Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

‘సర్వమతాల ఏకత్వంలోనే భారతీయత నిలబడి ఉంటుంది’

pranab

నాగ్ పూర్: ‘సహనమే మన శక్తి అని, బహుళత్వాన్ని గౌరవించి, భిన్నత్వాన్ని సంబరంగా భావించడంలోనే మన దేశ గొప్పదనం ఇమిడి ఉందని’ మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. గురువారం నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన తృతీయ శిక్షా వర్గ్‌ మూడో వార్షికోత్సవం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణబ్ ప్రసంగించారు. జాతీయత, దేశభక్తి అన్న భావనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకే ఇక్కడికి వచ్చానని అయన అన్నారు. బహుళత్వాన్ని ఆస్వాదించే గుణం మన జీవన విధానంలో ఉందన్నారు. జాతి, జాతీయత అనే భావనలు ఐరోపా కంటే ముందే మన దేశంలో ఏర్పడ్డాయన్నారు. ప్రాచీనకాలం నుంచి భారత్‌లోని విద్యాసంస్థలకు విదేశీ విద్యార్థులు వచ్చేవారని.. తక్షశిల, నలంద, విక్రమ శిల వంటి విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యవ్యాప్తికి నిదర్శనమని ఆయన కొనియాడారు. బుద్ధిజం దక్షిణ మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వరకు విస్తరించిందన్నారు. మౌర్యుల పాలన దేశాన్ని ఒక్క తాటిపైకి తెచ్చిందని, అశోక చక్రవర్తి సమయంలో దేశమంతా భౌగోళికంగా ఏకఛత్రాధిపత్యం కిందకు వచ్చిందంటూ చరిత్రకు సంబంధించిన విషయాలను ప్రణబ్ గుర్తుచేశారు. మన దేశానికి వచ్చిన అనేక జాతులు, సంస్కృతులు మన జీవనవిధానంలో విలీనమయ్యాయని, భిన్న జాతుల సంస్కృతి.. భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. సర్వమతాల ఏకత్వంలోనే భారతీయత నిలబడి ఉంటుందని పేర్కొన్నారు. ఎవరి నమ్మకాలు, ఆలోచనలు ఏవైనా జాతీయత మాత్రం ఒక్కటే అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిని దేశంలో విలీనం చేసిన ఘనత వల్లభాయ్‌ పటేల్‌ దేనని అన్నారు. మహాత్మ గాంధీజీ చెప్పినట్టు జాతీయవాదం ఏ ఒక్కరిది కాదని, పైగా అదేం ప్రమాదకరం కాదని పేర్కొన్నారు.  అసహనం, ఆందోళన  వంటివి మన జాతీయ భావనను దెబ్బతీస్తాయని అన్నారు. మతం, అధికారవాద సూత్రాలు, అసహనం తదితర అంశాల ద్వారా మన జాతీయవాదాన్ని నిర్వచించుకునే ప్రయత్నం చేయడమంటే.. మనం మన ఉనికిని దెబ్బతీసుకున్నట్టేనని చెప్పారు. ప్రజాస్వామ్యమే మన అత్యుత్తమ ఖజానా అని, ప్రజాస్వామ్యం అంటే కానుక కాదని, అదొక ప్రవిత్రమైన మార్గదర్శనమని ఉద్బోధించారు. ప్రతి రోజు మన చుట్టు చోటుచేసుకుంటున్న హింస పెరిగిపోతూనే ఉందని, ఈ హింస అంధకారానికి ప్రతిరూపమని సూచించారు. మన మాతృభూమి శాంతి, సామరస్యం, సంతోషం కావాలని అర్ధిస్తోందని.. అందుకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిదని  ప్రణబ్‌  పేర్కొన్నారు.

Comments

comments