Home వార్తలు మల్టీ టాలెంటెడ్ స్టార్లు!

మల్టీ టాలెంటెడ్ స్టార్లు!

Multi-talented11950కంటే ముందు వచ్చిన తెలుగు సినిమాల్లో నటించిన హీరోలు, హీరోయిన్‌లు మల్టీ టాలెంటెడ్‌గా ఉండేవారు. హీరోలు… ముఖ్యంగా హీరోయిన్‌లు తమ సినిమాల్లో పాటలు తామే పాడుకునేవారు. రంగస్థలం నుంచి వచ్చిన వారు కావడంతో పాటల్ని అవలీలగా పాడేస్తూ సింగర్స్ అవసరం లేకుండా చేసేవారు. నాగయ్య, ఎస్.వరలక్ష్మీ, భానుమతి వంటి నటీనటులు సినిమాల్లో తమ పాటలను తామే ఆలపించేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ నేపథ్య గాయకుల ప్రాముఖ్యత పెరిగింది. దీంతో చాలా కాలం నటీనటులు పాటల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ ఆ పాత రోజులు వస్తున్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈమధ్య హీరోలు, హీరోయిన్లు తమ సినిమాల్లోని పాటల్ని పాడేస్తూ సింగర్స్‌ను మరపిస్తున్నారు. తమ సొంత గొంతులతో పాటలు పాడి ఆయా చిత్రాలకు హైలైట్‌గా నిలుస్తున్నారు. పవన్‌కళ్యాణ్ నుండి మంచు మనోజ్, సంపూర్ణేష్‌బాబు వరకు ఇదే వరస. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్ పాడిన ‘కాటమ రాయుడా…’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈమధ్య కాలంలో తెలుగులో పాటలు పాడడానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఈమధ్యన తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాట పాడి అభిమానుల్ని అలరిస్తున్నాడు. తొలిసారిగా ఎన్టీఆర్ ‘యమదొంగ’లో పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆతర్వాత రభస, నాన్నకు ప్రేమతో చిత్రాలలో కూడా పాటలు పాడి అందరినీ మెప్పించాడు. ప్రొఫెషనల్ సింగర్‌గా పాడుతూ పాటల ప్రియులను అలరిస్తున్నాడు. కానీ ఇంతవరకు కేవలం తన సినిమాల్లోనే పాటలు పాడిన ఎన్టీఆర్ తాజాగా కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ‘చక్రవ్యూహ’ చిత్రంలో ఓ కన్నడ పాట పాడి అలరించాడు. ఈ పాటను తమన్ తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ‘గెలియా… గెలియా’ అంటూ ఈ పాటలో ఎన్టీఆర్ తన సింగింగ్ టాలెంట్‌తో అదరగొట్టాడు. ఈ పాట విని ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మొత్తానికి ఈ పాటతో ఎన్టీఆర్ తానో ప్రొఫెషనల్ సింగర్ అనిపించుకుంటున్నాడని ఫ్యాన్స్ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలాగే రవితేజ కూడా పాటలు పాడుతూ అభిమానులు, ప్రేక్షకుల్ని మైమరపిస్తున్నాడు. తాజాగా నారా రోహిత్ కూడా ఓ పాట పాడాడు. ఆమధ్య నిత్యామీనన్ ‘అలా మొదలైంది’ చిత్రం కోసం రఘు కుంచె సంగీత సారధ్యంలో ఓ పాట పాడింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘నాయకి’ తెలుగు వర్షన్ కోసం త్రిష ఓ పాట పాడింది. టాలీవుడ్‌లోకి ప్రవేశించి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకోని త్రిష ఇప్పుడు పాట పాడేయడం విశేషం. ఈ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పే ఆలోచనలో త్రిష ఉన్నట్టు సమాచారం. ఇక టాలీవుడ్, కోలీవుడ్‌లో తన టాలెంట్‌తో అదరగొడుతున్న అంజలి కూడా ఓ పాట పాడి ఆకట్టుకుంటోంది. తెలుగులో ‘చిత్రాంగద’… తమిళంలో ‘యార్నీ’ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ కామెడీ చిత్రంలో ఈ అందాలతార గొంతు సవరించుకుంది. ‘డ..డ.. డాంగ్..డాంగ్.. డంగ్ చుక్… డంగ్ చుక్…’ అని అంజలి ఆలపించిన పాటను సెల్వగణేషన్, స్వామినాథన్ సంగీత దర్శకత్వంలో ఇటీవల రికార్డ్ చేశారు. ఇలా హీరోహీరోయిన్లు సింగర్స్‌గా కొత్త అవతారం ఎత్తుతూ తమలో మల్టీ టాలెంట్ ఉందని చాటుకుంటున్నారు.