Home తాజా వార్తలు టిఆర్ఎస్‌కు కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా

టిఆర్ఎస్‌కు కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా

trs
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందే టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి టిఆర్ఎస్‌ పార్టీకి మంగళవారం రాజీనామా చేస్తున్నట్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మూడు పేజీల రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. ఈ సందర్భంగా రాజీనామాకు గల కారణాలను లేఖలో వివరించారు. ప్రధానంగా ఐదు కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నకార్యకర్తలకు సరైన గౌరవం లేదని, తెరాసలో సంప్రదాయ రాజకీయాలు లేవని తెలిపారు. ఎంపిగా తన నియోజకవర్గ ప్రజలకు ఆశించిన స్థాయిలో పనిచేశానన్నారు. పార్టీ గత రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందని.. అనేక సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అగాథం పెరిగిపోయిందన్నారు.
తన రాజీనామాకు దారితీసిన కారణాలను ఆయన రేపు మీడియా సమావేశంలో సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడంలేదు. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెరాస నుంచి ఇద్దరు ఎంపిలు కాంగ్రెస్‌లో చేరతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.