Home ఛాంపియన్స్ ట్రోఫీ నేడు తుది సమరం

నేడు తుది సమరం

  • పుణె ముంబయి ఢీ
  • ఫైనల్‌కు ఉప్పల్ సిద్ధం

హైదరాబాద్ : ఐపిఎల్ పదో సీజన్ తుది సమరానికి ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ సిద్ధమయ్యాయి. ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ సమరం జరుగనుంది. క్వాలిఫయర్-1, లీగ్ మ్యాచుల్లో తమను ఓడించిన పుణెను ఫైనల్లో మట్టి కరిపించాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది. మరోవైపు తుది సమరంలోనూ ముంబయిని ఓడించి కప్పును అందుకోవాలనే లక్షంతో పుణె కనిపిస్తోంది. రెండు సమ ఉజ్జీల మధ్య జరుగుతున్న ఈ సమరం అభిమానులను కనువిందు చేయడం ఖాయం. కాగా, ఫైనల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఫైనల్ మ్యాచ్ కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. విఐపిలు మ్యాచ్‌ను తిలకించేందుకు వస్తుండడంతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

smith--rohit-

ప్రతీకారం కోసం..
ఈ సీజన్‌లో తమపై మూడు మ్యాచుల్లో విజ యం సాధించిన పుణెపై ప్రతీకారం తీర్చుకోవా లనే లక్షంతో ముంబయి మ్యాచ్‌కు సిద్ధమైంది. క్వాలిఫయర్-2లో కోల్‌కతాను చిత్తు చేసిన రోహిత్ సేన ఫైనల్ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముం బయి సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక మిఛెల్ జాన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, హార్దిక్ పాండ్యాలతో కూడిన పటిష్టమైన ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉండనే ఉంది. కిందటి మ్యాచ్‌లో బుమ్రా, జాన్సన్ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో నూ జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీ స్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. మరోవైపు జాన్సన్ కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. హార్ధిక్ కూడా జోరుమీదున్నాడు. ఇక, కర్ణ్ శర్మ తన అద్భుత స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. కిందటి కోల్‌కతా మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ముంబయిని ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. హర్భజన్ సింగ్, కృనాల్ పాండ్యాలు కూడా బంతితో మెరుగ్గా రాణిస్తున్నారు.
రోహిత్‌పై ఆశలు..
మరోవైపు బ్యాటింగ్ ఆశలన్నీ కెప్టెన్ రోహిత్ శర్మపై ఆధారపడి ఉన్నాయి. కిందటి మ్యా చ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ ఫైనల్లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటివరకు అంతంత మాత్రంగానే రాణించిన రోహిత్ తుది సమరంలో భారీ ఇన్నిం గ్స్‌పై కన్నేశాడు. ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ పటేల్‌లు కూడా జోరుమీదున్నారు. పార్థివ్ నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈసారి కూడా అతను జట్టుకు కీలకంగా మారాడు. సిమన్స్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టాడు. ఫైనల్లో చెలరేగేం దుకు సిద్ధమయ్యాడు. అంబటి రాయుడు కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. అతను విజృంభిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక, ఆల్‌రౌండర్లు హార్ధిక్ పాం డ్యా, కృనాల్ పాండ్యా, కిరొన్ పొలార్డ్‌లు కూడా ఇటు బ్యాట్‌తో, అటు బంతితో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. లీగ్ దశలో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టడం లో ఈ త్రయం పాత్ర చాలా కీలకమైంది. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టు కుంది.
గెలుపే లక్షంగా…
తొలిసారి ఐపిఎల్ ఫైనల్‌కు చేరిన పుణె జట్టు ఎలాగైన కప్పు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ ఏడాది తర్వాత ఐపిఎల్ నుంచి కనుమరుగు కానున్న పుణె అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. ఈసా రి కూడా ముంబయి ఓడించి ఐపిఎల్‌లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటాలనే పట్టుదల తో ఉంది. జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అజింక్య రహానె, కెప్టెన్ స్టివ్ స్మిత్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారి వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు చెలరేగిన పుణెకు విజయం కష్టమేమి కాదు. కిందటి మ్యాచ్‌లో ధోనీ ఫాంను అందుకున్నాడు. కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. రహానె, మనోజ్‌లు కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు కెప్టెన్ స్మిత్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. బౌలింగ్‌లో కూడా పుణె మెరుగ్గా ఉంది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన యువ స్పిన్నర్ ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఉనద్కట్, శార్దూల్ ఠాకూర్, క్రిస్టియన్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు స్మిత్‌కు అందుబాటులో ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభకు కొదవలేదు. దీంతో ఫైనల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
జట్లు అంచనా
ముంబయి: రోహిత్ శర్మ(కెప్టెన్), పార్థివ్ పటేల్, లెండిల్ సిమన్స్, రాయుడు, పొలార్డ్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, మెక్లెనగాన్, కర్ణ్ శర్మ, జాన్సన్, బుమ్రా
పుణె: స్మిత్ (కెప్టెన్), అజింక్య రహానె, రాహుల్ త్రిపాఠి, మనోజ్ తివారి, మహేంద్ర సింగ్ ధోనీ, క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, ఉనద్కట్, ఫెర్గుసన్, శార్దూల్ ఠాకూర్, ఆడమ్ జంపా.