Home తాజా వార్తలు కాంగ్రెస్ కనుమరుగవ్వడం ఖాయం: కవిత

కాంగ్రెస్ కనుమరుగవ్వడం ఖాయం: కవిత

MP Kavitha Images, TDP and Congress

హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఫ్యామిలీ పార్టీ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యకు ఎలా టికెట్ తెచ్చుకున్నారని ఎంపి కవిత ప్రశ్నించారు. శుక్రవారం కవిత మీడియాతో మాట్లాడారు. టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ తన భార్య టికెట్ ఉపసంహరించుకుంటే గౌరవంగా ఉంటుందని సూచించారు. కోదాడలో టిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమావ్యక్తం చేశారు. సెటిలర్లపై కాంగ్రెస్‌కు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చిందని, అందుకే కుసుమకుమార్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టిడిపిని తిరస్కరించారని, జగిత్యాల సీటు గెలిచి సిఎం కెసిఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పారు. గ్రామాలు, పట్టణం అనే తేడా లేకుండా అంతటా టిఆర్‌ఎస్ హవానే నడుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు బిసిలకు టికెట్టు ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నేతలే విమర్శలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. కూకట్‌పల్లిలో హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తే ప్రభావం ఉండదని, తెలంగాణలో టిడిపినే తిరస్కరిస్తుంటే ఆమెకు ఎలా ఆదరణ ఉంటుందని అడిగారు. తాము చేసిన అభివృద్ధి ముందు సామాజిక వర్గాల సెంటిమెంట్ పని చేయదని కవిత స్పష్టం చేశారు.

సెటిలర్లు టిఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామంటున్నారని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకే వేదిక మీద నుంచి ప్రచారం చేస్తే చూడాలని ఉందని చురకలంటించారు. బాబు ఎప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునుడే సరిపోతుందని, తెలంగాణలో టిడిపి తుడిచిపెట్టుకుపోయినట్టే కాంగ్రెస్ కనుమరుగవుతుందన్నారు. టిఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పేరు కూడా పలకడం లేదని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో తాము బలంగా ఉన్నామని, ప్రచారంలో దూసుకుపోతున్నామని, ఎన్‌ఆర్‌ఐ శాఖ బాగా పని చేస్తోందని ప్రశంసించారు. గల్ఫ్ కార్మికులను టిఆర్‌ఎస్ ప్రభుత్వమే ఆదుకుందని కవిత కొనియాడారు. కాంగ్రెస్ నేతలు గల్ఫ్ పేరుతో ఏం సెటిల్ చేసుకోవడానికి వెళ్లారో అందరికి తెలుసని, చంద్రబాబు మనిషి సిఎం రమేష్ వ్యాపారాలు గల్ఫ్‌లోనే ఉన్నాయన్నారు. ఈ సారి టిఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు మైనార్టీల నుంచి మంచి మద్దతు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

MP Kavitha Comments on TDP, Congress

Telangana news