Home తాజా వార్తలు అన్నీ తానైన కవిత…

అన్నీ తానైన కవిత…

MP Kavitha Imagesజగిత్యాలలో కారు జోరును ఆపలేపి మహాకూటమి
నాలుగున్నర ఏళ్లుగా జగిత్యాలపైనే కవిత దృష్టి
జీవన్‌రెడ్డి గెలుపునకు ఎంపి చెక్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోరుకు వేదికైన జగిత్యాల నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఘోర పరాజయం పొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచిన జీవన్‌రెడ్డికి ఈసారి తెరాస అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. హోరాహోరీ పోరులో జీవన్‌రెడ్డిపై సంజయ్ విజయం సాధించారు. ఈ విషయంలో నిజామాబాద్ ఎంపీ, కల్వకుంట్ల కవిత తన పంతాన్ని నెగ్గించుకున్నట్టయ్యింది. జగిత్యాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్‌ను గెలిపించి కవిత కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. జీవన్ రెడ్డికి మద్దతుగా తన స్థానాన్ని ఎల్.రమణ త్యాగం చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఇక్కడ కారు జోరును మహాకూటమి ఆపలేకపోయింది. దీంతో ఇప్పటి వరకు జగిత్యాలలో ఏకచ్ఛత్రాధిపత్యంగా రాజకీయాలను శాసిస్తున్న జీవన్‌రెడ్డి, ఎల్.రమణలకు టీఆర్‌ఎస్ చెక్ పెట్టినట్లయింది. ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి పోటీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్. సంజయ్ కుమార్, బీజేపీ నుంచి ముదుగంటి రవీందర్‌రెడ్డి, బీఎల్‌ఎఫ్ నుంచి కాయితీ శంకర్ పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2014ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగలిగింది. దీంతో ఈ నియోజకవర్గాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహారించి చివరకు గెలుపు సాధించింది.

అన్నీ తానైన కవిత..
జగిత్యాలలో తెరాస అభ్యర్థి విజయం కోసం ఎంపీ కవిత అంతా తానై వ్యవహరించారు. నియోజకవర్గంలో పలువురు తెరాస నాయకులు అసంతృప్తితో ఉండగా వారితో మాట్లాడి పార్టీలోనే కొనసాగేలా చూశారు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ తానున్నానంటూ భరోసా కల్పించారు. జగిత్యాల పట్టణం, మండలాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

కవిత వర్సెస్ జీవన్ రెడ్డిగా ఎన్నికలు
2014 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభంజనానికి ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత టి.జీవన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థైన సంజయ్ కుమార్ పై 7,828 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఎల్.రమణ 22,385 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. జిల్లాలో అత్యధిక సార్లు గెలిచిన నేతగా జీవన్ రెడ్డికి రికార్డు ఉంది. 2014లో కరీంనగర్‌లో జగిత్యాల మినహా మిగిలిన స్థానాలన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. దీంతో జగిత్యాల స్థానాన్ని టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఎంపీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. 2014లో టీఆర్‌ఎస్ గెలిచిన నాటి నుంచే జిగిత్యాలపైనే ఆమె ఎక్కువగా ప్రత్యేక దృష్టిసారించారు. పలుమార్లు నియోజకవర్గ పర్యటన చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె జగిత్యాలలో విస్తృతంగా పర్యటించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. మొత్తానికి ఇక్కడ కవిత వర్సెస్ జీవన్ రెడ్డిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సంజయ్‌ను గెలిపించడంలో కవితదే అసలు సిసలు విజయం అని జగిత్యాల నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. మొత్తంమీద ఉన్న కాంగ్రెస్ సీటును కూడా గెలుచుకోవడంలో కవిత వ్యూహాలు ఫలించాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఏడోసారి కలిసిరాలేదు…
1983లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 1989, 1996 (ఉపఎన్నిక), 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిల మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేతగా పలు రాష్ట్రస్థాయి అంశాలను లేవనెత్తిన జీవన్‌రెడ్డి, పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలోనూ కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 స్థానాలను తెరాస గెలుచుకున్నప్పటికీ జగిత్యాలలో మాత్రం జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచి ఏడోసారి ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేయాలనుకున్న జీవన్‌రెడ్డి ఆశలపై సంజయ్ నీళ్లుచల్లారు.