయించి వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పిస్తామని, తద్వారా ఏటా రూ. 500 కోట్ల ఆదాయం ఆర్‌టిసికి వచ్చేలా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ‘మన తెలంగాణ’ కు తెలిపారు. ఆర్‌టిసి నష్టాలను పూడ్చేందుకు సినిమా థియేటర్ల ప్రతిపాదన సఫలమవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. మొత్తం 23 చోట్ల థియేటర్ల నిర్మాణం ఎలా చేయాలన్నదానిపై త్వరలోనే మరిన్ని అంశాలను ప్రభుత్వం వెల్లడిస్తుందన్నారు. కాగా ఈ థియేటర్ల నిర్మాణాలు ప్రభుత్వపరంగానేనా? లేదా పిపిపి విధానంలోనా? అనే విషయంపై కూడా ఇంకా తుది నిర్ణయానికి రాలేదని మరో ఉన్నతాధికారి వెల్లడించారు.

Comments

comments