Search
Wednesday 26 September 2018
  • :
  • :

రాహుల్ గొప్పేంది.. గాంధీ ట్యాగ్‌లైన్ తప్ప

అమేథిలో మున్సిపల్ వార్డులను గెలిపించుకోలేని దుస్థితి
అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
అభివృద్ధికి చిరునామా టిఆర్‌ఎస్ పాలన
కెసిఆర్ గురించి మాట్లాడే హక్కు వారికి ఎక్కడిది
ధ్వజమెత్తిన చీఫ్ విప్ కొప్పుల, ఎంపి బాల్కసుమన్

Balkasuman

మన తెలంగాణ/ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌కు గాంధీ అనే టాగ్ లైన్ తప్ప, ఆయనకు గొప్పదనం ఏముందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నియోజకవర్గంలో మున్సిపల్ వార్డులకు కూడా గెలుపించుకోలేని రాహుల్ ఒక నేతనా అని ప్రశ్నించారు. దేశంలో ఆ పార్టీకి అడ్రస్సే లేదని విమర్శించారు. టిఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి వారు మాట్లాడుతూ, స్థానిక కాంగ్రెస్ నేతలు రాసిఇచ్చిన స్క్రిప్టునే రాహుల్ చదివారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయించారని కొప్పుల, బాల్కసుమన్‌లు మండిపడ్డారు.

రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు స్పందిస్తే… కాంగ్రెస్ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తారు. రాహుల్‌పై మంత్రులు చాలా తక్కువగా మాట్లాడన్నారు. నాలుగున్నర సంవత్సరాలల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని రాహుల్ వ్యాఖ్యానించడం పచ్చి అబద్దమన్నారు. ఒక్క సింగరేణీలోనే తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంచన రూ. 80 వేల 190 కోట్లు అయితే లక్ష కోట్లు అని రాహుల్‌తో అబద్ధాన్ని మాట్లాడించారన్నారు. ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెడితే, దానిని తీశారని రాహుల్ వ్యాఖ్యానించడం శోచనీయమని కొప్పుల, బాల్కసుమన్‌లు మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆయకట్టు పెంచకుండానే ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానిదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా పంచభూతాలను కూడా ఆ పార్టీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ప్రాణహిత వ్యయాన్ని రూ. 17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.

మంత్రి కెటిఆర్‌ను పట్టించుకోనని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు ఎవరిని పట్టించుకోరో రానున్న ఎన్నికల్లో తేలుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓట్లు ఎలాగూ రావని తెలిసే ఏపీలో రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్‌గాంధీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకిగా మారారని కొప్పుల, బాల్కసుమన్‌లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు ఉండదన్న భయంతోనే కాంగ్రెస్ నేతలు విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. అధికారమే కాంగ్రెస్ నేతలకు పరమావధి అని ఆరోపించారు. అభివృద్ధి కోసం ఆరాటం టిఆర్‌ఎస్ పార్టీదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు బుద్ది తెచ్చుకుని వ్యవహరించాలని సూచించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ చిరునామా అనేది రాష్ట్రంలో భూతద్దం పట్టుకుని వెతికినా కనిపించదని వారు హెచ్చరించారు.

Comments

comments