Home తాజా వార్తలు జగిత్యాలలో టిఆర్‌ఎస్ జైత్ర యాత్ర సాగాలి

జగిత్యాలలో టిఆర్‌ఎస్ జైత్ర యాత్ర సాగాలి

MP Kavitha Speech At Jagathala TRS Meeting

పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్, టిడిపిలు ఒక్కటా ?
తెలంగాణ ఉద్యమం పుట్టిందే వాటిని ఖతం చేసేందుకు
తోడేళ్ళు ముసుగు వేసుకుని వస్తే జనం గుర్తించరనుకుంటున్నారా ?
నిన్నటి దాకా విమర్శలు… నేడేమో అన్నదమ్ములమంటూ పొగడ్తలా ?
మీడియాతో ఎంపి కవిత

మన తెలంగాణ/జగిత్యాల : నాడు ప్రజలంతా ఏకమై జగిత్యాల నుంచి జైత్రయాత్ర కొనసాగించినట్లుగానే నేడు అదే ప్రజలు కాంగ్రెస్, టిడిపిలను తరిమికొట్టి టిఆర్‌ఎస్ జైత్రయాత్ర కొనసాగించనున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నాడు పదవుల కోసం పెదవులు మూసుకుని, ఆంధ్రా పాలకులు తెలంగాణకు తీరని అన్యాయం చేసినా తమకేమి పట్టనట్లు వ్యవహరించిన టిడిపి, కాంగ్రెస్ నేతలు ఎల్.రమణ, జీవన్‌రెడ్డిలు ఒక్కటై ఐక్యతా రాగం వినిపించడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్, టిడిపిలను ఖతం చేసేందుకే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని, తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ముసుగులు వేసుకుని వచ్చినంత మాత్రానా మేము తోడేళ్లమని జనం గుర్తుపట్టరని అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. నిన్నటి వరకు జగిత్యాల నుంచి రమణ తప్పితే జీవన్, జీవన్ తప్పితే రమణ అన్నట్లుగా అధికారం కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని, నేడేమో వారు కవల పిల్లలైనట్లు, అన్నదమ్ములకంటే ఎక్కువగా పొగడ్తలు విసురుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతి పార్టీ అడ్డు తగిలిందని, కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి పదవుల కోసం తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుని కెసిఆర్‌పై పోటీకి నిలబడ్డాడని, కెసిఆర్‌పై పోటీలో దిగినందుకు అతడికి మంత్రి పదవి దక్కిందని ఆరోపించారు. 2009లో కెసిఆర్ దీక్షా ఫలితంగానే అన్ని పార్టీలు తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కేంద్రానికి లేఖలు ఇవ్వక తప్పలేదన్నారు. జీవన్‌రెడ్డి వచ్చినప్పుడే కెసిఆర్ రాజకీయాల్లోకి వచ్చినా ఇప్పటికీ కెసిఆర్ ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారని, జీవన్‌రెడ్డి మాత్రం ఎన్నో సార్లు ఓటమి పాలయ్యారన్నారు.  జీవన్‌రెడ్డి తమ్ముడు నిర్మించిన  ధరూర్ వంతెన నిర్మాణంలో నాణ్యత లేదని, అది ఊదుబత్తీల వంతెన అంటూ వంతెన వద్ద ధర్నా చేసిన రమణ ఇప్పుడు ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. జీవన్‌రెడ్డిపై ఆనాడు అవినీతి ఆరోపణలు చేసిన రమణ ఈ రోజు ఎందుకు మాట మార్చావంటూ నిలదీశారు. కెసిఆర్‌ది కుటుంబ పాలన అంటున్న జీవన్‌రెడ్డి తనది కుటుంబ పాలన అనే విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. తన తమ్ముడు ఎంపిపి, మరదలు జెడ్పీటీసీ, మరో తమ్ముడు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు, ఇంకో మరదలు మున్సిపల్ చైర్‌పర్సన్ కాదా… మీది కుటుంబ పాలనా కాదా.. అంటూ కవిత జీవన్‌రెడ్డిని ప్రశ్నించారు.

నూకపెల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ కోసం తన తమ్ముడి చేత భూమిని కొనుగోలు చేయించి ఆ భూమిని ప్రభుత్వం ద్వారా ఎక్కువ ధరకు జీవన్‌రెడ్డి కొనుగోలు చేయించారన్నారు. రూ.16 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మించిన జీవన్‌రెడ్డి అక్కడ రోడ్డు వేసేందుకు రైల్వే అనుమతి తీసుకోవాలని కనీస ఆలోచన చేయకపోవడం వల్ల కోట్లాది రూపాయలు వృధా అయ్యాయన్నారు. ఆ ప్రాంతంలో తన తమ్ముళ్ళ భూములు ఉన్నందు వల్లే అటు వైపున రోడ్డు వేశారన్నారు. జగిత్యాల మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి బాగోతం ఎక్కడా లేదన్నారు. వేసిన రోడ్ల మీదే రోడ్లు వేయడం, పనులు చేయకున్నా చేసినట్లు చూపించడం పాలకవర్గానికే చెల్లించాదన్నారు. విజయలక్ష్మీ పేరుకే చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారే తప్పా పెత్తనమంతా ఆమె భర్త దేవేందర్‌రెడ్డిదేనన్నారు. మున్సిపల్ సమావేశాల సందర్భంగా వేదిక మీద వైస్ చైర్‌పర్సన్ సీటు ఏర్పాటు చేయాల్సి ఉండగా అతడిని వేదిక కింద కూర్చొబెడుతున్నారని, దీనిబట్టి చూస్తే కుటుంబ పాలన, నిరంకుశ, ఆరాచక పాలన ఎవరిదో తెలుస్తోందన్నారు. 2009, 2014 ఎన్నికల అఫిడెవిట్‌లలో తప్పులు చూపించారని, ఈ విషయాన్ని ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎల్.రమణ, జీవన్‌రెడ్డిలు జగిత్యాల ప్రాంత బిడ్డలే అయితే తాను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్, ముప్పాల రాంచందర్‌రావు, బోగ వెంకటేశ్వర్లు, జి.ఆర్. దేశాయి, సుదర్శన్ తదితరులున్నారు.

MP Kavitha Speech At Jagathala TRS Meeting