Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రిక్వార్టర్స్‌లో ముగురుజా, జొకోవిచ్

నాదల్, మ్లాడెనొవిక్ ముందంజ, ఫ్రెంచ్ ఓపెన్

Players

పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముగురుజా, నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మరోవైపు మాజీ ఛాంపియన్ రఫెల్ నాదల్ కూడా ముందంజ వేశాడు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో నాలుగో సీడ్ ముగురుజా(స్పెయిన్) 7-5, 6-2 తేడాతో కజాకిస్థాన్ క్రీడాకారిణి పాటిన్‌సేవాను ఓడించింది. తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా ముగురుజా తమ మార్క్ షాట్లతో చెలరేగింది. టైబ్రేకర్ వరకు సాగిన సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో పోటీలో 13వ సీడ్ మ్లాడెనొవిక్ (ఫ్రాన్స్) విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో మ్లాడెనొవిక్ 7-5, 4-6, 8-6 తేడాతో రోజర్స్ (అమెరికా)ను ఓడించింది. ప్రారంభం నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. తొలి సెట్‌ను మ్లాడెనొవిక్ దక్కించుకోగా, రెండో సెట్ అమెరికా స్టార్ రోజర్స్ గెలుచుకుంది. ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా ఇద్దరు విజయం కోసం సర్వం ఒడ్డారు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న మ్లాడెనొవిక్ ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ సమంతా స్టోసర్ కూడా ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఏకపక్షంగా సాగిన మూడో రౌండ్‌లో స్టోసర్ 6-2, 6-2 తేడాతో అమెరికా క్రీడాకారిణి మాటెక్‌ను ఓడించింది. మరో పోటీలో ఒస్తాపెంకో (లాత్వియా) మూడో రౌండ్‌లో విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఒస్తాపెంకో 6-1, 6-4 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి సురెంకొను ఓడించింది.

ఎదురులేని నాదల్…

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో తొమ్మిది సార్లు ఛాంపియన్, స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ అల వోకగా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్ర వారం జరిగిన మూడో రౌండ్‌లో నాలుగో సీడ్ నాదల్ 6-0, 6-1, 6-1 తేడాతో జార్జియా ఆట గాడు నికొలెజ్ బాషిలాష్విలిను చిత్తు చేశాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన నాదల్ ఏ దశ లోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. తన మార్క్ షాట్లతో చెలరేగిన నాదల్ సునాయాస విజయం తో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకొన్నాడు.

చెమటోడ్చిన జొకోవిచ్

అయితే రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ మాత్రం చెమటోడ్చి విజయం సాధించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన మూడో రౌండ్‌లో జొకోవిచ్ 5-7, 6-3, 3-6, 6-1, 6-1 తేడాతో అర్జెంటీనా ఆటగాడు డిగో స్కావర్ట్‌మన్‌ను ఓడించాడు. ఐదు సెట్ల పోరాటంలో డిగో చివరి వరకు జొకోవిచ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. మరో పోటీలో ఐదో సీడ్ రోనిక్ (కెనడా) విజయం సాధించాడు. ప్రత్యర్థి ఆటగాడు గ్రాసియా లోపెజ్ (స్పెయిన్) మూడో రౌండ్ పోటీ మధ్య నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.

దీంతో అప్పటికే 6-1, 1-0 ఆధిక్యంలో ఉన్న రోనిక్ ముందంజ వేశాడు. మరో పోటీలో ఆరో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) జయకేతనం ఎగుర వేశాడు. మూడో రౌండ్‌లో థీమ్ 6-1, 7-6,6-3తో జాన్సన్ (అమెరికా)ను ఓడించి ముందంజ వేశాడు. అయితే పదకొండో సీడ్ దిమిత్రి (బల్గేరియా) మూడో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. పదో సీడ్ గోఫిన్ (బెల్జియం) కూడా గాయం వల్ల పోటీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. కాగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్(భారత్), మార్టినా హింగిస్ జోడీ పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో కూడా లియాండర్ పేస్, లిప్స్‌కి(అమెరికా) జంటకు చుక్కెదురైంది.

Comments

comments