Home Elections 2018 హరీశ్‌రావుకు మద్ధతుగా ముదిరాజ్‌ల ఆశీర్వాద సభ

హరీశ్‌రావుకు మద్ధతుగా ముదిరాజ్‌ల ఆశీర్వాద సభ

Mudiraj Blessing Ceremony for Harish Rao

సిద్ధిపేట : సిద్ధిపేట టిఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు మద్ధతుగా శుక్రవారం సిద్ధిపేటలో ముదిరాజ్‌ల ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు హరీశ్‌రావుతో పాటు మంత్రి ఈటల రాజేందర్, ఎంపి బండ ప్రకాష్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో తాను విజయం సాధిస్తూ వచ్చానని తెలిపారు. ముదిరాజ్‌లు పంచిన ప్రేమకు తన జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కాళేశ్వరం పనులు 90 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపుతామని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని ఆయన పేర్కొన్నారు. మహాకూటమి నేతలు ఢిల్లీలో రాహుల్ వద్ద, అమరావతిలో చంద్రబాబు వద్ద సీట్లు అడుక్కుంటున్నారని దుయ్యబట్టారు. మహాకూటమికి ఓట్లేస్తే తెలంగాణ ప్రజలకు కూడా అదే దుస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఏర్పడకుండా అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం, బిజెపి చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు అవకాశవాద పార్టీలని ఆయన దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా సీట్లు సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Mudiraj Blessing Ceremony for Harish Rao