Home జాతీయ వార్తలు అక్కడ లీటర్ పెట్రోల్ 29 రూపాయిలే!

అక్కడ లీటర్ పెట్రోల్ 29 రూపాయిలే!

petrol1

ముంబయి : దేశ వ్యాప్తంగా తరుచూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఒక్కో రోజు భారీగా ధరలు పెరిగితే.. మరో రోజు కాస్తో కూస్తో ధరలు తగ్గిస్తూ ఉంటాయి చమురు సంస్థలు. కానీ ముంబయి ప్రజలకు మాత్రం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దేశంలో ఎక్కడ ధరలు పెంచకముందే.. ముంబయిలో కరువు సెన్స్ పేరుతో ఒక్కసారిగా పెట్రోల్ రేట్లను రూ.3 రూపాయిలు పెంచేసింది. దీంతో ముంబయి వాసులు లీటర్ పెట్రోల్‌ను రూ.77.50లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిజానికి ముడిచమురు ధరలు, డాలర్-రూపాయి ఎక్స్‌ఛేంజ్ రేట్లు చూసుకుంటే మార్కెటింగ్ ఛార్జీలు కలుపుకొని రూ.29లకే చమురు సంస్థలు పెట్రోల్‌లను విక్రయిస్తాయి. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాదే పన్నులు, సెన్సులు కలుపుకొని ఈ ధర ఏకంగా 77.50 రూపాయిలకు చేరింది. అంటే మార్కెట్ ధర కంటే రూ.47.93 అధిక మొత్తాన్ని ప్రజలు పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తున్నారన్న మాట. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్, సెన్సులు, పెట్రోల్ బంకు యజమానుల కమిషన్ ఉంటుంది. దీంతో అసలు ధర కంటే 153శాతం మొత్తాన్ని పన్నుల రూపంలో వినియోగారులపై భారం పడుతోంది. ఇది అసలు విషయం. అయితే ఇది కేవలం ముంబయిలో మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు పన్నులవాత మోత మోగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులను ప్రధాన వనరుగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది.